World Test Championship 2021 23 Final - Teams Qualification Scenario After England Vs South Africa Series: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తొలిసారిగా ప్రవేశపెట్టిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో అరంగేట్రంలోనే ఫైనల్ చేరింది టీమిండియా. కానీ.. విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు తుదిపోరులో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది.
తద్వారా డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచిన తొలి జట్టుగా చరిత్రలో నిలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. అసలైన మ్యాచ్‌లో భారత్‌పై నెగ్గి కేన్ విలియమ్సన్ బృందం ఈ ఘనతను తమ సొంతం చేసుకుంది.
ఇక ప్రస్తుతం డబ్యూటీసీ 2021-23 సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌లలో టీమిండియా.. ఆరు గెలిచి నాలుగింట ఓడింది. రెండు డ్రా చేసుకుంది. ఈ నేపథ్యంలో 75 పాయింట్ల(52.08 శాతం)తో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
టాప్‌లో ఆసీస్..
కాగా ఆస్ట్రేలియా ఆడిన 10 మ్యాచ్‌లలో ఆరింట గెలిచి.. 3 డ్రా చేసుకుంది. కేవలం ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయింది. దీంతో 84 పాయింట్ల(70 శాతం)తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు.. శ్రీలంక 10 మ్యాచ్‌లలో ఐదు గెలిచి.. నాలుగు ఓడి.. ఒక టెస్టు డ్రా చేసుకుని 64 పాయింట్ల(53.33 శాతం)తో మూడో స్థానంలో ఉంది.
ఇక రెండో స్థానంలో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా తాజాగా ఇంగ్లండ్‌తో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి టెస్టు సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. దీంతో.. ప్రొటిస్ జట్టు పరాజయాల సంఖ్య నాలుగుకు చేరింది. సాధించిన విజయాలు 6. మొత్తంగా పదింటికి ఆరు గెలిచి 72 పాయింట్ల(60 శాతం)తో ప్రస్తుతం తన స్థానాన్ని కాపాడుకుంది.
ఈ నేపథ్యంలో ఫైనల్ బెర్తు కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, టీమిండియా మధ్య గట్టి పోటీ నెలకొంది. వీటితో పాటు పాకిస్తాన్, వెస్టిండీస్ సైతం రేసులో ఉన్నాయి. మరి ఏ జట్టు అవకాశాలు ఎలా ఉన్నాయి? రేసులో ముందుంది ఎవరు? భారత జట్టు మరోసారి ఫైనల్ చేరుకోవాలంటే అవసరమైన సమీకరణాలు ఎలా ఉన్నాయి? ఓసారి గమనిద్దాం.
ఆస్ట్రేలియా
డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో ఆస్ట్రేలియా ఇంకా ఆడాల్సిన మ్యాచ్‌లు తొమ్మిది. కంగారూలు స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు, దక్షిణాఫ్రికాతో మూడు.. ఇండియా పర్యటనలో నాలుగు టెస్టులు ఆడాల్సి ఉంది.
వీటిలో రోహిత్ సేనతో తాము ఆడే సిరీస్ ఆస్ట్రేలియాకు కీలకం. టీమిండియాతో సిరీస్‌లో మంచి ఫలితాలు సాధిస్తే గనుక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు తొలిసారి అర్హత సాధించే అవకాశాన్ని ఆసీస్ సొంతం చేసుకుంటుంది.
దక్షిణాఫ్రికా
ప్రొటిస్ జట్టు ఆస్ట్రేలియా గడ్డ మీద మూడు, వెస్టిండీస్‌తో స్వదేశంలో రెండు టెస్టు ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్‌కు తాజాగా 1-2తో సిరీస్ కోల్పోవడంతో దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరే అవకాశం చేజార్చుకున్నట్లయింది.
అయినప్పటికీ రెండో స్థానంలో కొనసాగుతుండటం ప్రొటిస్‌కు సానుకూలాంశం. అయితే ఆసీస్ గడ్డ మీద గనుక సౌతాఫ్రికా తడబడితే రెండో ర్యాంకు కూడా కోల్పోవడం ఖాయం.
శ్రీలంక
తాజా డబ్ల్యూటీసీ సైకిల్‌లో శ్రీలంకకు మిలిగి ఉన్న టెస్టులు రెండు మాత్రమే. అది కూడా న్యూజిలాండ్ పర్యటనలో కివీస్‌తో రెండు మ్యాచ్‌లు. కానీ కివీస్ గడ్డపై లంక రికార్డు చెత్తగా ఉంది. అక్కడ వాళ్లు 19 మ్యాచ్‌లు ఆడితే కేవలం రెండు గెలిచారు. ఒకవేళ అక్కడ గనుక మరోసారి చేదు ఫలితమే ఎదురైతే లంక టాప్-2కు చేరడం దాదాపు అసాధ్యం.
ఇండియా
రోహిత్ శర్మ సేన ఈ డబ్ల్యూటీసీ సీజన్లో ఇంకా ఆరు టెస్టులు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ పర్యటనలో రెండు.. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది.
ఇక స్వదేశంలో ఆసీస్‌పై ఇండియాకు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంగారూలకు కంగారు పుట్టించి పలు సిరీస్‌లు సొంతం చేసుకుంది భారత జట్టు. బంగ్లాదేశ్‌పై కూడా భారత్‌కు మంచి రికార్డే ఉంది.
ఈ సానుకూల అంశాల నేపథ్యంలో టీమిండియా ఆరింటికి ఆరు గెలిస్తే శ్రీలంక, దక్షిణాఫ్రికాలను వెనక్కి నెట్టి టాప్-2కు చేరుకోవడం ఏమంత కష్టం కాదు. వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరే సువర్ణ అవకాశం ప్రస్తుతం టీమిండియాకు ఉంది.
పాకిస్తాన్ సైతం
పాకిస్తాన్ డబ్ల్యుటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో నాలుగు గెలిచి.. రెండు డ్రా చేసుకుంది. మూడింట ఓడింది. దీంతో 56 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
అయితే, మిగిలి ఉన్న మ్యాచ్‌లన్నీ సొంతగడ్డ మీద ఆడబోతోండటం పాకిస్తాన్‌కు కలిసి వచ్చే అంశం. స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు, న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు ఆడనుంది బాబర్ ఆజం బృందం.
ఈ ఐదు మ్యాచ్‌లలో గనుక పాకిస్తాన్ గెలిస్తే ఆ జట్టు విజయశాతం 51.85 నుంచి ఏకంగా 69.05 శాతానికి చేరుకుంటుంది. అదే జరిగితే పాక్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవడం లాంఛనమే. ఒకవేళ టీమిండియా కూడా బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను మట్టికరిపించి.. ఫైనల్ చేరితే.. దాయాదుల పోరు ఈ టోర్నీని మరింత రసవత్తరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
వెస్టిండీస్
వెస్టిండీస్ ఆస్ట్రేలియాలో రెండు టెస్టులు.. దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఒకవేళ ఈ నాలుగు మ్యాచ్‌లలో గనుక విండీస్ విజయం సాధిస్తే(65.38 శాతం) డబ్ల్యూటీసీ23 ఫైనల్‌కు చేరడం కష్టమేమీ కాదు.
స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో విజయం.. బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేయడం వంటి సానుకూల అంశాలు వెస్టిండీస్ జట్టులో ఉత్తేజాన్ని నింపుతాయి. అదే విధంగా ఆ జట్టు కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ సైతం ఫామ్‌లో ఉండటం వారికి కలిసి వచ్చే అంశం. కాగా ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో విండీస్.. నాలుగు గెలిచి.. రెండు డ్రా చేసుకుని 54 పాయింట్లు(50 శాతం)తో ఆరో స్థానంలో కొనసాగుతోంది.
Photo source : ICC
చదవండి: తిరుగులేని కోహ్లి.. సరికొత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఘనత!
తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment