
హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహ్మద్ అజహరుద్దీన్ తన బాధ్యతలను స్వీకరించారు. సోమవారం హెచ్‌సీఏ అధ్యక్షునిగా అజహర్ బాధ్యతలు చేపట్టారు. ఇక వైస్ ప్రెసిడెంట్‌గా జాన్ మనోజ్, సెక్రటరీగా విజయానంద్. జాయింట్ సెక్రటరీ నరేశ్ శర్మ, ట్రెజరర్‌గా సురేంద్ర కుమార్ అగర్వాల్, కౌన్సిలర్‌గా అనురాధలు తమ బాధ్యతలను స్వీకరించారు.కొన్ని రోజుల క్రితం హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజహర్ విజయం సాధించడమే కాకుండా తన ప్యానల్‌ను కూడా గెలిపించుకున్నారు. హెచ్‌సీఏ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అజహర్ మాట్లాడుతూ.. ‘ క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తాను. హెచ్‌సీఏ అవినీతి మరకలు తుడిచేసి పూర్వ వైభవం తీసుకొస్తా. జిల్లాల్లో స్టేడియంలు అభివృద్ధి చేస్తా. అన్ని ప్యానల్‌ను కలుపుకుని వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తా’ అని అన్నారు.
మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ ప్యానెల్ సపోర్ట్ చేసిన ప్రెసిడెంట్ అభ్యర్థి ప్రకాశ్‌చంద్ జైన్ కేవలం 73 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ప్రకాశ్‌చంద్‌కు వచ్చిన మొత్తం ఓట్ల కంటే అజహర్‌కు వచ్చిన మెజారిటీ ఎక్కువ కావడం ఇక‍్కడ విశేషం. మరో ప్రత్యర్థి దిలీప్‌కుమార్‌కు కేవలం 3 ఓట్లు మాత్రమే దక్కాయి. అజహరుద్దీన్ 147 ఓట్లు దక్కించుకుని, 74 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడు కావాలన్న కలను అజహరుద్దీన్ ఎట్టకేలకు సాకారం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసి భంగపడ్డ ఆయన ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం అందుకున్నారు.