చరిత్రాత్మక టెస్టు మొదలైంది..
అడిలైడ్: అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ మొట్టమొదటి డే నైట్ టెస్ట్ మ్యాచ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టులో టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. 138 ఏళ్ల టెస్టు చరిత్రలో తొలిసారిగా ఫ్లడ్ లైట్ల వెలుతురులో సాగే మ్యాచ్‌గా ఇది రికార్డు సృష్టించనుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో ఎరుపు, తెలుపు బంతులు కాకుండా కొత్తగా గులాబీ రంగు బంతులను వాడనున్నారు. ఈ సరికొత్త మార్పు అభిమానులను ఆకర్షిస్తుందని ఐసీసీ భావిస్తోంది.
ఇక జట్ల విషయానికి వస్తే ఆసీస్ పేసర్ మిషెల్ జాన్సన్ అనూహ్య రిటైర్‌మెంట్ అనంతరం జరుగుతున్న మ్యాచ్ కావడంతో అతడి స్థానంలో పీటర్ సిడెల్ జట్టులోకి వచ్చాడు. ఉస్మాన్ ఖవాజా గాయం కారణంగా తప్పుకోవడంతో షాన్ మార్ష్ కు అవకాశం లభించింది. వార్నర్ భీకర ఫామ్ కివీస్ కు ఆందోళనే. స్టార్క్, స్మిత్‌లకు ఇంతకు ముందు పింక్ బంతులతో ఆడిన అనుభవం ఉంది. ఇక 0-1తో వెనుకబడిన కివీస్ అడిలైడ్ టెస్టును నెగ్గి సిరీస్ సమం చేయాలనే ఆలోచనలో ఉంది. టేలర్, విలియమ్సన్, మెకల్లమ్ ఫామ్‌లో ఉన్నారు. గప్టిల్ పేలవ ఆటతీరు జట్టును ఆందోళనపరుస్తోంది.
ఉ. గం. 9.00 నుంచి
స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం