ENG Vs SA, T20I: South Africa Beat England By 90 Runs In 3rd T20I - Sakshi
Sakshi News home page

ENG VS SA 3rd T20: బట్లర్‌ సేనకు చుక్కలు చూపించిన షంషి.. మరో సిరీస్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

Published Mon, Aug 1 2022 9:59 AM | Last Updated on Mon, Aug 1 2022 10:38 AM

South Africa Thrash England By 90 Runs To Win Third T20 And Series - Sakshi

టెస్ట్‌ల్లో వరుస విజయాలతో అదరగొడుతున్న ఇంగ్లండ్‌ క్రికెట్‌ టీమ్‌ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రం దారుణంగా విఫలమవుతుంది. జోస్‌ బట్లర్‌ కెప్టెన్సీ చేపట్టాక ఆ జట్టు పరిస్థితి మరింత దిగజారింది. ఇటీవల టీమిండియా చేతిలో వన్డే, టీ20 సిరీస్‌ కోల్పోయిన ఇంగ్లీష్‌ జట్లు.. తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో టీ20 సిరీస్‌లో కూడా ఓటమిపాలైంది. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టీ20 గెలిచిన బట్లర్‌ టీమ్‌.. ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై 2-1తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. 

ఆదివారం (జులై 31) జరిగిన  నిర్ణయాత్మక మూడో టీ20ల్లో సఫారీ జట్టు 90 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. సఫారీ స్పిన్నర్‌ తబ్రేజ్‌ షంషి (5/24) తన స్పిన్‌ మాయాజాలంతో ఇంగ్లండ్‌ ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. టాస్‌ ఓడినప్పటికీ ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ టీమ్‌.. నిర్ణీత ఓవర్లలో 191 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

రీజా హెండ్రిక్స్‌ (50 బంతుల్లో 70; 9 ఫోర్లు), ఎయిడెన్‌ మార్క్రమ్‌ (36 బంతుల్లో 51 నాటౌట్‌; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించగా.. రొస్సో (18 బంతుల్లో 31; 6 ఫోర్లు), కెప్టెన్‌ మిల్లర్‌ (9 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి జట్టు భారీ స్కోర్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో డేవిడ్‌ విల్లే (3/25) పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్‌ జట్టుకు షంషి చుక్కలు చూపించాడు.

ఫలితంగా ఆ జట్టు 16.4 ఓవర్లలో 101 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జేసన్‌ రాయ్‌ (17), జోస్‌ బట్లర్‌ (14), జానీ బెయిర్‌స్టో (27), క్రిస్‌ జోర్డాన్‌ (14) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగలిగారు. ఆ జట్టులో అరివీర భయంకర హిట్టర్లు ఉన్నా షంషి మాయాజాలం ముందు అంతా తేలిపోయారు. షంషికి మరో ఎండ్‌లో కేశవ్ మహారాజ్‌ (2/21), ఫెలుక్వాయో (1/23), మార్క్రమ్‌ (1/5) సహకరించడంతో సఫారీ టీమ్‌ వారి స్వదేశంలోనే ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది.

కాగా, ఈ సిరీస్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ 1-1తో డ్రా ముగిసిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌ రద్దు కావడంతో ఫలితం ఎటు తేలకుండా నిలిచిపోయింది. ఈ పర్యటనలో తదుపరి 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభంకానుంది. ఆగస్ట్‌ 17, 25, సెప్టెంబర్‌ 8 తేదీల్లో మూడు టెస్ట్‌లు ప్రారంభమవుతాయి.  
చదవండి: ఐదేసిన మొసద్దెక్‌.. జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న బంగ్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement