CT 2025: అఫ్గనిస్తాన్‌ ఆశలు ఆవిరి! సెమీస్‌కు సౌతాఫ్రికా | CT 2025: SA Qualify For Semis Afghanistan Let Down By ENG Horror Show | Sakshi
Sakshi News home page

చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్లు.. అఫ్గన్‌ ఆశలు ఆవిరి! సెమీస్‌కు బవుమా బృందం

Published Sat, Mar 1 2025 5:35 PM | Last Updated on Sat, Mar 1 2025 6:35 PM

CT 2025: SA Qualify For Semis Afghanistan Let Down By ENG Horror Show

ICC Champions Trophy 2025: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో సౌతాఫ్రికా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆది నుంచే బట్లర్‌ బృందానికి చుక్కలు చూపించి... స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. 38.2 ఓవర్లలోనే ఇంగ్లండ్‌ బ్యాటర్ల ఆట కట్టించి 179 పరుగులకే ఆలౌట్‌ చేశారు.

తద్వారా అఫ్గనిస్తాన్‌ సెమీస్‌ ఆశలపై నీళ్లు చల్లిన ప్రొటిస్‌ బౌలర్లు.. సౌతాఫ్రికా సెమీ ఫైనల్‌(Semi Final) బెర్తును అనధికారికంగా ఖరారు చేశారు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో గ్రూప్‌-‘బి’ ఆఖరి లీగ్‌ దశ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. 

కరాచీలో శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా.. పేసర్‌ మార్కో యాన్సెన్‌(Marco Jancen) టాపార్డర్‌ను కుప్పకూల్చాడు.

ఆకాశమే హద్దుగా
ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌(8), బెన్‌ డకెట్‌(24), వన్‌డౌన్‌ బ్యాటర్‌ జేమీ స్మిత్‌(0)ల వికెట్లను యాన్సెన్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. మిగతా వాళ్లలో పేస్‌ బౌలర్‌ వియాన్‌ ముల్దర్‌ ప్రమాదకర బ్యాటర్‌ జో రూట్‌(44 బంతుల్లో 37)ను అద్బుత రీతిలో బౌల్డ్‌ చేయడంతో పాటు.. టెయిలెండర్లు జోఫ్ ఆర్చర్‌(31 బంతుల్లో 25), ఆదిల్‌ రషీద్‌(2)లను పెవిలియన్‌కు పంపాడు.

ఇక స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ హ్యారీ బ్రూక్‌(19), కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌(21)ల రూపంలో రెండు కీలక వికెట్లు దక్కించుకోగా.. పేసర్‌ కగిసో రబడ జేమీ ఓవర్టన్‌(11) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో 38.2 ఓవర్లలో కేవలం 179 పరుగులు మాత్రమే చేసి ఇంగ్లండ్‌ ఆలౌట్‌ అయింది.

ఇదిలా ఉంటే.. గ్రూప్‌-‘బి’ నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీ ఫైనల్‌ చేరిన విషయం తెలిసిందే. అయితే, రెండో బెర్తును సౌతాఫ్రికా దాదాపు ఖాయం చేసుకున్నా.. టెక్నికల్‌గా అఫ్గనిస్తాన్‌ కూడా.. ఈ మ్యాచ్‌కు ముందు రేసులో ఉంది. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ముందుగా బ్యాటింగ్‌ చేసి 300 పరుగులు చేయడం సహా.. ప్రొటిస్‌ను కనీసం 207 పరుగుల తేడాతో ఓడించాలి. 

హష్మతుల్లా బృందానికి నిరాశే
అప్పుడే అఫ్గనిస్తాన్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే, సౌతాఫ్రికా బౌలర్లు హష్మతుల్లా బృందం ఆశలను ఇలా అడియాసలు చేశారు. కాగా గ్రూప్‌-‘బి’లో భాగంగా సౌతాఫ్రికా తొలుత అఫ్గనిస్తాన్‌తో తలపడి ఏకంగా 107 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా భారీ నెట్‌ రన్‌రేటు(+2.140) సాధించింది. 

ఈ క్రమంలో తమ తర్వాతి ఆస్ట్రేలియాతో ఆడాల్సిన మ్యాచ్‌  వర్షం రద్దైనా ప్రొటిస్‌ జట్టు పటిష్ట స్థితిలోనే నిలిచింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్‌ మధ్య శుక్రవారం నాటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్‌-బి నుంచి సెమీస్‌ చేరే అవకాశం ఉండగా.. వరుణుడి వల్ల ఈ మ్యాచ్‌ కూడా అర్ధంతరంగా ముగిసింది.

ఈ క్రమంలో అప్పటికే రెండు పాయింట్లు(ఇంగ్లండ్‌పై గెలుపొంది) కలిగి ఉన్న ఆసీస్‌.. నిన్నటి మ్యాచ్‌ రద్దైన కారణంగా మరో పాయింట్‌ సాధించింది. తద్వారా గ్రూప్‌-బి నుంచి సెమీస్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇదిలా ఉంటే.. గ్రూప్‌- ఎ నుంచి భారత్‌, న్యూజిలాండ్‌.. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లను చిత్తు చేసి సెమీస్‌ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఇక ఇంగ్లండ్‌ విధించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంతో సంబంధం లేకుండా సౌతాఫ్రికా కూడా టాప్‌-4కు చేరుకుంది.

సౌతాఫ్రికా- ఇంగ్లండ్‌ మ్యాచ్‌ ఇన్నింగ్స్‌ బ్రేక్‌ సమయానికి గ్రూప్‌-బి పాయింట్ల పట్టిక
1. ఆస్ట్రేలియా- పూర్తైనవి మూడు- ఒక గెలుపు- రెండు రద్దు- పాయింట్లు 4- నెట్‌ రన్‌రేటు (+0.475)
2. సౌతాఫ్రికా- పూర్తైనవి రెండు- ఒక గెలుపు- ఒకటి రద్దు- పాయింట్లు మూడు- నెట్‌ రన్‌రేటు     (+2.140)
3. అఫ్గనిస్తాన్‌- ఆడింది మూడు- గెలిచింది ఒకటి- ఓడింది ఒకటి- ఒకటి రద్దు - పాయింట్లు 3- నెట్‌ రన్‌రేటు    (-0.990)
4.  ఇంగ్లండ్‌- ఆడింది రెండు- ఓడింది రెండు- పాయింట్లు సున్నా- నెట్‌ రన్‌రేటు     (-0.305)

చదవండి: Karun Nair: మళ్లీ శతక్కొట్టాడు.. సెలబ్రేషన్స్‌తో సెలక్టర్లకు స్ట్రాంగ్‌ మెసేజ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement