ఫాలో ఆన్ తప్పించుకున్న బంగ్లా
గాలె: రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఫాలో ఆన్ నుంచి తప్పించుకుంది. 133/2 ఓవర్ నైట్ స్కోరుతో గురువారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన బంగ్లాదేశ్ 312 పరుగుల వద్ద ఆలౌటైంది. దాంతో ఫాలో ఆన్ గండం నుంచి తృటిలో తప్పించుకుంది.బంగ్లా ఆటగాళ్లు తమీమ్ ఇక్బాల్(57), సౌమ్య సర్కార్(71), మొమినుల్ రహీమ్(85 నాటౌట్), మెహిది హసన్ మిరాజ్(41)లు బాధ్యాతయుతంగా ఆడి జట్టును రక్షించారు.
మూడో రోజు ఆటలో 192 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును రహీమ్-మిరాజ్ల జంట ఆదుకుంది.ఈ జోడి ఏడో వికెట్ గా 106 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేయడంతో బంగ్లా తేరుకుంది. అయితే ఆట మూడో సెషన్ లో వర్షం పడటంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 494 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.