అవధ్ ఆనందం
పుట్టినరోజునాడు ‘కింగ్’ నాగార్జునకు షాక్... ఐబీఎల్‌లో ముంబై మాస్టర్స్ జట్టు ఆయనకు విజయాన్ని కానుకగా ఇవ్వడంలో విఫలమైంది. హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్లో అవధ్ వారియర్స్‌దే పైచేయి అయింది. ఆటగాళ్ల సమష్టి రాణింపుతో సింధు సేన లీగ్ తుది పోరుకు అర్హత సాధించింది. శనివారం సైనా నేతృత్వంలోని హాట్‌షాట్స్‌తో పోటీకి సిద్ధమైంది.
బెంగళూరు: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో అవధ్ వారియర్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం ఇక్కడి కంఠీరవ స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అవధ్ జట్టు 3-2 తేడాతో ముంబై మాస్టర్స్‌పై విజయం సాధించింది. రెండు పురుషుల సింగిల్స్ ముంబై గెలుచుకోగా, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్ వారియర్స్ నెగ్గడంతో స్కోరు 2-2తో సమమైంది. కీలకమైన మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో అవధ్‌దే పైచేయి అయింది. శనివారం ముంబైలో జరిగే లీగ్ ఫైనల్లో హైదరాబాద్ హాట్‌షాట్స్‌తో అవధ్ వారియర్స్ తలపడుతుంది.
లీ చోంగ్ వీ శుభారంభం
పురుషుల తొలి సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ లీ చోంగ్ వీ 21-15, 21-7 స్కోరుతో గురుసాయిదత్‌ను చిత్తు చేశాడు. చోంగ్ వీని ఈ లీగ్‌లో ఇబ్బంది పెట్టిన భారత ఆటగాళ్లు అజయ్ జయరామ్, శ్రీకాంత్‌ల తరహాలో గురుసాయిదత్ పోరాటపటిమ కనబర్చలేకపోయాడు. తొలి గేమ్‌లో స్కోరు 4-4తో ఉన్న దశలో చక్కటి డ్రాప్ షాట్‌తో ఆధిక్యంలోకి దూసుకుపోయి లీ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.
ఒక దశలో వరుస స్మాష్‌లతో పాయింట్లు సాధించిన గురు 12-13తో చేరువగా వచ్చాడు. ఈ సారి చోంగ్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్లి తొలి గేమ్ గెల్చుకున్నాడు. రెండో గేమ్‌లో మాత్రం సాయిదత్ పూర్తిగా చేతులెత్తేశాడు. ఒత్తిడిని తట్టుకోలేక అనవసర తప్పిదాలతో వరుసగా పాయింట్లు సమర్పించుకున్నాడు. 3-2 నుంచి లీ వరుసగా 11 పాయింట్లు సాధించి 14-2కు చేరాడు. ఆ తర్వాత లీ గెలుపు లాంఛనమే అయింది.
సింధు మరోసారి...
లీగ్ దశలో టిన్ బాన్‌ను ఓడించి పీవీ సింధు ఈ సారి కూడా తన ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుస గేమ్‌లలో 21-16, 21-13తో మ్యాచ్ నెగ్గింది. ఆరంభంలో వెనుకబడినా...వరుస పాయింట్లతో సింధు 7-4కు చేరింది. చక్కటి ప్లేసింగ్స్‌తో సింధు ఆ తర్వాత పెద్దగా శ్రమ లేకుండానే 15-11తో ఆధిక్యంలో నిలిచింది. 18-16తో ఉన్న దశలో మళ్లీ మూడు పాయింట్లు సాధించి సింధు గేమ్ నెగ్గింది. రెండో గేమ్‌లో బాన్ ఆట పూర్తిగా అదుపు తప్పింది. ఆమె ఆడిన షాట్లలో ఎక్కువ భాగం నెట్‌కు తగలడమో బయట పడటమో జరిగింది. దాంతో సింధు ఖాతాలో సునాయాసంగా పాయింట్లు చేరాయి. వరుస పాయింట్లతో 14-8తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు, అదే ఉత్సాహంతో దూసుకుపోయి మ్యాచ్ సొంతం చేసుకుంది.
వారియర్స్ జోరు...
పురుషుల డబుల్స్‌లో అవధ్ జోడి మార్కిస్ కిడో-మథియాస్ బో చెలరేగింది. ఈ జంట 21-15, 21-10తో ముంబై జంట ప్రణవ్‌చోప్రా-సుమీత్ రెడ్డిలపై సునాయాస విజయ సాధించింది. పురుషుల రెండో సింగిల్స్ మ్యాచ్‌ను నెగ్గిన ఇవనోవ్ మాస్టర్స్ ఆశలను సజీవంగా నిలిపాడు. హోరాహోరీగా సాగిన పోరులో ఇవనోవ్ 21-20, 21-19తో అవధ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌ను ఓడించాడు. దాంతో ఫలితం 2-2తో సమంగా నిలిచింది. ఈ దశలో మిక్స్‌డ్ డబుల్స్‌లో విశేషంగా రాణిస్తున్న వారియర్స్ ద్వయం మార్కిస్ కిడో-పియా బెర్నాడెట్ చక్కటి విజయంతో తమ జట్టును ఫైనల్ చేర్చింది. ఈ జోడి 21-19, 21-15 తేడాతో ముంబై జోడి ఇవనోవ్-టిన్ బాన్‌లను చిత్తు చేసింది.