శతక్కొట్టిన రహానే, చెలరేగిన శార్దూల్‌.. సెమీస్‌లో ముంబై | Ranji Trophy: Shardul Shines Mumbai beats Haryana Enters Semi Final | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన రహానే, చెలరేగిన శార్దూల్‌.. సెమీస్‌లో ముంబై

Published Tue, Feb 11 2025 7:34 PM | Last Updated on Tue, Feb 11 2025 7:43 PM

Ranji Trophy: Shardul Shines Mumbai beats Haryana Enters Semi Final

శతక్కొట్టిన రహానే, చెలరేగిన శార్దూల్‌(PC: MCA X)

రంజీ ట్రోఫీ(Ranji Trophy) 2024-25 సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై(Mumbai) సెమీస్‌కు దూసుకువెళ్లింది. క్వార్టర్‌ ఫైనల్‌-3 మ్యాచ్‌లో హర్యానా జట్టును మట్టికరిపించి టాప్‌-4కు అర్హత సాధించింది. కాగా రంజీ తాజా ఎడిషన్‌లో భాగంగా శనివారం క్వార్టర్‌ ఫైనల్స్‌ మ్యాచ్‌లు మొదలయ్యాయి.

తొలి ఇన్నింగ్స్‌లో రహానే విఫలం
ఈ క్రమంలో కోల్‌కతా వేదికగా ముంబై హర్యానాతో తలపడింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు ఆయుశ్‌ మాత్రే(0), ఆకాశ్‌ ఆనంద్‌(10)తో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన సిద్ధేశ్‌ లాడ్‌(4) కూడా విఫలమయ్యాడు. 

కెప్టెన్‌ అజింక్య రహానే(Ajinkya Rahane) సైతం 31 పరుగులకే వెనుదిరగగా.. టీమిండియా టీ20 జట్టు సారథి సూర్యకుమార్‌ యాదవ్‌(9), ఆల్‌రౌండర్‌ శివం దూబే(28) కూడా నిరాశపరిచారు.

ఇలాంటి తరుణంలో ఆల్‌రౌండర్‌ షామ్స్‌ ములానీ 91 పరుగులతో రాణించగా.. మరో ఆల్‌రౌండర్‌ తనుశ్‌ కొటియాన్‌ 97 పరుగులతో చెలరేగాడు. ఫలితంగా ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగులు చేసింది.

అంకిత్‌ కుమార్‌ శతకం కారణంగా
అనంతరం బ్యాటింగ్‌ మొదలుపెట్టిన హర్యానా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 301 పరుగులకు ఆలౌట్‌ అయింది. కెప్టెన్‌ అంకిత్‌ కుమార్‌ శతకం(136)తో మెరవగా.. మిగతా వాళ్ల నుంచి అతడికి ఎక్కువగా సహకారం లభించలేదు. 

పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ దెబ్బకు హర్యానా బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. అతడు 18.5 ఓవర్ల బౌలింగ్‌లో 58 పరుగులు ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. మిగతా వాళ్లలో షామ్స్‌ ములానీ, తనుశ్‌ కొటియాన్‌ రెండు వికెట్లు దక్కించుకున్నారు.

ఈ నేపథ్యంలో పద్నాలుగు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ముంబై.. 339 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. అజింక్య రహానే శతక్కొట్టగా(108).. సూర్యకుమార్‌ యాదవ్‌(70) చాన్నాళ్ల తర్వాత అర్ధ శతకం బాదాడు. మిగిలిన వాళ్లలో సిద్దేశ్‌ లాడ్‌ 43, శివం దూబే 48 పరుగులతో రాణించారు.

అప్పుడు శార్దూల్‌.. ఇప్పుడు రాయ్‌స్టన్‌
ఇక ముంబై విధించిన 353 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హర్యానా తడబడింది. ఓపెనర్‌ లక్ష్య దలాల్‌(64), సుమిత్‌ కుమార్‌(62) హాఫ్‌ సెంచరీలతో రాణించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. దీంతో 201 పరుగులకే హర్యానా కుప్పకూలింది. 

ముంబై బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ మూడు వికెట్లు సాధించగా.. రాయ్‌స్టన్‌ డయాస్‌ ఐదు వికెట్లతో చెలరేగాడు. తనుశ్‌ కొటియాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇక హర్యానాపై ముంబై 152 పరుగుల తేడాతో గెలుపొందిన ముంబై వరుసగా రెండోసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. శార్దూల్‌ ఠాకూర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.
 
ముంబై వర్సెస్‌ హర్యానా(క్వార్టర్‌ ఫైనల్‌-3) సంక్షిప్త స్కోర్లు
👉ముంబై స్కోర్లు: 315 & 339
👉హర్యానా స్కోర్లు:  301 & 201
👉ఫలితం: 152 పరుగుల తేడాతో హర్యానాను ఓడించిన ముంబై
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: శార్దూల్‌ ఠాకూర్‌(ముంబై)- మొత్తం తొమ్మిది వికెట్లు.

చదవండి: IPL 2025: కొత్త యాజమాన్యం చేతిలోకి గుజరాత్‌ టైటాన్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement