ఆస్ట్రేలియా అద్భుతం
రెండో టెస్టులో పాక్‌పై ఇన్నింగ్స్, 17 పరుగుల తేడాతో గెలుపు
మెల్‌బోర్న్: తొలి నాలుగు రోజులూ వర్షం, వెలుతురులేమి కారణంగా ‘బాక్సింగ్ డే’ టెస్టులో పూర్తి ఆట సాధ్యమే కాలేదు. దీంతో పాటు ఇరు జట్ల ఆటగాళ్లు శతకాల మోత మోగించారు. నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా కేవలం 22 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇలాంటి పరిస్థితిలో చివరిరోజు ఈ మ్యాచ్‌లో ఫలితం వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఆఖరి రోజు అద్భుతమే జరిగింది. అనిశ్చితికి మారుపేరుగా నిలిచే పాకిస్తాన్ జట్టు మరోసారి ఆ పేరును ‘నిలబెట్టుకుంది’. చివరి రోజు 181 పరుగులు వెనకబడిన దశలో లంచ్‌కు కొద్దిగా ముందు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాక్ జట్టు.... మిషెల్ స్టార్క్ (4/36) ధాటికి అనూహ్యంగా 53.2 ఓవర్లలో 163 పరుగులకే కుప్పకూలింది.
ఫలితంగా ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 17 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో దక్కించుకుంది. రెండో ఓవర్‌లో ప్రారంభమైన పాక్ వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. స్టార్క్‌కు తోడు స్పిన్నర్ లియోన్ (3/33), హాజెల్‌వుడ్ (2/39) చెలరేగడంతో పాక్ కుప్పకూలింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 465/6తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్ 8 వికెట్లకు 624 పరుగులకు వద్ద డిక్లేర్ చేసింది. స్మిత్ (165 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలవగా... స్టార్క్ (91 బంతుల్లో 84; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఏడో వికెట్‌కు ఈ జోడి 154 పరుగులు జతచేసింది. చివరి టెస్టు 3 నుంచి సిడ్నీలో జరుగుతుంది.