సిడ్నీ: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఆసీస్ దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో స్టార్క్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ ‘హ్యాట్రిక్’ సాధించాడు. న్యూసౌత్‌వేల్స్ తరఫున ఆడుతున్న స్టార్క్... ఈ ఫీట్‌ను ప్రదర్శించాడు. తద్వారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియా తరఫున అతను రెండో క్రికెటర్ కాగా 1978–79 తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ‘డబుల్ హ్యాట్రిక్’ నమోదు కావడం ఇదే తొలిసారి. స్టార్క్ మొదటి ఇన్నింగ్స్‌లో బెహ్రన్‌డార్ఫ్, మూడీ, మాకిన్‌లను అవుట్ చేయగా... రెండో ఇన్నింగ్స్‌లో బెహ్రన్‌డార్ఫ్, మూడీ, వెల్స్‌లను పెవిలియన్ పంపించాడు. ఈ మ్యాచ్‌లో న్యూసౌత్‌వేల్స్ 171 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గతంలో ఏడుగురు (అమీన్ లఖాని, జోగీందర్ సింగ్ రావు, జెన్‌కిన్స్, పార్కర్, టీజే మాథ్యూస్, ఆల్బర్ట్ ట్రాట్, ఎ.షా) ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లు రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేశారు. ఇందులో మాథ్యూస్ మాత్రమే ఆస్ట్రేలియా తరఫున టెస్టు మ్యాచ్‌లో ఈ ఘనత సాధించగా... మిగతావన్నీ దేశవాళీ క్రికెట్‌లోనే వచ్చాయి.
వీరిద్దరు ప్రత్యేకం...
‘డబుల్ హ్యాట్రిక్’ జాబితాలో ఆల్‌బర్ట్ ట్రాట్, జోగీందర్ సింగ్ రావుల హ్యాట్రిక్‌లకు మరో ప్రత్యేకత ఉంది. వీరిద్దరు మాత్రమే ఒకే ఇన్నింగ్స్‌లో రెండుసార్లు ‘హ్యాట్రిక్’ సాధించడం పెద్ద విశేషం. అయితే కెరీర్‌లో ఏకంగా 375 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ రెండు జట్ల తరఫున కలిసి మొత్తం 5 టెస్టులు ఆడిన ట్రాట్... 41 ఏళ్ల వయసులో కటిక దారిద్య్రం కారణంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మరోవైపు జోగీందర్ సింగ్ రావు కెరీర్ సర్వీసెస్ తరఫున ఒకే సీజన్‌లో 5 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లకే పరిమితమైంది. ఆర్మీ శిక్షణలో భాగంగా పారాగ్లైడింగ్‌లో గాయపడటంతో ఆయన క్రికెట్ ఆట అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఆ తర్వాత జోగీందర్ పాకిస్తాన్‌తో రెండు యుద్ధాల్లో పాల్గొని మేజర్ జనరల్ స్థాయికి ఎదిగి 1994లో మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment