శ్రీనివాసన్ కొత్త లీగ్
చెన్నై: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్. శ్రీనివాసన్ మరో సరికొత్త లీగ్ తో ముందుకు వచ్చారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్పీఎల్) పేరుతో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తమిళనాడు క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు వేదిక ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో టీఎన్పీఎల్ కు రూపకల్పన చేశామని వెల్లడించారు. ఇలాంటి టోర్నీల్లో సత్తా చాటిన ఆటగాళ్లకు మంచి అవకాశాలు వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆటగాళ్లను వేలం ద్వారా కొనుగోలు చేయబోమని, ముసాయిదా(డ్రాఫ్ట్) పద్ధతిలో తీసుకుంటామని తెలిపారు.
ఈ ఏడాది తమ టీమ్ లేకుండా ఐపీఎల్ అయిపోయిందన్నారు. 'ఒక సీజన్ వెళ్లిపోయింది. మరో సీజన్ ఉంది. ఇది కూడా అయిపోయాక చెన్నై సూపర్ కింగ్స్ ఎటువంటి ఆటంకాలు లేకుండా మళ్లీ ఐపీఎల్ లో అడుగు పెడుతుంద'ని శ్రీనివాసన్ అన్నారు. ఐపీఎల్ లో పాల్గొనకుండా చెన్నై సూపర్ కింగ్స్ పై రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.