SA vs NZ: రచిన్‌ రవీంద్ర సరికొత్త చరిత్ర.. కివీస్‌ తొలి ప్లేయర్‌గా రికార్డు | SA vs NZ: Rachin Ravindra Slams 5th ICC Ton Multiple Records Becomes | Sakshi
Sakshi News home page

SA vs NZ: చరిత్ర సృష్టించిన రచిన్‌ రవీంద్ర.. కివీస్‌ తొలి ప్లేయర్‌గా రికార్డు

Published Wed, Mar 5 2025 7:03 PM | Last Updated on Wed, Mar 5 2025 7:55 PM

SA vs NZ: Rachin Ravindra Slams 5th ICC Ton Multiple Records Becomes

ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో న్యూజిలాండ్‌ యువ బ్యాటర్‌ రచిన్‌ రవీంద్ర(Rachin Ravindra) జోరు కొనసాగుతోంది. చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy) సెమీ ఫైనల్లో భాగంగా సౌతాఫ్రికా(New Zealand vs South Africa)తో మ్యాచ్‌లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ మళ్లీ శతక్కొట్టాడు. తద్వారా కివీస్‌ తరఫున ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

అంతేకాదు.. తక్కువ ఇన్నింగ్స్‌లోనే అధిక సెంచరీలు కొట్టిన కివీస్‌ బ్యాటర్‌గానూ రచిన్‌ రవీంద్ర చరిత్రకెక్కాడు. కాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఎడిషన్‌ రెండో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌కు లాహోర్‌ వేదిక.

గడాఫీ స్టేడియంలో బుధవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ విల్‌ యంగ్‌(23 బంతుల్లో 21) తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరగా.. మరో ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర మాత్రం అదరగొట్టాడు. 93 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న రచిన్‌.. కేన్‌ విలియమ్సన్‌తో కలిసి రెండో వికెట్‌కు 180 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.

ఇదిలా ఉంటే.. రచిన్‌ రవీంద్రకు వన్డేల్లో ఇది ఐదో శతకం కావడం గమనార్హం. అయితే, ఇప్పటి వరకు అతడు యాభై ఓవర్ల ఫార్మాట్లో సాధించిన ఈ ఐదు సెంచరీలు ఐసీసీ టోర్నమెంట్లలోనే సాధించడం విశేషం. భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో రచిన్‌ రవీంద్ర ఏకంగా మూడు శతకాలు బాదాడు.

తాజాగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఈవెంట్లో గాయం కారణంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు దూరమైనప్పటికీ.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌(112)తో మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చి శతక్కొట్టాడు. తద్వారా ఐసీసీ వన్డే టోర్నీల్లో నాలుగో శతకం అందుకున్న 25 ఏళ్ల రచిన్‌.. తాజాగా పటిష్ట సౌతాఫ్రికాపై సెంచరీ కొట్టి ఈ సంఖ్యను ఐదుకు పెంచుకున్నాడు. 

తద్వారా రచిన్‌ రవీంద్ర పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తక్కువ ఇన్నింగ్స్‌లో కివీస్‌ తరఫున వన్డేల్లో అధిక సెంచరీలు చేసిన జాబితాలో రెండో స్థానం దక్కించుకోవడంతో పాటు.. పిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో కివీస్‌ ఆటగాడిగా నిలిచాడు.

ఇదిలా ఉంటే సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో రచిన్‌(101 బంతుల్లో 108, 13 ఫోర్లు, ఒక సిక్సర్‌)తో పాటు కేన్‌ విలియమ్సన్‌ కూడా శతకంతో చెలరేగాడు. వీరిద్దరికి తోడు డారిల్‌ మిచెల్‌(37 బంతుల్లో 49), గ్లెన్‌ ఫిలిప్స్‌(27 బంతుల్లో 49 నాటౌట్‌) దుమ్ములేపారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్‌.. రికార్డు స్థాయిలో 362 పరుగులు చేసింది.  

న్యూజిలాండ్‌ తరఫున తక్కువ ఇన్నింగ్స్‌లో ఐదు సెంచరీలు చేసిన ఆటగాళ్లు
👉డెవాన్‌ కాన్వే- 22 ఇన్నింగ్స్‌లో
రచిన్‌ రవీంద్ర- 28 ఇన్నింగ్స్‌లో
డారిల్‌ మిచెల్‌- 30 ఇన్నింగ్స్‌లో
కేన్‌ విలియమ్సన్‌- 56 ఇన్నింగ్స్‌లో
నాథన్‌ ఆస్ట్లే- 64 ఇన్నింగ్స్‌లో

పిన్న వయసులో వన్డేల్లో ఐదు శతకాలు బాదిన ఆటగాళ్లు
24 ఏళ్ల 165 రోజుల వయసులో కేన్‌ విలియమ్సన్‌
25 ఏళ్ల 107 రోజుల వయసులో రచిన్‌ రవీంద్ర.

చదవండి: కోహ్లి పైపైకి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement