CT 2025, 2nd Semi Final: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్‌ ఘన విజయం | CT 2025 2nd Semi Final SA vs NZ: Toss Update Playing XIs Bavuma In | Sakshi
Sakshi News home page

CT 2025, 2nd Semi Final: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్‌ ఘన విజయం

Published Wed, Mar 5 2025 2:12 PM | Last Updated on Wed, Mar 5 2025 10:29 PM

CT 2025 2nd Semi Final SA vs NZ: Toss Update Playing XIs Bavuma In

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్లోకి న్యూజిలాండ్‌.. సెమీస్‌లో సౌతాఫ్రికా చిత్తు
ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ సౌతాఫ్రికాపై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మార్చి 9న జరిగే ఫైనల్లో టీమిండియాతో అమీతుమీకి అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ రచిన్‌ రవీంద్ర (108), కేన్‌ విలియమ్సన్‌ (102) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. డారిల్‌ మిచెల్‌ 49 పరుగులతో రాణించగా.. ఆఖర్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (49 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, రబాడ 2, ముల్దర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

భారీ లక్ష్య ఛేదనలో తడబడిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి లక్ష్యానికి 51 పరుగుల దూరంలో నిలిచిపోయింది. బవుమా (56), డసెన్‌ (69) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు ఆడి మిల్లర్‌ మెరుపు సెంచరీ (100 నాటౌట్‌) బాదాడు. మిల్లర్‌ చివరి బంతికి రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కివీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ 3 వికెట్లు తీసి సౌతాఫ్రికా విజయావకాశాలను దెబ్బకొట్టాడు. మ్యాట్‌ హెన్రీ, గ్లెన్‌ ఫిలిప్స్‌ తలో 2, బ్రేస్‌వెల్‌, రచిన్‌ రవీంద్ర చెరో వికెట్‌ పడగొట్టారు.

ఓటమి అంచుల్లో సౌతాఫ్రికా
363 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 212 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. డేవిడ్‌ మిల్లర్‌ (25), కేశవ్‌ మహారాజ్‌ క్రీజ్‌లో ఉన్నారు. సాంట్నర్‌ (7-0-29-3) సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. 

ఐదో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా.. మార్క్రమ్‌ ఔట్‌
189 పరుగుల వద్ద (32.6వ ఓవర్‌) సౌతాఫ్రికా ఐదో వికెట్‌ కోల్పోయింది. రచిన్‌ రవీంద్ర బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చి మార్క్రమ్‌ (31) ఔటయ్యాడు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా.. క్లాసెన్‌ ఔట్‌
167 పరుగుల వద్ద (28.4వ ఓవర్‌) సౌతాఫ్రికా నాలుగో వికెట్‌ కోల్పోయింది. సాంట్నర్‌ బౌలింగ్‌లో హెన్రీకి​ క్యాచ్‌ ఇ‍చ్చి క్లాసెన్‌ (3) ఔటయ్యాడు. మార్క్రమ్‌ (19), డేవిడ్‌ మిల్లర్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

డసెన్‌ ఔట్‌.. మూడో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
363 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 161 పరుగుల వద్ద (26.5వ ఓవర్‌) మూడో వికెట్‌ కోల్పోయింది. సాంట్నర్‌ బౌలింగ్‌లో డసెన్‌ (69) క్లీన్‌ బౌల్డయ్యాడు. మార్క్రమ్‌ (16), క్లాసెన్‌ క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవాలంటే ఇం​కా 202 పరుగులు చేయాలి.

రెండో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
125 పరుగుల వద్ద (22.2వ ఓవర్‌) సౌతాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా (56) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. సాంట్నర్‌ బౌలింగ్‌లో విలియమ్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి బవుమా ఔటయ్యాడు. డసెన్‌కు (50) జతగా మార్క్రమ్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 

ఆచితూచి ఆడుతున్న డసెన్‌, బవుమా
363 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా బ్యాటర్లు బవుమా (42), డసెన్‌ (34) ఆచితూచి ఆడుతున్నారు. 17 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 94/1గా ఉంది. రికెల్టన్‌ 17 పరుగులు చేసి మ్యాట్‌ హెన్రీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

పది ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు:
టెంబా బవుమా 25, డసెన్‌ 14 పరుగులతో ఉన్నారు. 56-1

తొలి వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
4.5: మ్యాట్‌ హెన్రీ బౌలింగ్‌లో ర్యాన్‌ రెకెల్టన్‌ బ్రేస్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 12 బంతులు ఎదుర్కొన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ 17 పరుగులు చేసి నిష్క్రమించాడు. 

రచిన్‌, విలియమ్సన్‌ శతకాలు.. న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. రచిన్‌ రవీంద్ర (108), కేన్‌ విలియమ్సన్‌ (102) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆఖర్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (49 నాటౌట్‌) సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు. 

300 దాటిన న్యూజిలాండ్‌ స్కోర్‌
45.3వ ఓవర్‌: మార్కో జన్సెన్‌ బౌలింగ్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ బౌండరీ బాదడంతో న్యూజిలాండ్‌ స్కోర్‌ 300 దాటింది. ఈ బౌండరీ అనంతరం ఫిలిప్స్‌ వరుసగా మరో మూడు బౌండరీలు బాదాడు. 47వ ఓవర్‌ తొలి బంతికి ఎంగిడి బౌలింగ్‌లో రబాడకు క్యాచ్‌ ఇచ్చి డారిల్‌ మిచెల్‌ (49) ఔటయ్యాడు. 46.3 ఓవర్ల తర్వాత కివీస్‌ స్కోర్‌ 317/5గా ఉంది. ఫిలిప్స్‌తో పాటు బ్రేస్‌వెల్‌ క్రీజ్‌లో ఉన్నాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌
41.1 ఓవర్‌: 257 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో టామ్‌ లాథమ్‌ (4) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. డారిల్‌ మిచెల్‌కు (19) జతగా గ్లెన్‌ ఫిలిప్స్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 

సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఔటైన విలియమ్సన్‌
39.5వ ఓవర్‌: సెంచరీ పూర్తి చేసిన ఓవర్‌లోనే విలియమ్సన్‌ (102) ఔటయ్యాడు. ముల్దర్‌ బౌలింగ్‌లో ఎంగిడికి క్యాచ్‌ ఇచ్చి కేన్‌ మామ పెవిలియన్‌ బాట పట్టాడు. 40 ఓవర్ల అనంతరం న్యూజిలాండ్‌ స్కోర్‌ 252/3గా ఉంది. టామ్‌ లాథమ్‌ (1), డారిల్‌ మిచెల్‌ (17) క్రీజ్‌లో ఉన్నారు.

సెంచరీ పూర్తి చేసుకున్న విలియమ్సన్‌
39.1 ఓవర్‌: ముల్దర్‌ బౌలింగ్‌లో బౌండరీ బాది కేన్‌ విలియమ్సన్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కేన్‌కు ఇది 15వ సెంచరీ. కేన్‌ తన సెంచరీ మార్కును 91 బంతుల్లో చేరుకున్నాడు. 

రచిన్‌ అవుట్‌
రచిన్‌ రవీంద్ర రూపంలో కివీస్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. రబడ బౌలింగ్‌లో రచిన్‌ క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి 108 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. విలియమమ్సన్‌ 80 పరుగులతో ఉండగా.. డారిల్‌ మిచెల్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 213/2 (33.5) 

శతక్కొట్టిన రచిన్‌.. విలియమ్సన్‌ ఫిఫ్టీ
సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో కివీస్‌ బ్యాటర్లు రచిన్‌ రవీంద్ర, కేన్‌ విలియమ్సన్‌ దంచికొడుతున్నారు. 32 ఓవర్లు పూర్తయ్యేసరికి రచిన్‌ 95 బంతుల్లో 105 పరుగులతో నిలవగా.. విలియమ్సన్‌ 74 బంతుల్లో 72 రన్స్‌ సాధించాడు. దీంతో న్యూజిలండ్‌ స్కోరు 201కి చేరింది.

నిలకడగా ఆడుతున్న రచిన్‌, విలియమ్సన్‌
అర్ధ శతకం పూర్తి చేసుకున్న రచిన్‌ రవీంద్ర, విలియమ్సన్‌తో కలిసి 76 పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు చేశాడు. 22 ఓవర్ల ఆట ముగిసే సరికి రచిన్‌ 67, విలియమ్సన్‌ 31 పరుగులతో ఉన్నారు.

పదమూడు ఓవర్లలో న్యూజిలాండ్‌ స్కోరు: 67-1
విలియమ్సన్‌ 11, రచిన్‌ రవీంద్ర 34 పరుగులతో ఉన్నారు.

7.5: తొలి వికెట్‌ కోల్పోయిన కివీస్‌
విల్‌ యంగ్‌ రూపంలో న్యూజిలాండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఎంగిడి బౌలింఘ్‌లో మార్క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి యంగ్‌ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు  వద్ద నిష్క్రమించాడు. విలియమ్సన్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు 48-1(8)

టాస్‌ గెలిచిన కివీస్‌
ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 రెండో సెమీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌(South Africa Vs New Zealand) మధ్య లాహోర్‌ వేదికగా మ్యాచ్‌కు నగారా మోగింది. టాస్‌ గెలిచిన కివీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘వికెట్‌ బాగుంది. అందుకే మేము తొలుత బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాం.

పిచ్‌ కాస్త పొడిగానే ఉంది. న్యూజిలాండ్‌ కెప్టెన్‌గా పనిచేయడం నాకు దక్కిన గౌరవం. మా జట్టు అద్భుతంగా ఆడుతోంది. గత మ్యాచ్‌లో మేము  దుబాయ్‌లో పిచ్‌ పరిస్థితిని అంచనా వేయలేకపోయాం. అయితే, ఇక్కడ త్రైపాక్షిక సిరీస్‌ ఆడిన అనుభవం అక్కరకు వస్తుంది.

గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే సౌతాఫ్రికాతోనూ ఆడబోతున్నాం. ధాటిగా ఆడి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడతాం’’ అని సాంట్నర్‌ తెలిపాడు. ఇక సౌతాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా మాట్లాడుతూ.. ‘‘తొలుత బ్యాటింగ్‌ చేయాలా, బౌలింగ్‌ చేయాల అన్న అంశంలో మాకు ఎలాంటి కన్ఫ్యూజన్‌ లేదు.

నా ఆరోగ్యం బాగానే ఉంది
మా బౌలర్లు ముందుగా వాళ్ల పని పూర్తి చేస్తే.. ఆ తర్వాత బ్యాటర్లు కూడా తమ విధిని నిర్వర్తిస్తారు. ఈ మ్యాచ్‌లో మేము ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నాం. నేను జట్టులోకి వచ్చేశాను. ప్రసుతం నా ఆరోగ్యం బాగానే ఉంది.

గత ఐసీసీ టోర్నమెంట్లలో సెమీ ఫైనల్స్‌, ఫైనల్స్‌ నుంచి మేము పాఠాలు నేర్చుకున్నాం. కీలక సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వద్దని నిశ్చయించుకున్నాం. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఇది సెమీ ఫైనల్‌ కాబట్టి మేము ఒత్తిడికి లోనుకాము. సాధారణ మ్యాచ్‌లాగే దీనిని చూస్తాం’’ అని పేర్కొన్నాడు.

కాగా పాకిస్తాన్‌ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్‌ ట్రోఫీ తుదిదశకు చేరుకుంది. దుబాయ్‌లో జరిగిన తొలి సెమీ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌ చేరింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌ల ఫలితం.. భారత్‌ ప్రత్యర్థి ఎవరన్న అంశాన్ని తేల్చనుంది.

ట్రై సిరీస్‌లో కివీస్‌దే విజయం
ఇక ఈ వన్డే టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. గ్రూప్‌-‘ఎ’ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌.. గ్రూప్‌-‘బి’ నుంచి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్‌, ఇంగ్లండ్‌ పోటీపడ్డాయి. ఇందులో భారత్‌, న్యూజిలాండ్‌.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్‌ చేరగా.. ఆసీస్‌ను టీమిండియా నాకౌట్‌ చేసింది. ఇక గ్రూప్‌-‘బి’ టాపర్‌గా ఉన్న సౌతాఫ్రికా కివీస్‌తో మ్యాచ్‌లో ఏ మేరకు రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 

ఈ మెగా ఈవెంట్‌ ఆరంభానికి ముందు పాకిస్తాన్‌తో సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ ట్రై సిరీస్‌ ఆడగా.. కివీస్‌ పాక్‌, సౌతాఫ్రికాలను ఓడించి విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్‌లో ట్రోఫీ లీగ్‌ దశ చివరి మ్యాచ్‌లలో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను ఓడించగా.. న్యూజిలాండ్‌ భారత్‌ చేతిలో ఓటమిపాలైంది. 

చాంపియన్స్‌ ట్రోఫీ-2025: రెండో సెమీ ఫైనల్‌- సౌతాఫ్రికా వర్సెస్‌ న్యూజిలాండ్‌ తుదిజట్లు
సౌతాఫ్రికా
ర్యాన్ రికెల్టన్, టెంబా బావుమా(కెప్టెన్‌), రాసీ వాన్ డెర్ డసెన్‌, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌ కీపర్‌), డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి.

న్యూజిలాండ్‌
విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్‌ కీపర్‌), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), మాట్ హెన్రీ, కైలీ జెమీసన్, విలియం ఒ'రూర్కీ.

చదవండి: రోహిత్‌ గురించి ప్రశ్న.. ఇచ్చి పడేసిన గంభీర్‌! నాకన్నీ తెలుసు...
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement