mumbai masters
-
అవధ్ ఆనందం
పుట్టినరోజునాడు ‘కింగ్’ నాగార్జునకు షాక్... ఐబీఎల్‌లో ముంబై మాస్టర్స్ జట్టు ఆయనకు విజయాన్ని కానుకగా ఇవ్వడంలో విఫలమైంది. హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్లో అవధ్ వారియర్స్‌దే పైచేయి అయింది. ఆటగాళ్ల సమష్టి రాణింపుతో సింధు సేన లీగ్ తుది పోరుకు అర్హత సాధించింది. శనివారం సైనా నేతృత్వంలోని హాట్‌షాట్స్‌తో పోటీకి సిద్ధమైంది. బెంగళూరు: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో అవధ్ వారియర్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం ఇక్కడి కంఠీరవ స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అవధ్ జట్టు 3-2 తేడాతో ముంబై మాస్టర్స్‌పై విజయం సాధించింది. రెండు పురుషుల సింగిల్స్ ముంబై గెలుచుకోగా, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్ వారియర్స్ నెగ్గడంతో స్కోరు 2-2తో సమమైంది. కీలకమైన మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో అవధ్దే పైచేయి అయింది. శనివారం ముంబైలో జరిగే లీగ్ ఫైనల్లో హైదరాబాద్ హాట్‌షాట్స్‌తో అవధ్ వారియర్స్ తలపడుతుంది. లీ చోంగ్ వీ శుభారంభం పురుషుల తొలి సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ లీ చోంగ్ వీ 21-15, 21-7 స్కోరుతో గురుసాయిదత్‌ను చిత్తు చేశాడు. చోంగ్ వీని ఈ లీగ్‌లో ఇబ్బంది పెట్టిన భారత ఆటగాళ్లు అజయ్ జయరామ్, శ్రీకాంత్‌ల తరహాలో గురుసాయిదత్ పోరాటపటిమ కనబర్చలేకపోయాడు. తొలి గేమ్‌లో స్కోరు 4-4తో ఉన్న దశలో చక్కటి డ్రాప్ షాట్‌తో ఆధిక్యంలోకి దూసుకుపోయి లీ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఒక దశలో వరుస స్మాష్‌లతో పాయింట్లు సాధించిన గురు 12-13తో చేరువగా వచ్చాడు. ఈ సారి చోంగ్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్లి తొలి గేమ్ గెల్చుకున్నాడు. రెండో గేమ్‌లో మాత్రం సాయిదత్ పూర్తిగా చేతులెత్తేశాడు. ఒత్తిడిని తట్టుకోలేక అనవసర తప్పిదాలతో వరుసగా పాయింట్లు సమర్పించుకున్నాడు. 3-2 నుంచి లీ వరుసగా 11 పాయింట్లు సాధించి 14-2కు చేరాడు. ఆ తర్వాత లీ గెలుపు లాంఛనమే అయింది. సింధు మరోసారి... లీగ్ దశలో టిన్ బాన్ను ఓడించి పీవీ సింధు ఈ సారి కూడా తన ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుస గేమ్‌లలో 21-16, 21-13తో మ్యాచ్ నెగ్గింది. ఆరంభంలో వెనుకబడినా...వరుస పాయింట్లతో సింధు 7-4కు చేరింది. చక్కటి ప్లేసింగ్స్‌తో సింధు ఆ తర్వాత పెద్దగా శ్రమ లేకుండానే 15-11తో ఆధిక్యంలో నిలిచింది. 18-16తో ఉన్న దశలో మళ్లీ మూడు పాయింట్లు సాధించి సింధు గేమ్ నెగ్గింది. రెండో గేమ్‌లో బాన్ ఆట పూర్తిగా అదుపు తప్పింది. ఆమె ఆడిన షాట్లలో ఎక్కువ భాగం నెట్‌కు తగలడమో బయట పడటమో జరిగింది. దాంతో సింధు ఖాతాలో సునాయాసంగా పాయింట్లు చేరాయి. వరుస పాయింట్లతో 14-8తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు, అదే ఉత్సాహంతో దూసుకుపోయి మ్యాచ్ సొంతం చేసుకుంది. వారియర్స్ జోరు... పురుషుల డబుల్స్‌లో అవధ్ జోడి మార్కిస్ కిడో-మథియాస్ బో చెలరేగింది. ఈ జంట 21-15, 21-10తో ముంబై జంట ప్రణవ్‌చోప్రా-సుమీత్ రెడ్డిలపై సునాయాస విజయ సాధించింది. పురుషుల రెండో సింగిల్స్ మ్యాచ్‌ను నెగ్గిన ఇవనోవ్ మాస్టర్స్ ఆశలను సజీవంగా నిలిపాడు. హోరాహోరీగా సాగిన పోరులో ఇవనోవ్ 21-20, 21-19తో అవధ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌ను ఓడించాడు. దాంతో ఫలితం 2-2తో సమంగా నిలిచింది. ఈ దశలో మిక్స్డ్ డబుల్స్‌లో విశేషంగా రాణిస్తున్న వారియర్స్ ద్వయం మార్కిస్ కిడో-పియా బెర్నాడెట్ చక్కటి విజయంతో తమ జట్టును ఫైనల్ చేర్చింది. ఈ జోడి 21-19, 21-15 తేడాతో ముంబై జోడి ఇవనోవ్-టిన్ బాన్లను చిత్తు చేసింది. -
'గ్రీకువీరుడు' నాగార్జున బర్త్ డే!
-
'కింగ్'కు శుభాకాంక్షలు తెలపండి!
టాలీవుడ్ తోపాటు, మీడియా, క్రీడ, ఇతర వ్యాపార రంగాల్లో విశేషంగా రాణిస్తున్న అక్కినేని నాగార్జున జన్మదినం ఆగస్టు 29. ఆయన మరిన్ని జన్మదినోత్సవాలను జరుపుకుంటూ, అనేక విజయాలను సొంతం చేసుకోవాలని ఆశిస్తూ... అభిమానులతోపాటు మనం కూడా జన్మదినం రోజున నాగార్జునకు శుభాకాంక్షలు తెలియచేద్దాం! -
అక్కినేని నాగార్జున జన్మదినం!
టాలీవుడ్ రంగంలోనే కాక, దక్షిణాది, బాలీవుడ్ లో కూడా అక్కినేని నాగార్జున అంటే ఓ క్రేజ్. నాగార్జున ఓ నటుడిగా సంతృప్తి చెందకుండా, వివిధ రంగాల్లో ప్రవేశించి విజయం సాధిస్తున్నారు. సినిమా రంగంలో విభిన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ, యువ హీరోలకు ధీటుగా పోటినిస్తూ, కెరీర్ ను జాగ్రత్త ప్లాన్ చేసుకుంటూనే వివిధ వ్యాపార రంగాల్లో ప్రవేశించి బిజీగా లైఫ్ గడుపుతున్నారు. అందుకే నాగార్జునను ఓ ప్రయోగశాల అంటారు. నటుడిగా, నిర్మాతగా ఆయన విజన్ ప్రత్యేకమైనది కాబట్టే పలు వ్యాపార రంగాల్లో విజయవంతంగా రాణిస్తున్నన్నారు. టెలివిజన్ వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని, వ్యాణిజ్య ప్రకటనల్లో పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా కనిపిస్తున్నారు. ఇటీవల కాలంలో క్రీడా రంగంలోకి కూడా ప్రవేశించారు. భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ తో జతకట్టి 'మహీ రేసింగ్' జట్టుకు సహ భాగస్వామిగా చేరాడు. అంతేకాక ఇటీవలే ప్రారంభమైన ఇండియన్ బాడ్మింటన్ లీగ్ లో ముంబై మాస్టర్ జట్టును భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, మాజీ క్రికెటర్ చాముండేశ్వరనాథ్ లతో కలిసి సొంతం చేసుకున్నారు. అటు మీడియా, క్రీడ, ఇతర వ్యాపార రంగాల్లో విశేషంగా రాణిస్తున్న అక్కినేని నాగార్జున జన్మదినం ఆగస్టు 29. ఆయన మరిన్ని జన్మదినోత్సవాలను జరుపుకుంటూ, అనేక విజయాలను సొంతం చేసుకోవాలని ఆశిస్తూ... అభిమానులతోపాటు మనం కూడా జన్మదినం రోజున నాగార్జునకు శుభాకాంక్షలు అందచేద్దాం! -
జన్మదినం రోజున ముంబై మాస్టర్ తోనే: నాగార్జున
తన జన్మదినం రోజున ముంబై మాస్టర్ జట్టును పోత్సాహిస్తూ గడపాలనుకుంటున్నట్టు టాలీవుడ్ హీరో నాగార్జున వెల్లడించారు. భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, వ్యాపారవేత్త చాముండేశ్వర నాథ్ ల భాగస్వామ్యంతో నాగార్జున ఐబీఎల్ జట్టును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తన జన్మదినం రోజున బెంగుళూరులో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లో తన జట్టకు ప్రోత్సాహిస్తూ గడుపుతానని తెలిపారు. ఇటీవల కాలంలో భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ తో కలిసి మహీ రేసింగ్ జట్టుకు సహచర భాగస్వామిగా ఉన్నాడు. ఈ సంవత్సరం తాను కొనుగోలు చేసిన జట్లు రాణించడం తనకు సంతోషాన్ని కలిగిస్తోంది అని నాగార్జున అన్నారు. త్వరలో ముగిసే రేసింగ్ లీగ్ లో తమ జట్టు అగ్రస్థానంలో ఉందని, బాడ్మింటన్ లీగ్ లో ముంబై మాస్టర్ జట్టు సెమీ ఫైనల్ కు చేరుకోవడం చాలా ఆనందంగా ఉందన్నాడు. ఇలాగే తన జట్లు విజయపథంలో ప్రయాణించాలని కోరుకుంటున్నానని నాగార్జున తెలిపారు. ఆగస్టు 29 నాగార్జున జన్మదినం జరుపుకోనున్న నాగార్జున చిత్ర రంగంలోనూ, క్రీడారంగంలో బిజీగా ఉన్నారు. త్వరలోనే నాగార్జున నటించిన భాయ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత ఆస్థాయిలో ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)కు క్రేజ్ లభిస్తున్న సంగతి తెలిసిందే! -
సూపర్ సింధు
బెంగళూరు: తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన అవధ్ వారియర్స్ ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో తేరుకుంది. వరుసగా రెండో మ్యాచ్‌లో గెలిచి సెమీఫైనల్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ముంబై మాస్టర్స్‌తో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అవధ్ వారియర్స్ 3-2తో గెలిచింది. మహిళల సింగిల్స్‌లో తెలుగు అమ్మాయి పి.వి.సింధు అద్భుత ఆటతీరు... డబుల్స్‌లో మార్కిస్ కిడో ప్రదర్శన అవధ్ వారియర్స్ విజయంలో ముఖ్యపాత్ర పోషించాయి. తమ లీగ్ మ్యాచ్‌లు అన్నీ పూర్తి చేసుకున్నప్పటికీ ముంబై మాస్టర్స్ 15 పాయింట్లతో సెమీస్ రేసులో నిలిచింది. తొలి మ్యాచ్‌లో ఇవనోవ్ (ముంబై) 21-18, 20-21, 11-8తో గురుసాయిదత్ (వారియర్స్)పై నెగ్గి ముంబైకు 1-0 ఆధిక్యాన్ని ఇచ్చాడు. రెండో మ్యాచ్‌లో సింధు (వారియర్స్) 21-12, 19-21, 11-8తో టిన్ బౌన్ (ముంబై)పై గెలిచి స్కోరును 1-1వద్ద సమం చేసింది. మూడో మ్యాచ్‌లో మార్కిస్ కిడో-మథియాస్ బో (వారియర్స్) జోడి 21-16, 21-14తో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (ముంబై) జంటను ఓడించి వారియర్స్‌ను 2-1తో ఆధిక్యంలో నిలిపింది. నాలుగో మ్యాచ్‌లో లీ చోంగ్ వీ (ముంబై) 21-15, 20-21, 11-5తో శ్రీకాంత్ (వారియర్స్)పై నెగ్గి స్కోరును 2-2వద్ద సమం చేశాడు. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో మార్కిస్ కిడో-పియా బెర్నాదెత్ (వారియర్స్) జోడి 21-19, 21-15తో ఇవనోవ్-సిక్కి రెడ్డి (ముంబై) జంటపై నెగ్గి అవధ్ వారియర్స్‌కు 3-2తో విజయాన్ని అందించింది. సింధు ప్రతీకారం ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన సింధు ఐబీఎల్ ఆరంభంలో కాస్త తడబడ్డా నెమ్మదిగా తన సహజశైలి ఆటతీరును అందుకుంది. ప్రపంచ మాజీ నంబర్‌వన్, రెండుసార్లు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ టిన్ బౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధు అద్భుత ఆటతీరు ప్రదర్శించింది. ఇద్దరూ పొడగరి క్రీడాకారిణులు కావడంతో స్మాష్‌లు, డ్రాప్ షాట్లు, నెట్‌వద్ద అప్రమత్తత... ఇలా అన్ని అంశాల ఆటతీరును ప్రేక్షకులు ఆస్వాదించారు. అయితే కీలకదశలో సంయమనం కోల్పోకుండా నిగ్రహంతో ఆడిన సింధు పైచేయి సాధించింది. ఈ ఏడాది ఆరంభంలో మలేసియా ఓపెన్ సందర్భంగా టిన్ బౌన్ చేతిలో ఎదురైన పరాజయానికి ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది. తప్పిదాలకు మూల్యం వ్లాదిమిర్ ఇవనోవ్తో జరిగిన తొలి మ్యాచ్‌లో గురుసాయిదత్‌కు విజయం అందినట్టే అంది చేజారిపోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో 6-3తో ఆధిక్యంలో నిలిచిన ఈ తెలుగు కుర్రాడు ఆ తర్వాత లయ తప్పాడు. అనవసర తప్పిదాలు చేసి ఇవనోవ్‌కు పుంజుకునే అవకాశం ఇచ్చాడు. స్కోరును 6-6వద్ద సమం చేసిన ఇవనోవ్ ఆ తర్వాత కీలకదశలో పాయింట్లు నెగ్గి 11-9తో గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. లీ చోంగ్ వీ ‘హ్యాట్రిక్’ గాయం కారణంగా తొలి రెండు లీగ్ మ్యాచ్‌లకు దూరంగా నిలిచిన ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ బరిలోకి దిగాక ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన శ్రీకాంత్ మలేసియా స్టార్ ప్లేయర్ ముందు సులువుగా తలవంచలేదు. లీ చోంగ్ వీ పాయింట్ పాయింట్‌కూ తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేలా చేశాడు. కొన్నిసార్లు చోంగ్ వీ స్మాష్‌లకు దీటుగా జవాబిచ్చిన శ్రీకాంత్ కొన్నిసార్లు మాత్రం ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది. వాస్తవానికి మ్యాచ్ రెండో గేమ్‌లోనే ముగియాల్సినా శ్రీకాంత్ పట్టుదల కారణంగా మూడో గేమ్‌కు వెళ్లింది. కీలకమైన మూడో గేమ్‌లో మాత్రం లీ చోంగ్ వీ తన సత్తా చూపించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. -
సింధు ఇంకా నేర్చుకోవాలి
