ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ షబ్బీర్ రెహ్మాన్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ సంఘం (బీసీబీ) క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా షబ్బీర్ తో జాతీయ జట్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆరు నెలలపాటు దేశవాలీ క్రికెట్ ఆడకుండా వేటు వేయడంతో పాటుగా 20 లక్షల టాకాల (బంగ్లా కరెన్సీ) జరిమానా విధించింది బీసీబీ. ఇటీవల అభిమానిపై దాడి చేసిన ఘటనలో షబ్బీర్ రెహ్మాన్ తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. మరోసారి క్రమశిక్షణా చర్యల ఉల్లంఘనలకు పాల్పడితే శాశ్వతంగా నిషేధం విధించేందుకు సిద్ధమని బోర్డు ఘాటు హెచ్చరికలు జారీ చేసింది.
గత డిసెంబర్ 21న రాజ్‌షాహిలో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ పన్నెండేళ్ల బాలుడిపై క్రికెటర్ షబ్బీర్ చేయి చేసుకున్నాడు. మరోవైపు మ్యాచ్ రిఫరీతోనూ అతడు ఇష్టానుసారంగా ప్రవర్తించడంపైనా బోర్డు అతడిని మందలించింది. 2016లో బంగ్లా ప్రీమియర్ లీగ్ సమయంలో డ్రెస్సింగ్ రూముకు మహిళను తీసుకురావడంతో బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు. జరిమానాతో పాటు కొన్ని మ్యాచ్‌ల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నా అతడి వైఖరిలో మార్పురాలేదని బంగ్లా క్రికెట్ బోర్డు అధికారులు వెల్లడించారు. బంగ్లాదేశ్ జాతీయ జట్టు తరఫున షబ్బీర్ రెహ్మాన్ 10 టెస్టులు, 46 వన్డేలు, 33 ట్వంటీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment