టీ20 వరల్డ్‌కప్ 2024లో ఇవాళ (జూన్ 21) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. సూపర్-8 గ్రూప్-2లో భాగంగా సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. సెయింట్ లూసియా వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. భారతకాలమానం రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఇదివరకే చెరో మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్.. వెస్టిండీస్‌పై, సౌతాఫ్రికా.. యూఎస్‌ఏపై గెలిచి చెరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి.
ఈ టోర్నీలో ఇప్పటివరకు అజేయంగా ఉన్న సౌతాఫ్రికా.. తాజాగా జరిగిన మ్యాచ్‌లో విండీస్‌పై గెలిచి ఇంగ్లండ్ మరో గెలుపుపై ధీమాగా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. సౌతాఫ్రికా 4, ఇంగ్లండ్ 2 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు చివరిసారి తలపడిన మ్యాచ్‌లో (2022) ఇంగ్లండ్‌దే పైచేయిగా నిలిచింది.
ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే.. సౌతాఫ్రికాతో పోలిస్తే ఇంగ్లండ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ జట్టులో ఓపెనర్లు సాల్ట్, బట్లర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్ పరంగా చూస్తే.. ఇంగ్లండ్ కంటే సౌతాఫ్రికా కాస్త మెరుగ్గా కనిపిస్తుంది. ఆ జట్టు పేసర్లు ఓట్నీల్, రబాడ భీకర ఫామ్‌లో ఉన్నారు.
వాతావరణం విషయానికొస్తే.. నేటి మ్యాచ్‌కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు ఉండదు. మ్యాచ్ జరిగే సమయానికి వాతావరణం ఆహ్లాదంగా ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా సవ్యంగా సాగనుంది.
పిచ్ విషయానికొస్తే.. సెయింట్ లూసియా పిచ్ బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో నమోదైన టాప్ స్కోర్లలో మెజార్టీ శాతం ఇక్కడ నమోదైనవే. ఈ వికెట్‌పై బౌలర్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.
తుది జట్లు (అంచనా)..
ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ
సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్), రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్‌మన్
Comments
Please login to add a commentAdd a comment