న్యూఢిల్లీ: అచిరకాలంలోనే సింధు అసాధారణ ఫలితాలు సాధిస్తున్నప్పటికీ ఆమె ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణి టిన్ బౌన్ తెలిపింది. డెన్మార్క్‌కు చెందిన ఈ దిగ్గజం... భారత స్టార్లు సింధు, సైనా నెహ్వాల్‌ల ప్రతిభను కొనియాడింది. మూడు సార్లు ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌గా నిలిచిన బౌన్... సింధు ఎత్తే ఆమెకు వరమని ప్రత్యర్థులపై అటాకింగ్ గేమ్ ఆడేందుకు ఆ ఎత్తే కలిసి వస్తుందని చెప్పింది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో ఈ డెన్మార్క్ స్టార్ ముంబై మాస్టర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘సైనా, సింధులిద్దరు నాలాగే అగ్రశ్రేణి ప్లేయర్లు. అయితే యువతార సింధు కంటే ఓవరాల్‌గా సైనాయే గొప్ప క్రీడాకారిణి. ఆమె చాన్నాళ్ల నుంచి నిలకడగా ఆడుతోంది. ఆటపై వంద శాతం అంకితభావాన్ని కనబరుస్తోంది కాబట్టే స్థిరంగా టాప్-5లో కొనసాగుతోంది. ఇలా తొలి ఐదు ర్యాంకుల్లో స్థిరంగా నిలవడమంటే మాటలు కాదు... చేతలు కావాలి. సైనా నిజంగా చేతలతో మెప్పించే క్రీడాకారిణి. సింధు కూడా మేటి క్రీడాకారిణికేం తక్కువ కాదు. కానీ ఆమె ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతోంది. ఆమె ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆటకు మెరుగులు దిద్దుకొని స్థిరంగా రాణించడంపైనే ఆమె దృష్టిసారించాలి’ అని బౌన్ పేర్కొంది. సింధు బాగానే ఆడుతున్నప్పటికీ... వరుసగా కొన్ని పాయింట్లు కోల్పోగానే ఆత్మరక్షణలో పడుతోందని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమె సరైన దృక్పథంతో ముందడుగు వేయాలని తెలిపింది. సైనాలాగే ఆమె కూడా రాణించాలంటే... స్వల్పకాలంలో సాధించిన విజయాలకు మురిసిపోకుండా ఆటపైనే ధ్యాస పెట్టాలని బౌన్ సూచించింది. ముఖ్యంగా ప్రత్యర్థులపై ఆధిపత్యం చాటేందుకు అవసరమైన అస్త్రాలతో ఆమె సిద్ధం కావాలని చెప్పింది. ‘తాజాగా టాప్-10లోకి ఎగబాకిన సింధు టాప్-5 లక్ష్యంగా తన ఆటతీరును మెరుగుపర్చుకోవాలి. చైనీయులను సైతం ఓడించే సత్తా ఆమెలో ఉంది. అంతకుమించి ఆమెకు మంచి భవిష్యత్తు కూడా ఉంది’ అని బౌన్ చెప్పుకొచ్చింది. సరైన గుర్తింపు దక్కకపోవడం వల్లే భారత్‌లో ‘డబుల్స్’ ప్రాధాన్యం తగ్గుతోందని టిన్ బౌన్ చెప్పింది. ‘అంతా సింగిల్స్‌నే గొప్పగా చూస్తే... సహజంగా మిగతా కేటగిరీలపై ఆసక్తి సన్నగిల్లుతుంది. మా డెన్మార్క్ డబుల్స్‌కు పెట్టింది పేరు. దీంతో అక్కడ వాళ్లే ఐకాన్ ప్లేయర్లు. కానీ భారత్‌లో సింగిల్స్ క్రీడాకారులే స్టార్లుగా వెలుగొందడంతో డబుల్స్ ప్రాముఖ్యత తగ్గుతోంది’ అని బౌన్ వివరించింది. అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌పై చెప్పిన ఆమె కుటుంబంతో సేదతీరుతోంది. అయితే ప్రస్తుత ఐబీఎల్ టోర్నీలో ఆడటం ద్వారా తనలో ఆటకు దూరమయ్యాననే భావన తొలగిపోయిందని ఆమె చెప్పింది.