ఆసీస్‌.. వార్నర్‌.. స్టార్క్‌ | Australia's Domination Continues In Day And Night Tests | Sakshi
Sakshi News home page

ఆసీస్‌.. వార్నర్‌.. స్టార్క్‌

Published Sat, Nov 30 2019 1:49 PM | Last Updated on Sat, Nov 30 2019 1:58 PM

Australia's Domination Continues In Day And Night Tests - Sakshi

అడిలైడ్‌:  డే అండ్‌ నైట్‌ టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా హవా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ డే అండ్‌ నైట్‌ టెస్టుల్లో ఆసీస్‌కు పరాజయం అనేది లేదు. ఐదు టెస్టులు ఆడగా ఐదు టెస్టుల్లోనూ ఆసీస్‌ విజయాల్ని నమోదు చేసి తిరుగులేని రికార్డుతో ఉంది. కాగా, తాజాగా పాకిస్తాన్‌తో  అడిలైడ్‌ ఓవల్‌ వేదికగా జరుగుతున్న డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 589/3  వద్ద డిక్లేర్డ్‌ చేసింది. డేవిడ్‌ వార్నర్‌(335 నాటౌట్‌;  418 బంతుల్లో 39 ఫోర్లు, 1 సిక్స్‌) ట్రిపుల్‌ సెంచరీకి తోడు లబూషేన్‌(162; 238 బంతుల్లో 22 ఫోర్లు)  సెంచరీ సాధించడంతో ఆసీస్‌ భారీ స్కోరు చేసింది.

అయితే డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌లకు సంబంధించి మూడు ప్రధాన రికార్డులు ఆసీస్‌ పేరిటే లిఖించబడ్డాయి. డే అండ్‌ నైట్‌ టెస్టు చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును తాజాగా ఆసీస్‌ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ స్కోరును ఆసీస్‌ అధిగమించింది.  2016లో వెస్టిండీస్‌తో జరిగిన డే అండ్‌ నైట్‌ టెస్టులో పాకిస్తాన్‌ మూడు వికెట్ల నష్టానికి 579 పరుగులు సాధించగా, దాన్ని ఆసీస్‌ బ్రేక్‌ చేసింది. ఇక డే అండ్‌ నైట్‌ టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు, అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు సైతం ఆసీస్‌ పేరిటే లిఖించబడింది. ఈ పింక్‌ బాల్‌ టెస్టులో డేవిడ్‌ వార్నర్‌ అత్యధిక పరుగుల రికార్డుతో పాటు అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును సాధించాడు. పాకిస్తాన్‌ కెప్టెన్‌ అజహర్‌ అలీ చేసిన 302 వ్యక్తిగత పరుగుల రికార్డును వార్నర్‌ చెరిపివేయగా,  ఓవరాల్‌గా డే అండ్‌ నైట్‌ టెస్టుల్లో ఓవరాల్‌గా అజహర్‌ నమోదు చేసిన 456 పరుగుల అత్యధిక పరుగుల రికార్డును సైతం ఈ ఆసీస్‌ ఓపెనర్‌ సవరించాడు.

మరొకవైపు డే అండ్‌ నైట్‌ టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డు ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ పేరిట ఉంది. ప్రస్తుతం స్టార్క్‌ 23 వికెట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ఆసీస్‌కే చెందిన హజల్‌వుడ్‌(21 వికెట్లు) రెండో స్థానంలో ఉండగా, పాకిస్తాన్‌ స్పిన్నర్‌ యాసిర్‌ షా(18 వికెట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. తాజా పింక్‌ బాల్‌ టెస్టులో పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన కాసేపటికే ఇమాముల్‌ హక్‌(2) వికెట్‌ను కోల్పోయింది. స్టార్క్‌ వేసిన ఐదో ఓవర్‌ మూడో బంతికి వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఇమాముల్‌ పెవిలియన్‌ చేరాడు. దాంతో మూడు పరుగుల వద్ద పాకిస్తాన్‌ మొదటి వికెట్‌ను నష్టపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement