పిచ్ ఎవరి వైపు..? | Bangalore is much debate on the wicket | Sakshi
Sakshi News home page

పిచ్ ఎవరి వైపు..?

Published Thu, Mar 2 2017 11:45 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM

పిచ్ ఎవరి వైపు..?

పిచ్ ఎవరి వైపు..?

బెంగళూరు వికెట్‌పై తీవ్ర చర్చ
రెండు రోజుల ముందు పచ్చిక తొలగింపు
బ్యాటింగ్‌పైనే భారత్‌ దృష్టి


బెంగళూరు: భారత గడ్డపై టెస్టు మ్యాచ్‌ సందర్భంగా ఆటకు ముందే పిచ్‌ ఎలా ఉండబోతోందో అనే చర్చ మరో సారి మొదలైంది. అయితే ఈ సారి సీన్‌ కాస్త రివర్స్‌గా ఉంది. ఎప్పుడైనా ప్రత్యర్థి జట్లు పిచ్‌ గురించి ఆందోళన చెందేవి. భారత్‌కు మాత్రం అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే రాలేదు. కానీ పుణే టెస్టు మ్యాచ్‌ దెబ్బకు టీమిండియా కూడా వికెట్‌పై దృష్టి పెడుతోంది. ఇంగ్లండ్‌ సిరీస్‌లో భారత్‌ 4–0తో గెలిచినా పిచ్‌ల ఏర్పాటు విషయంలో ఎలాంటి వివాదం రేకెత్తలేదు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పిచ్‌ ఎవరికి అనుకూలిస్తుందనేది ఆసక్తికరం. శనివారం ప్రారంభం కానున్న భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టుకు మూడు రోజుల ముందు ప్రధాన వికెట్‌పై చాలా ఎక్కువగా పచ్చిక కనిపించింది.

అదే సమయంలో ఒక ఎండ్‌లో ఆఫ్‌ స్టంప్‌కు చేరువలో (ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు) వికెట్‌ కాస్త ఎత్తుపల్లాలతో ఉంది. ఇది భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజాలకు అనుకూలంగా మారవచ్చని భావిస్తున్నారు. అయితే మరో వైపు అదనపు పేస్‌తో ఇది ఆసీస్‌ స్టార్‌ మిషెల్‌ స్టార్క్‌కు కూడా కలిసి వచ్చే ప్రమాదం కనిపించింది. దాంతో గురువారంనాటికి పిచ్‌ మారిపోయింది. పిచ్‌పైనున్న పచ్చికను దాదాపు పూర్తిగా తొలగించేశారు. ఇప్పుడు ఇది సాధారణ ఉపఖండపు వికెట్‌లా కనిపించడం విశేషం. అంటే తొలి రెండు రోజుల్లో బ్యాటిం గ్‌కు బాగా అనుకూలించి ఆ తర్వాత మెల్లగా స్పిన్‌కు సహకరించవచ్చు.

ఈ సీజన్‌లో భారత జట్టు ఇంగ్లండ్‌తో ఆడిన ఐదు టెస్టులు, బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో ఇలాంటి పిచ్‌లపైనే ముందుగా భారీ స్కోరు సాధించి ఆ తర్వాత ప్రత్యర్థిని చుట్టేసింది. ఈ ఆరు టెస్టుల తొలి ఇన్నింగ్స్‌లలో భారత్‌ వరుసగా 488, 455, 417, 631, 759/7, 687/6 పరుగులు చేయడం విశేషం. కాబట్టి ఈ సారి కూడా టాస్‌ కీలకం కానుంది. పూర్తి స్పిన్‌ పిచ్‌ లేదా పేస్‌ వికెట్‌ ఉపయోగించి సాహసం చేసే పరిస్థితిలో భారత్‌ ప్రస్తుతం లేదు. కాబట్టి ముందుగా తమ బలమైన బ్యాటింగ్‌నే నమ్ముకోవాలని జట్టు భావిస్తున్నట్లుంది. ముందుగా బ్యాటింగ్‌ చేసి భారీ స్కోరు గనుక చేయగలిగితే జట్టుకు టెస్టుపై పట్టు చిక్కవచ్చు.

స్టార్క్‌ మా బలం: మార్ష్
భారత గడ్డపై స్టార్క్‌లాంటి పేస్‌ బౌలర్‌ ప్రభావం చూపించడం మంచి పరిణామమని అతని సహచరుడు, ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మిషెల్‌ మార్ష్ అభిప్రాయ పడ్డాడు. భారత ఆటగాళ్లలో ఒక రకమైన ఆందోళనను స్టార్క్‌ పెంచాడని అతను అన్నాడు. ‘స్టార్క్‌ ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. స్పిన్నర్ల గురించి చర్చ జరిగే భారత్‌లో స్టార్క్‌ మా ప్రధాన ఆయుధం. భారత బ్యాట్స్‌మెన్‌లో భయం పుట్టించి అతను మరిన్ని వికెట్లు తీస్తాడని నమ్ముతున్నా. స్టార్క్‌తో పాటుహాజల్‌వుడ్‌ రివర్స్‌ స్వింగ్‌ కలిస్తే మాకు తిరుగుండదు’ అని మార్ష్ విశ్వాసం వ్యక్తం చేశాడు. గురువారం భారత జట్టుకు ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ కావడంతో ప్రధాన ఆటగాళ్లంతా సెషన్‌కు దూరంగా ఉన్నారు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు మాత్రం పూర్తిస్థాయిలో సాధన చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement