
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు మరోసారి సెమీస్ గండాన్ని దాటలేకపోయింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో లహోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో 50 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. డేవిడ్ మిల్లర్ 363 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు మాత్రమే చేయగలిగింది.
డేవిడ్ మిల్లర్ విరోచిత సెంచరీతో పోరాడినా విజయం మాత్రం ప్రోటీస్‌కు దక్కలేదు. లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 218 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో మిల్లర్ విధ్వంసం సృష్టించాడు. వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ అప్పటికే మ్యాచ్ సఫారీల చేజారిపోయింది.
మిల్లర్ 67 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కెప్టెన్ టెంబా బవుమా (56), వాన్ డర్ డుసెన్ (69) అర్ధసెంచరీలతో రాణించారు. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ మూడు కీలక వికెట్లు పడగొట్టి సఫారీలను దెబ్బతీశాడు. అతడితో పాటు ఫిలిప్స్, హెన్రీ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర, బ్రెస్‌వెల్ ఓ వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(108), విలియమ్సన్(102) సెంచరీలతో మెరిశారు.ఇక సెమీస్‌లో ఓటమిపై మ్యాచ్ అనంతరం ప్రోటీస్ కెప్టెన్ టెంబా బవుమా స్పందించాడు. భాగస్వామ్యాలు రాకపోవడంతోనే ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైమని బావుమా తెలిపాడు.
"న్యూజిలాండ్ మా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే వారు బ్యాటింగ్ చేసిన విధానం చూసి మేం సునాయసంగా 350 పైగా పరుగుల లక్ష్యాన్ని చేధిస్తామని భావించాను. కానీ మేము అలా చేయలేకపోయాము. ముఖ్యంగా భాగస్వామ్యాలను సాధించలేకపోయాము.
కేవలం రెండు భాగస్వామ్యాలు మాత్రమే వచ్చాయి. మిడిల్ ఓవర్లలో రాస్సీ లేదా నేను ఎవరో ఒకరు ఛాన్స్ తీసుకోవాలని అనుకున్నాము. ఎందుకంటే 360 పరుగుల లక్ష్యం చేధన అంత ఈజీ కాదు. ఈ ప్రయత్నంలోనే నా వికెట్ కోల్పోవల్సి వచ్చింది. ఆ తర్వాత రాస్సీ కూడా దురదృష్టవశాత్తూ పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది.
అయితే మేము ఔటయ్యాక ఎవరో ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడాలని కోరున్నాము. మేము అనుకున్నట్లు డేవిడ్ మిల్లర్ ఆ బాధ్యత తీసుకున్నాడు. మిల్లర్ గత కొన్నేళ్లగా మా జట్టుకు ఎన్నో అద్బుతమైన విజయాలు అందించాడు. ఈ రోజు కూడా అతడిపై ఆశలు పెట్టకున్నాము. కానీ అతడికి సహకరించే వారు లేకపోవడంతో ఓటమి పాలైము.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. గ్యాప్స్ రాబట్టి వారు బౌండరీల సాధించిన తీరు నన్ను ఎంతోగానే ఆకట్టుకుంది. మిడిల్ ఓవర్లలో మేము వికెట్లు తీయలేకపోయాము. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్‌కు క్రెడిట్ ఇవ్వాలి. ఈ రోజు వారిద్దరూ చాలా బాగా ఆడారు. ఆఖరిలో ఫిలిప్స్, మిచెల్ కూడా దూకుడుగా ఆడి మాపై ఒత్తిడి పెంచారు. ఏదేమైనప్పటికి వారు మా కంటే మెరుగైన క్రికెట్ ఆడారు" అని బవుమా పేర్కొన్నాడు.
చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీలో ఫెయిల్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment