క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో పర్యాటక ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ గెలుపుతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. డబ్యూటీసీలో ప్రస్తుతం ఆసీస్ విజయాల శాతం 62.51గా ఉంది.
ప్రస్తుత డబ్యూటీసీ సైకిల్‌లో ఆసీస్ 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 90 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఆసీస్ చేతిలో ఓడిన న్యూజిలాండ్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారింది. ఆ జట్టు ప్రస్తుత డబ్లూటీసీ సైకిల్‌లో 50 శాతం విజయాలతో 36 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై విజయంతో టీమిండియా తమ విజయాల శాతాన్ని మరింత మెరుగుపర్చుకుని టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుంది. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తర్వాత బంగ్లాదేశ్ (50 శాతం విజయాలు), పాకిస్తాన్ (36.66), వెస్టిండీస్ (33.33), సౌతాఫ్రికా (25), ఇంగ్లండ్ (17.5) వరుస స్థానాల్లో ఉన్నాయి.
ఇదిలా ఉంటే, మిచెల్ మార్ష్ (80), అలెక్స్ క్యారీ (98 నాటౌట్), పాట్ కమిన్స్ (32 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ను 3 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. 279 పరుగుల లక్ష్య ఛేదనలో 80 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి కొరల్లో చిక్కుకున్న ఆసీస్‌ను ఈ ముగ్గురు కలిసి విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 162, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 372 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగులకు ఆలౌటైన ఆసీస్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసి, 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment