Michelle Stark
-
వచ్చే ఐపీఎల్‌కు స్టార్క్ దూరం
సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిషెల్ స్టార్క్‌ను వచ్చే ఏడాది ఐపీఎల్లో కొనసాగించేందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆసక్తి చూపించలేదు. అతడితో ఉన్న ఐపీఎల్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. స్టార్క్‌కు ఈ విషయాన్ని సంక్షిప్త సందేశం ద్వారా తెలియజేసింది. ‘కోల్‌కతా జట్టు యాజమాన్యం నన్ను వచ్చే ఏడాది కొనసాగించడం లేదని రెండు రోజుల క్రితం మెసేజ్ పంపించింది. అంటే ఆ సమయంలో నేను ఖాళీగా ఉండబోతున్నాను’ అని స్టార్క్ వెల్లడించాడు. 2018 వేలంలో రూ. 9.4 కోట్ల భారీ మొత్తానికి స్టార్క్‌ను నైట్‌రైడర్స్ తీసుకున్నా... గాయం వల్ల అతను టోర్నీ ఆరంభానికి ముందే దూరమయ్యాడు. -
నాకు క్రికెట్ తెలియదు: బ్రెండన్ స్టార్క్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ సోదరుడు బ్రెండన్ స్టార్క్ హైజంప్ ఆటగాడు. గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో అతను 2.32 మీటర్లతో వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన కనబరిచి స్వర్ణం గెలిచాడు. అన్న మిచెల్‌తో పాటు అతని భార్య అలీసా హీలీ కూడా పేరొందిన క్రికెటరే... కానీ తనకు మాత్రం క్రికెట్ సంగతులేవీ తెలియవంటున్నాడు బ్రెండన్. ‘నేనెప్పుడు క్రికెట్‌ను ఫాలో కాలేదు. అది నా సోదరుడి ఆట. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఆడానేమో కానీ... ఇప్పుడైతే నాకు సంబంధం లేని ఆట అది’ అని 24 ఏళ్ల బ్రెండన్ స్టార్క్ అన్నాడు. -
స్టార్క్ ‘డబుల్ హ్యాట్రిక్’
సిడ్నీ: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఆసీస్ దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో స్టార్క్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ ‘హ్యాట్రిక్’ సాధించాడు. న్యూసౌత్‌వేల్స్ తరఫున ఆడుతున్న స్టార్క్... ఈ ఫీట్‌ను ప్రదర్శించాడు. తద్వారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియా తరఫున అతను రెండో క్రికెటర్ కాగా 1978–79 తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ‘డబుల్ హ్యాట్రిక్’ నమోదు కావడం ఇదే తొలిసారి. స్టార్క్ మొదటి ఇన్నింగ్స్‌లో బెహ్రన్‌డార్ఫ్, మూడీ, మాకిన్లను అవుట్ చేయగా... రెండో ఇన్నింగ్స్‌లో బెహ్రన్‌డార్ఫ్, మూడీ, వెల్స్లను పెవిలియన్ పంపించాడు. ఈ మ్యాచ్‌లో న్యూసౌత్‌వేల్స్ 171 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గతంలో ఏడుగురు (అమీన్ లఖాని, జోగీందర్ సింగ్ రావు, జెన్కిన్స్, పార్కర్, టీజే మాథ్యూస్, ఆల్బర్ట్ ట్రాట్, ఎ.షా) ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఒకే మ్యాచ్‌లు రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేశారు. ఇందులో మాథ్యూస్ మాత్రమే ఆస్ట్రేలియా తరఫున టెస్టు మ్యాచ్‌లో ఈ ఘనత సాధించగా... మిగతావన్నీ దేశవాళీ క్రికెట్లోనే వచ్చాయి. వీరిద్దరు ప్రత్యేకం... ‘డబుల్ హ్యాట్రిక్’ జాబితాలో ఆల్బర్ట్ ట్రాట్, జోగీందర్ సింగ్ రావుల హ్యాట్రిక్లకు మరో ప్రత్యేకత ఉంది. వీరిద్దరు మాత్రమే ఒకే ఇన్నింగ్స్‌లో రెండుసార్లు ‘హ్యాట్రిక్’ సాధించడం పెద్ద విశేషం. అయితే కెరీర్లో ఏకంగా 375 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ రెండు జట్ల తరఫున కలిసి మొత్తం 5 టెస్టులు ఆడిన ట్రాట్... 41 ఏళ్ల వయసులో కటిక దారిద్య్రం కారణంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మరోవైపు జోగీందర్ సింగ్ రావు కెరీర్ సర్వీసెస్ తరఫున ఒకే సీజన్లో 5 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లకే పరిమితమైంది. ఆర్మీ శిక్షణలో భాగంగా పారాగ్లైడింగ్‌లో గాయపడటంతో ఆయన క్రికెట్ ఆట అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఆ తర్వాత జోగీందర్ పాకిస్తాన్‌తో రెండు యుద్ధాల్లో పాల్గొని మేజర్ జనరల్ స్థాయికి ఎదిగి 1994లో మరణించారు. -
కుప్పకూలిన బంగ్లాదేశ్
l రాణించిన తమీమ్ ఇక్బాల్ l స్టార్క్‌కు నాలుగు వికెట్లు పేసర్ మిషెల్ స్టార్క్ (4/29) డెత్ ఓవర్లలో చేసిన మాయాజాలానికి బంగ్లాదేశ్ కుదేలైంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (114 బంతుల్లో 95; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకునే ప్రయత్నం చేసినా సహచరుల నుంచి సహకారం లభించలేదు. దీంతో చాంపియ¯Œ్స ట్రోఫీలో భాగంగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 44.3 ఓవర్లలో 182 పరుగులకు కుప్పకూలింది. షకీబ్ (48 బంతుల్లో 29; 2 ఫోర్లు), మిరాజ్ (14) మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. జంపాకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 83 పరుగులు చేసిన అనంతరం వర్షం ఆటంకంతో మ్యాచ్ ఆగింది. క్రీజులో వార్నర్ (44 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు), స్మిత్ (25 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్) ఉన్నారు. తమీమ్ మినహా... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి పూర్తిగా చేతులెత్తేసింది. ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ఒక్కడే ఎదురొడ్డి నిలవగలిగాడు. ప్రత్యర్థి బౌలింగ్ జోరుకు తొలి 22 ఓవర్లలో బంగ్లా ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు ఫోర్లు మాత్రమే నమోదయ్యాయి. అటు 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దీనస్థితిలో తమీమ్, షకీబ్ జోడి జట్టుకు ఊపిరిలూదింది. ఈ ఇద్దరు క్రీజులో ఉన్నంతవరకే జట్టు ఆటలో కాస్త మెరుపులు కనిపించాయి. నిలకడగా ఆడుతున్న ఈ భాగస్వామ్యాన్ని 30వ ఓవర్లో ట్రావిస్ హెడ్ విడదీశాడు. ఆ ఓవర్ తొలి రెండు బంతులను తమీమ్ సిక్సర్లుగా మలిచినా ఐదో బంతికి షకీబ్ ఎల్బీగా అవుటయ్యాడు. దీంతో నాలుగో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత బ్యాట్స్మె¯ŒS ఇలా వచ్చి అలా వెళ్లగా 43వ ఓవర్లో స్టార్క్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. సెంచరీకి అతి చేరువలో ఉన్న తమీమ్‌తో పాటు.. మోర్తజా (2), రూబెల్లను నాలుగు బంతుల వ్యవధిలో పెవిలియకు పంపడంతో పాటు తన మరుసటి ఓవర్లో చివరి వికెట్‌ను కూడా తీయగా బంగ్లా స్వల్ప స్కోరుకే ఇన్నింగ్స్‌ను ముగించాల్సి వచ్చింది. 183 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు వార్నర్, ఫించ్ (27 బంతుల్లో 19; 3 ఫోర్లు) ధాటిగా ఆరంభించి తొలి వికెట్‌కు 45 పరుగులు జోడించారు. ఫించ్ అవుటయ్యాక ... వార్నర్, స్మిత్ నిలకడగా లక్ష్యం వైపు సాగుతున్న వేళ 16వ ఓవర్ అనంతరం వర్షం అంతరాయం కలిగించింది. -
స్టార్క్ స్థానంలో కమిన్స్
గాయం కారణంగా భారత్‌తో జరిగే మిగతా రెండు టెస్టులకు దూరమైన మిషెల్ స్టార్క్ స్థానంలో ఆస్ట్రేలియా జట్టు కొత్త ప్లేయర్‌ను పంపించనుంది. స్టార్క్ స్థానంలో మరో పేస్ బౌలర్ పాట్రిక్ కమిన్స్‌ను ఎంపిక చేసినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. 2011లో దక్షిణాఫ్రికాపై ఏకైక టెస్టు ఆడిన 23 ఏళ్ల కమిన్స్ ఆ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసుకొని తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇటీవలే వన్డేల్లో, టి20ల్లో, బిగ్‌బాష్ లీగ్‌లో కమిన్స్ నిలకడగా రాణించడంతో అతనికి సెలక్టర్ల నుంచి పిలుపు లభించింది. -
పిచ్ ఎవరి వైపు..?
-
పిచ్ ఎవరి వైపు..?
► బెంగళూరు వికెట్‌పై తీవ్ర చర్చ ►రెండు రోజుల ముందు పచ్చిక తొలగింపు ► బ్యాటింగ్‌పైనే భారత్ దృష్టి బెంగళూరు: భారత గడ్డపై టెస్టు మ్యాచ్ సందర్భంగా ఆటకు ముందే పిచ్ ఎలా ఉండబోతోందో అనే చర్చ మరో సారి మొదలైంది. అయితే ఈ సారి సీన్ కాస్త రివర్స్‌గా ఉంది. ఎప్పుడైనా ప్రత్యర్థి జట్లు పిచ్ గురించి ఆందోళన చెందేవి. భారత్‌కు మాత్రం అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే రాలేదు. కానీ పుణే టెస్టు మ్యాచ్ దెబ్బకు టీమిండియా కూడా వికెట్‌పై దృష్టి పెడుతోంది. ఇంగ్లండ్ సిరీస్‌లో భారత్ 4–0తో గెలిచినా పిచ్‌ల ఏర్పాటు విషయంలో ఎలాంటి వివాదం రేకెత్తలేదు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పిచ్ ఎవరికి అనుకూలిస్తుందనేది ఆసక్తికరం. శనివారం ప్రారంభం కానున్న భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టుకు మూడు రోజుల ముందు ప్రధాన వికెట్‌పై చాలా ఎక్కువగా పచ్చిక కనిపించింది. అదే సమయంలో ఒక ఎండ్‌లో ఆఫ్ స్టంప్‌కు చేరువలో (ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు) వికెట్ కాస్త ఎత్తుపల్లాలతో ఉంది. ఇది భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజాలకు అనుకూలంగా మారవచ్చని భావిస్తున్నారు. అయితే మరో వైపు అదనపు పేస్‌తో ఇది ఆసీస్ స్టార్ మిషెల్ స్టార్క్‌కు కూడా కలిసి వచ్చే ప్రమాదం కనిపించింది. దాంతో గురువారంనాటికి పిచ్ మారిపోయింది. పిచ్‌పైనున్న పచ్చికను దాదాపు పూర్తిగా తొలగించేశారు. ఇప్పుడు ఇది సాధారణ ఉపఖండపు వికెట్లా కనిపించడం విశేషం. అంటే తొలి రెండు రోజుల్లో బ్యాటిం గ్‌కు బాగా అనుకూలించి ఆ తర్వాత మెల్లగా స్పిన్‌కు సహకరించవచ్చు. ఈ సీజన్లో భారత జట్టు ఇంగ్లండ్‌తో ఆడిన ఐదు టెస్టులు, బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో ఇలాంటి పిచ్‌లపైనే ముందుగా భారీ స్కోరు సాధించి ఆ తర్వాత ప్రత్యర్థిని చుట్టేసింది. ఈ ఆరు టెస్టుల తొలి ఇన్నింగ్స్‌లలో భారత్ వరుసగా 488, 455, 417, 631, 759/7, 687/6 పరుగులు చేయడం విశేషం. కాబట్టి ఈ సారి కూడా టాస్ కీలకం కానుంది. పూర్తి స్పిన్ పిచ్ లేదా పేస్ వికెట్ ఉపయోగించి సాహసం చేసే పరిస్థితిలో భారత్ ప్రస్తుతం లేదు. కాబట్టి ముందుగా తమ బలమైన బ్యాటింగ్‌నే నమ్ముకోవాలని జట్టు భావిస్తున్నట్లుంది. ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు గనుక చేయగలిగితే జట్టుకు టెస్టుపై పట్టు చిక్కవచ్చు. స్టార్క్ మా బలం: మార్ష్ భారత గడ్డపై స్టార్క్‌లాంటి పేస్ బౌలర్ ప్రభావం చూపించడం మంచి పరిణామమని అతని సహచరుడు, ఆసీస్ ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్ అభిప్రాయ పడ్డాడు. భారత ఆటగాళ్లలో ఒక రకమైన ఆందోళనను స్టార్క్ పెంచాడని అతను అన్నాడు. ‘స్టార్క్ ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. స్పిన్నర్ల గురించి చర్చ జరిగే భారత్‌లో స్టార్క్ మా ప్రధాన ఆయుధం. భారత బ్యాట్స్‌మెన్‌లో భయం పుట్టించి అతను మరిన్ని వికెట్లు తీస్తాడని నమ్ముతున్నా. స్టార్క్‌తో పాటుహాజల్‌వుడ్ రివర్స్ స్వింగ్ కలిస్తే మాకు తిరుగుండదు’ అని మార్ష్ విశ్వాసం వ్యక్తం చేశాడు. గురువారం భారత జట్టుకు ఆప్షనల్ ప్రాక్టీస్ కావడంతో ప్రధాన ఆటగాళ్లంతా సెషన్‌కు దూరంగా ఉన్నారు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు మాత్రం పూర్తిస్థాయిలో సాధన చేసింది. -
కోహ్లితో ఇంకా ప్రమాదమే: స్టార్క్
పుణే: తొలి టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి విఫలమైనా, అతను అంతే బలంగా తిరిగి పుంజుకోగలడని ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ స్టార్క్ అభిప్రాయపడ్డాడు. ఆ భయం తమ జట్టుకు ఉందని, సిరీస్ ఇంకా ముగిసిపోలేదని అతను అన్నాడు. పుణే టెస్టులో కోహ్లి రెండు ఇన్నింగ్స్‌లలో 0, 13 పరుగులు మాత్రమే చేశాడు. ‘కోహ్లి ఒక అగ్రశ్రేణి ఆటగాడనే విషయం మనందరికీ తెలుసు. కొంతకాలంగా అతను పరుగుల వరద పారిస్తున్నాడు. అతను కోలుకొని మరింత ప్రమాదకరంగా మారతాడని అంచనా వేస్తున్నాం. మిగిలిన సిరీస్‌లో కూడా అతనిదే కీలక వికెట్. మేం నిజంగా సిరీస్ గెలవాలంటే అతడిని మరో ఆరు సార్లు అవుట్ చేయాల్సి ఉంది’ అని స్టార్క్ వ్యాఖ్యానించాడు. తొలి టెస్టులో ఘనవిజయంతో శుభారంభం లభించడం తమకు అందరికీ అమితానందాన్ని ఇచ్చిందని, అయితే ఈ గెలుపుతో సిరీస్ దక్కదు కాబట్టి మరో మూడు మ్యాచ్‌లలో కూడా సత్తా చాటాల్సి ఉందని స్టార్క్ చెప్పాడు. -
ఐపీఎల్‌కు స్టార్క్ దూరం
ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నుంచి తప్పుకుంటున్నట్లు ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిషెల్ స్టార్క్ ప్రకటించాడు. పరస్పర అవగాహనతో ఆర్సీబీతో అనుబంధం ముగించిన స్టార్క్, ఐపీఎల్లో ఏ జట్టుకూ అందుబాటులో ఉండటం లేదు. ఆసీస్ తరఫున బిజీ షెడ్యూల్‌తో పాటు కుటుంబంతో సమయం గడపాలని భావించడమే ఇందుకు కారణమని స్టార్క్ వెల్లడించాడు. -
ఆస్ట్రేలియా అద్భుతం
రెండో టెస్టులో పాక్‌పై ఇన్నింగ్స్, 17 పరుగుల తేడాతో గెలుపు మెల్బోర్న్: తొలి నాలుగు రోజులూ వర్షం, వెలుతురులేమి కారణంగా ‘బాక్సింగ్ డే’ టెస్టులో పూర్తి ఆట సాధ్యమే కాలేదు. దీంతో పాటు ఇరు జట్ల ఆటగాళ్లు శతకాల మోత మోగించారు. నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా కేవలం 22 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇలాంటి పరిస్థితిలో చివరిరోజు ఈ మ్యాచ్‌లో ఫలితం వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఆఖరి రోజు అద్భుతమే జరిగింది. అనిశ్చితికి మారుపేరుగా నిలిచే పాకిస్తాన్ జట్టు మరోసారి ఆ పేరును ‘నిలబెట్టుకుంది’. చివరి రోజు 181 పరుగులు వెనకబడిన దశలో లంచ్‌కు కొద్దిగా ముందు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాక్ జట్టు.... మిషెల్ స్టార్క్ (4/36) ధాటికి అనూహ్యంగా 53.2 ఓవర్లలో 163 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 17 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో దక్కించుకుంది. రెండో ఓవర్లో ప్రారంభమైన పాక్ వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. స్టార్క్‌కు తోడు స్పిన్నర్ లియోన్ (3/33), హాజెల్‌వుడ్ (2/39) చెలరేగడంతో పాక్ కుప్పకూలింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 465/6తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్ 8 వికెట్లకు 624 పరుగులకు వద్ద డిక్లేర్ చేసింది. స్మిత్ (165 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలవగా... స్టార్క్ (91 బంతుల్లో 84; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఏడో వికెట్‌కు ఈ జోడి 154 పరుగులు జతచేసింది. చివరి టెస్టు 3 నుంచి సిడ్నీలో జరుగుతుంది.