సూపర్ సింధు
బెంగళూరు: తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన అవధ్ వారియర్స్ ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో తేరుకుంది. వరుసగా రెండో మ్యాచ్‌లో గెలిచి సెమీఫైనల్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ముంబై మాస్టర్స్‌తో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అవధ్ వారియర్స్ 3-2తో గెలిచింది. మహిళల సింగిల్స్‌లో తెలుగు అమ్మాయి పి.వి.సింధు అద్భుత ఆటతీరు... డబుల్స్‌లో మార్కిస్ కిడో ప్రదర్శన అవధ్ వారియర్స్ విజయంలో ముఖ్యపాత్ర పోషించాయి. తమ లీగ్ మ్యాచ్‌లు అన్నీ పూర్తి చేసుకున్నప్పటికీ ముంబై మాస్టర్స్ 15 పాయింట్లతో సెమీస్ రేసులో నిలిచింది.
తొలి మ్యాచ్‌లో ఇవనోవ్ (ముంబై) 21-18, 20-21, 11-8తో గురుసాయిదత్ (వారియర్స్)పై నెగ్గి ముంబైకు 1-0 ఆధిక్యాన్ని ఇచ్చాడు. రెండో మ్యాచ్‌లో సింధు (వారియర్స్) 21-12, 19-21, 11-8తో టిన్ బౌన్ (ముంబై)పై గెలిచి స్కోరును 1-1వద్ద సమం చేసింది. మూడో మ్యాచ్‌లో మార్కిస్ కిడో-మథియాస్ బో (వారియర్స్) జోడి 21-16, 21-14తో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (ముంబై) జంటను ఓడించి వారియర్స్‌ను 2-1తో ఆధిక్యంలో నిలిపింది. నాలుగో మ్యాచ్‌లో లీ చోంగ్ వీ (ముంబై) 21-15, 20-21, 11-5తో శ్రీకాంత్ (వారియర్స్)పై నెగ్గి స్కోరును 2-2వద్ద సమం చేశాడు. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో మార్కిస్ కిడో-పియా బెర్నాదెత్ (వారియర్స్) జోడి 21-19, 21-15తో ఇవనోవ్-సిక్కి రెడ్డి (ముంబై) జంటపై నెగ్గి అవధ్ వారియర్స్‌కు 3-2తో విజయాన్ని అందించింది.
సింధు ప్రతీకారం
ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన సింధు ఐబీఎల్ ఆరంభంలో కాస్త తడబడ్డా నెమ్మదిగా తన సహజశైలి ఆటతీరును అందుకుంది. ప్రపంచ మాజీ నంబర్‌వన్, రెండుసార్లు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ టిన్ బౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధు అద్భుత ఆటతీరు ప్రదర్శించింది. ఇద్దరూ పొడగరి క్రీడాకారిణులు కావడంతో స్మాష్‌లు, డ్రాప్ షాట్‌లు, నెట్‌వద్ద అప్రమత్తత... ఇలా అన్ని అంశాల ఆటతీరును ప్రేక్షకులు ఆస్వాదించారు. అయితే కీలకదశలో సంయమనం కోల్పోకుండా నిగ్రహంతో ఆడిన సింధు పైచేయి సాధించింది. ఈ ఏడాది ఆరంభంలో మలేసియా ఓపెన్ సందర్భంగా టిన్ బౌన్ చేతిలో ఎదురైన పరాజయానికి ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది.
తప్పిదాలకు మూల్యం
వ్లాదిమిర్ ఇవనోవ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గురుసాయిదత్‌కు విజయం అందినట్టే అంది చేజారిపోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో 6-3తో ఆధిక్యంలో నిలిచిన ఈ తెలుగు కుర్రాడు ఆ తర్వాత లయ తప్పాడు. అనవసర తప్పిదాలు చేసి ఇవనోవ్‌కు పుంజుకునే అవకాశం ఇచ్చాడు. స్కోరును 6-6వద్ద సమం చేసిన ఇవనోవ్ ఆ తర్వాత కీలకదశలో పాయింట్లు నెగ్గి 11-9తో గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
లీ చోంగ్ వీ ‘హ్యాట్రిక్’
గాయం కారణంగా తొలి రెండు లీగ్ మ్యాచ్‌లకు దూరంగా నిలిచిన ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ బరిలోకి దిగాక ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన శ్రీకాంత్ మలేసియా స్టార్ ప్లేయర్ ముందు సులువుగా తలవంచలేదు. లీ చోంగ్ వీ పాయింట్ పాయింట్‌కూ తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేలా చేశాడు. కొన్నిసార్లు చోంగ్ వీ స్మాష్‌లకు దీటుగా జవాబిచ్చిన శ్రీకాంత్ కొన్నిసార్లు మాత్రం ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది. వాస్తవానికి మ్యాచ్ రెండో గేమ్‌లోనే ముగియాల్సినా శ్రీకాంత్ పట్టుదల కారణంగా మూడో గేమ్‌కు వెళ్లింది. కీలకమైన మూడో గేమ్‌లో మాత్రం లీ చోంగ్ వీ తన సత్తా చూపించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.