బ్రేక్‌ లేకుండాబాదేశారు | bangaladesh test match : Kohli double century | Sakshi
Sakshi News home page

బ్రేక్‌ లేకుండాబాదేశారు

Published Sat, Feb 11 2017 12:06 AM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM

బ్రేక్‌ లేకుండాబాదేశారు

బ్రేక్‌ లేకుండాబాదేశారు

భారత్‌ 687/6 డిక్లేర్డ్‌
కోహ్లి డబుల్‌ సెంచరీ
వృద్ధిమాన్‌ సాహా శతకం
రాణించిన రహానే, జడేజా
బంగ్లాదేశ్‌ 41/1   

వ్యక్తిగత మైలురాళ్లు, జట్టుగా కొత్త రికార్డులు, భాగస్వామ్యంలో కొత్త ఘనతలు... ఏం ఆడినా, ఎలా ఆడినా వెల్లువలా వచ్చి పడిన పరుగులు... ఒకవైపు మన బ్యాట్స్‌మెన్‌ తమలో తాము పరుగులు చేయడంలో పోటీ పడితే, అటు వైపు నుంచి ఫీల్డింగ్‌ వైఫల్యాలు, డీఆర్‌ఎస్‌ అన్నీ అండగా నిలిచాయి. ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగిన భారత్‌ అద్భుత ప్రదర్శన ముందు ప్రత్యర్థి కకావికలమైంది.

పరుగులు ఇవ్వడంలో ఐదుగురు బౌలర్ల సెంచరీ... పేసర్ల ప్రదర్శన జాలి పడేలా ఉంటే,  నమ్ముకున్న స్పిన్నర్లు చేతులెత్తేశారు. క్యాచ్‌లు వదిలేశారు, రనౌట్‌ చేయలేకపోయారు, చిన్నపిల్లాడు కూడా చేయగలిగే స్టంపింగ్‌ కూడా సాధ్యం కాలేదు. ఒక్కటంటే ఒక్క వ్యూహం పని చేయకపోగా, ఒక్కసారైనా డీఆర్‌ఎస్‌ వాడటం రాలేదు. భారత్‌లో టెస్టు మ్యాచ్‌ అంటే ఆట కాదని, ఇంకా తాము ‘బేబీ’లమేనని బంగ్లాకు ఈపాటికి అర్థమైపోయింది.  ఫలితంగా భారత గడ్డపై తొలిసారి ఆడుతున్న టెస్టులో రెండో రోజే బంగ్లాదేశ్‌ చేతుల్లో నుంచి మ్యాచ్‌ చేజారిపోయింది.

హైదరాబాద్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో రెండో రోజే భారత్‌కు పట్టు చిక్కింది. కొండలాంటి స్కోరు నమోదు చేసిన టీమిండియా, అప్పుడే ప్రత్యర్థి జట్టు వికెట్‌ తీసి వేట మొదలు పెట్టేసింది. టీ విరామం తర్వాత కొద్ది సేపటికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 6 వికెట్ల నష్టానికి 687 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. విరాట్‌ కోహ్లి (246 బంతుల్లో 204; 24 ఫోర్లు) డబుల్‌ సెంచరీని పూర్తి చేసుకొని పలు రికార్డులు నమోదు చేశాడు. వృద్ధిమాన్‌ సాహా (155 బంతుల్లో 106 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కెరీర్‌లో రెండో సెంచరీ సాధించగా... అజింక్య రహానే (133 బంతుల్లో 82; 11 ఫోర్లు), రవీంద్ర జడేజా (78 బంతుల్లో 60 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం బంగ్లాదేశ్‌ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లలో వికెట్‌ నష్టపో యి 41 పరుగులు చేసింది. తమీమ్‌ ఇక్బాల్‌ (24 బ్యాటింగ్‌), మోమినుల్‌ (1 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ మరో 646 పరుగులు వెనుకబడి ఉంది.

 సెషన్‌ 1: ఆగని జోరు
ఓవర్‌నైట్‌ స్కోరు 356/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ ఎక్కడా తగ్గలేదు. కోహ్లి బౌండరీలతో విరుచుకుపడగా, మరో ఎండ్‌లో రహానే 73 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. బంగ్లా కెప్టెన్‌ ముష్ఫికర్‌ రక్షణాత్మక ఫీల్డింగ్‌ వ్యూహాలు కొనసాగించడం కూడా భారత్‌కు కలిసొచ్చింది. కొద్దిసేపట్లోనే కోహ్లి 150 పరుగుల మార్క్‌ను కూడా చేరుకున్నాడు. ఎట్టకేలకు రహానేను అవుట్‌ చేసి తైజుల్‌ ఈ భారీ భాగస్వామ్యాన్ని విడదీశాడు. రెండో రోజు వీరిద్దరు సరిగ్గా 100 పరుగులు జోడించారు. 180 పరుగుల వద్ద అంపైర్‌ కోహ్లిని ఎల్బీగా ప్రకటించినా... భారత కెప్టెన్‌ రివ్యూకు వెళ్లి సానుకూల ఫలితం పొందాడు. 4 పరుగుల వద్ద సాహాను స్టంపౌంట్‌ చేసే సునాయాస అవకాశాన్ని కూడా ముష్ఫికర్‌ వృథా చేశాడు. ఓవర్లు: 31, పరుగులు: 121, వికెట్లు: 1

సెషన్‌ 2: పరుగుల వరద
విరామం తర్వాత మూడో ఓవర్లోనే భారత అభిమానులంతా ఎదురు చూసిన క్షణం వచ్చింది. తైజుల్‌ బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా బౌండరీ కొట్టి విరాట్‌ కేవలం 239 బంతుల్లో కెరీర్‌లో నాలుగో డబుల్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ వెంటనే అతను ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూలో నాటౌట్‌గా తేలేందుకు కొంత అవకాశం ఉన్నా... కోహ్లి ఈసారి సమీక్ష కోరకుండా నేరుగా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. ఈ దశలో జత కలిసిన సాహా, అశ్విన్‌ (45 బంతుల్లో 34; 4 ఫోర్లు) చకచకా పరుగులు జోడించారు. తస్కీన్‌ ఓవర్లో అశ్విన్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా, షకీబ్‌ బౌలింగ్‌లో సాహా ఫోర్, సిక్స్‌ బాదాడు. మరో రనౌట్‌ అవకాశాన్ని వదిలేసుకున్న బంగ్లా, అదే ఓవర్లో అశ్విన్‌ను అవుట్‌ చేసి ఊరట పొందింది. సాహా, అశ్విన్‌ ఆరో వికెట్‌కు 74 పరుగులు జత చేశారు. జడేజా అవుట్‌ విషయంలో కూడా రివ్యూ కోరి బంగ్లా దానినీ వృథా చేసుకుంది. 86 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న సాహా ఆ తర్వాతా తన ధాటిని కొనసాగించాడు.
ఓవర్లు: 32, పరుగులు: 143: వికెట్లు: 2

సెషన్‌ 3: మెరుపు బ్యాటింగ్‌
చివరి సెషన్లో సాహా, జడేజా మరింత దూకుడు ప్రదర్శించారు. తైజుల్‌ వేసిన ఓవర్లో ముందుగా భారీ సిక్సర్‌ కొట్టిన జడేజా తర్వాతి బంతికి అర్ధ సెంచరీ సాధించాడు. మరుసటి బంతినే మరో భారీ సిక్సర్‌గా మలచి సాహా 153 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో రెండు ఓవర్లలో జడేజా రెండు బౌండరీలు కొట్టిన తర్వాత భారత్‌ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు తమీమ్, సర్కార్‌ (15) జాగ్రత్తగా ఆరంభించారు. భువీ బౌలింగ్‌ను ఆచితూచి ఆడిన వీరిద్దరు ఇషాంత్‌ బౌలింగ్‌లో మాత్రం చెరో మూడు ఫోర్లు బాదారు. అయితే ఉమేశ్‌ వేసిన తొలి ఓవర్లోనే కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి సర్కార్‌ వెనుదిరిగాడు. ముందుగా అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా, భారత్‌ రివ్యూకు వెళ్లి ఫలితం పొందింది.
ఓవర్లు:13, పరుగులు: 67, వికెట్లు: 0 (భారత్‌)
ఓవర్లు:14, పరుగులు: 41, వికెట్లు: 1 (బంగ్లాదేశ్‌)


వేదిక ఏదైనా... ప్రత్యర్థి ఎవరైనా... పరుగులు వరద పారించడమే తన పని అన్నట్లు భారత కెప్టెన్, స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి చెలరేగిపోతున్నాడు. బంగ్లాదేశ్‌తో హైదరాబాద్‌లో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో కోహ్లి డబుల్‌ సెంచరీ (246 బంతుల్లో 204; 24 ఫోర్లు) సాధించాడు. తద్వారా టెస్టు క్రికెట్‌ చరిత్రలో వరుసగా నాలుగు సిరీస్‌లలో డబుల్‌ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఆస్ట్రేలియా దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్, భారత మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రమే వరుసగా మూడు సిరీస్‌లలో డబుల్‌ సెంచరీలు చేశారు. తాజా ‘డబుల్‌ సెంచరీ’తో కోహ్లి వీరిద్దరినీ అధిగమించాడు.

200  వెస్టిండీస్‌పై అంటిగ్వాలో  జూలై, 2016లో

211 న్యూజిలాండ్‌పై ఇండోర్‌లో అక్టోబర్, 2016లో

235 ఇంగ్లండ్‌పై ముంబైలో డిసెంబర్, 2016లో

204 బంగ్లాదేశ్‌పై హైదరాబాద్‌లో  ఫిబ్రవరి, 2017లో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement