New Zealand vs South Africa, 1st Test : సౌతాఫ్రికాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. అనుభలేమి ప్రొటిస్ జట్టును 281 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. తద్వారా సౌతాఫ్రికాపై రెండో అతి పెద్ద విజయం అందుకుంది. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
సీనియర్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్-2024తో బిజీ కావడంతో నీల్ బ్రాండ్ సారథ్యంలో.. పెద్దగా అనుభవంలేని ప్రొటిస్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఐదుగురు మినహా కెప్టెన్ బ్రాండ్ సహా అంతా అరంగేట్ర ప్లేయర్లే కావడం విశేషం.
రచిన్ డబుల్ సెంచరీ
ఈ క్రమంలో మౌంట్ మౌంగనుయ్ వేదికగా కివీస్‌తో ఆదివారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన.. సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ విలియమ్సన్(118) సెంచరీతో రాణించగా.. రచిన్ రవీంద్ర డబుల్ సెంచరీ(240)తో చెలరేగాడు.
వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల భారీ స్కోరు చేసి.. ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా 162 పరుగులకే కుప్పకూలింది. ప్రొటిస్ బ్యాటర్లలో కీగన్ పీటర్సన్(45) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ (3/31), సాంట్నర్ (3/34), జేమీసన్ (2/35), రచిన్ రవీంద్ర (2/16) రాణించారు.
విలియమ్సన్ వరుస శతకాలతో
ఈ నేపథ్యంలో 349 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కివీస్ జట్టు.. 179-4 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక కెప్టెన్ కేన్ విలియమ్సన్ (109; 12 ఫోర్లు, 1 సిక్స్) రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ సాధించడం విశేషం. తద్వారా ఒకే టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన ఐదో న్యూజిలాండ్ క్రికెటర్‌గా విలియమ్సన్ గుర్తింపు పొందాడు.
సౌతాఫ్రికా చిత్తు
ఈ మేరకు బుధవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 528 పరుగుల ఆధిక్యం సాధించి.. సౌతాఫ్రికా ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో గురువారం నాటి ఆటలో 247 పరుగులకే ఆలౌట్ అయిన సౌతాఫ్రికా టార్గెట్ పూర్తి చేయలేక భారీ ఓటమిని మూటగట్టుకుంది.
కివీస్ బౌలర్లలో కైలీ జెమీషన్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. ఇక సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 13 నుంచి రెండో మ్యాచ్ ఆరంభం కానుంది.
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన ప్రొటిస్ ఆటగాళ్లు:
1.ఎడ్‌వర్డ్ మూరే(ఓపెనర్)
2.నీల్ బ్రాండ్(ఓపెనర్, కెప్టెన్)
3.వాన్ టాండర్(వన్‌డౌన్ బ్యాటర్)
4.రువాన్ డి స్వార్డ్(బౌలింగ్ ఆల్‌రౌండర్)
5.క్లైడ్ ఫార్చూన్(వికెట్ కీపర్ బ్యాటర్)
6. షోపో మొరేకి(పేస్ బౌలర్).
చదవండి: అరిచీ.. అరిచీ.. నా గొంతు పోయింది: రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment