
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో మరో ఆసక్తికపోరుకు రంగం సిద్దమైంది. గ్రూప్-‘బి’ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా సౌతాఫ్రికా- ఇంగ్లండ్(South Africa vs England) తలపడనున్నాయి. కరాచీ వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ప్రొటిస్ జట్టు బౌలింగ్‌కు సిద్ధమైంది.
కాగా ఈ ఐసీసీ వన్డే టోర్నీ నుంచి ఇంగ్లండ్ ఇప్పటికే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే, ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా సెమీ ఫైనల్లో అడుగుపెట్టాలంటే సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. కాబట్టి ప్రొటిస్ జట్టుకు కూడా ఇంగ్లండ్‌తో పోరు కీలకంగా మారడంతో మ్యాచ్ మరింత రసవత్తరం కానుంది.
హిట్టర్లు వచ్చేశారు..! కీలక మ్యాచ్‌లో బవుమా లేకుండానే..
అయితే, ఈ మ్యాచ్‌కు సౌతాఫ్రికా రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా(Temba Bavuma) దూరమయ్యాడు. అతడితో పాటు టోనీ డి జోర్జ్ కూడా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు అందుబాటులో లేడని తాత్కాలిక సారథి ఐడెన్ మార్క్రమ్ టాస్ సందర్భంగా వెల్లడించాడు. వీరిద్దరు అనారోగ్యంతో బాధపడుతున్నారని.. బవుమా, టోనీ స్థానాల్లో ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్ తుదిజట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. గత మ్యాచ్ వర్షం కారణంగా రద్దైందని.. అయితే, ఆ తర్వాత తాము నెట్స్‌లో తీవ్రంగా శ్రమించి ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు సిద్ధమైనట్లు తెలిపాడు.
సరైన సమయంలోనే
మరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్‌గా చివరి మ్యాచ్ ఆడుతున్న బట్లర్ మాట్లాడుతూ.. తాను సరైన సమయంలోనే కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు తెలిపాడు. అన్నీ ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు. గాయపడిన మార్క్‌వుడ్ స్థానంలో సకీబ్ మహబూబ్ జట్టులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు. కాగా ఆసీస్, అఫ్గనిస్తాన్ జట్ల చేతిలో ఓటమి తర్వాత ఇంగ్లండ్ నిష్క్రమించగా... గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా సెమీస్ చేరింది. గ్రూప్-ఎ నుంచి టీమిండియా,న్యూజిలాండ్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి.
తుదిజట్లు
సౌతాఫ్రికా
ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, రాసీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి.
ఇంగ్లండ్
ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్.
చదవండి: Champions Trophy: ఆసీస్‌తో కీలక సమరం.. ఆఫ్ఘనిస్తాన్ కొంపముంచిన రషీద్ ఖాన్