Sabbir Rahman
-
ధోని.. ఈరోజు నీది కాదు!
ఢాకా: భారత క్రికెట్లో బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా, కీపర్‌గా తనదైన ముద్రను వేశాడు ఎంఎస్ ధోని. దాదాపు ఏడాది క్రితం భారత తరఫున చివరిసారి కనిపించిన ధోని.. మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడో.. లేదో అనే విషయం మాత్రం అతనికే తెలియాలి. ఇప్పటి వరకూ తన రీఎంట్రీపై ఎటువంటి స్పష్టతా ఇవ్వని ధోని.. రాబోవు టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొంటాడా.. లేదా అనే దానిపై నేటికి క్లారిటీ లేదు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ధోని స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేస్తూ వస్తున్న టీమిండియా ఇంకా అన్వేషణలోనే ఉంది. (స్టీవ్ వా మోస్ట్ సెల్ఫిష్: వార్న్) కాగా, వికెట్ల వెనుక నుంచి రెప్పపాటులో బెయిల్స్‌ని ఎగరగొట్టడంలో ఎంఎస్ ధోని తర్వాతే ఎవరైనా అనేది వాస్తవం. బ్యాట్స్‌మెన్ పాదాల కదలికల్ని నిశితంగా పరిశీలించే ధోని స్టంపౌట్లు చేయడంలో సిద్ధహస్తుడు. కానీ 2019 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ షబ్బీర్ రెహ్మాన్‌ని స్టంపౌట్ చేయడంలో ధోని తడబడ్డాడు. అంతకుముందు 2016 టీ20 వరల్డ్‌కప్‌లో షబ్బీర్‌ను స్టంపౌట్ చేసిన ధోని.. 2019 వరల్డ్‌కప్‌లో చాన్స్ లభించినా దాన్ని మిస్సయ్యాడు. దీన్ని గుర్తు చేసుకున్నాడు షబ్బీర్ అలీ. ఫేస్బుక్ లైవ్ సెషన్లో భాగంగా గత జ్ఞాపకాలను షబ్బీర్ పంచుకున్నాడు. ‘‘ఆ మ్యాచ్‌లో నేను తెలివిగా మళ్లీ క్రీజులోకి రాగలిగాను. దాంతో.. ధోని వైపు చూసి ఈరోజు నీది కాదు అని చెప్పా’’ అని షబ్బీర్ వెల్లడించాడు. ఆ మ్యాచ్‌లో షబ్బీర్ 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ కాగా, టీమిండియా 28 పరుగుల తేడాతో గెలిచింది. ఇక 2016 టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ పరుగు తేడాతో మాత్రమే గెలిచింది. (ఆ బ్యాట్‌ను అఫ్రిది సొంతం చేసుకున్నాడు..) -
కోహ్లి సరసన షబ్బీర్
కొలంబో:బంగ్లాదేశ్ ఆటగాడు షబ్బీర్ రెహ్మాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక అంతర్జాతీయ టీ 20 ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో షబ్బీర్ ఐదో స్థానంలో నిలిచాడు. శ్రీలంకలో ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా భారత్‌తో ఫైనల్ మ్యాచ్‌లో షబ్బీర్ 77 పరుగులు సాధించాడు. ఫలితంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లి సరసన షబ్బీర్ నిలిచాడు. 2014లో లంకేయులతో జరిగిన టీ 20 తుది పోరులో కోహ్లి 77 పరుగులు నమోదు చేశాడు. ఇది టీ 20 ఫైనల్ మ్యాచ్‌ల్లో ఐదో అత్యుత్తమం కాగా, తాజాగా ఆ స్థానంలో షబ్బీర్ కూడా చేరిపోయాడు. ఇక టీ 20 ఫైనల్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు శామ్యూల్స్(వెస్టిండీస్) పేరిట ఉంది. 2016లో శామ్యూల్స్ అజేయంగా 85 పరుగులు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. -
ట్రై సిరీస్ ఫైనల్: షబ్బీర్ దూకుడు
కొలంబో:ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా భారత్‌తో తుది పోరులో బంగ్లాదేశ్ 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. షబ్బీర్ రెహ్మాన్ దూకుడుగా ఆడి బంగ్లాదేశ్‌కు గౌరవప్రదమైన స్కోరు సాధించిపెట్టాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా దాటిగా బ్యాటింగ్ చేసి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. 50 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు సాధించాడు. టాస్ గెలిచిన భారత్ ముందుగా బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లిటాన్ దాస్(11), తమీమ్ ఇక్బాల్(15), సౌమ్య సర్కార్(1)లను స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. అయితే షబ్బీర్ రెహ్మాన్ మాత్రం సమయోచితంగా చెలరేగి ఆడాడు. మంచి బంతుల్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటూనే, చెడ్డ బంతుల్ని బౌండరీ దాటించాడు. మొహ్మదుల్లా(21)తో కలిసి 36 పరుగుల్ని జత చేసిన తర్వాత షబ్బీర్ చెలరేగి ఆడాడు. ఆ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మరింత ప్రమాదకరంగా మారాడు. కాగా, షబ్బీర్ ఏడో వికెట్‌గా పెవిలియన్ చేరడంతో బంగ్లాదేశ్ స్కోరులో వేగం తగ్గింది. కాగా, చివర్లో మెహిదీ హసన్(19 నాటౌట్; 7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) బ్యాట్ ఝుళిపించడంతో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. భారత బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు సాధించగా, జయదేవ్ ఉనాద్కత్ రెండు వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్‌కు వికెట్ దక్కింది. -
క్రికెటర్‌కు షాక్: జాతీయ కాంట్రాక్ట్ రద్దు.. భారీ జరిమానా!
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ షబ్బీర్ రెహ్మాన్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ సంఘం (బీసీబీ) క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా షబ్బీర్ తో జాతీయ జట్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆరు నెలలపాటు దేశవాలీ క్రికెట్ ఆడకుండా వేటు వేయడంతో పాటుగా 20 లక్షల టాకాల (బంగ్లా కరెన్సీ) జరిమానా విధించింది బీసీబీ. ఇటీవల అభిమానిపై దాడి చేసిన ఘటనలో షబ్బీర్ రెహ్మాన్ తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. మరోసారి క్రమశిక్షణా చర్యల ఉల్లంఘనలకు పాల్పడితే శాశ్వతంగా నిషేధం విధించేందుకు సిద్ధమని బోర్డు ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. గత డిసెంబర్ 21న రాజ్‌షాహిలో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ పన్నెండేళ్ల బాలుడిపై క్రికెటర్ షబ్బీర్ చేయి చేసుకున్నాడు. మరోవైపు మ్యాచ్ రిఫరీతోనూ అతడు ఇష్టానుసారంగా ప్రవర్తించడంపైనా బోర్డు అతడిని మందలించింది. 2016లో బంగ్లా ప్రీమియర్ లీగ్ సమయంలో డ్రెస్సింగ్ రూముకు మహిళను తీసుకురావడంతో బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు. జరిమానాతో పాటు కొన్ని మ్యాచ్‌ల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నా అతడి వైఖరిలో మార్పురాలేదని బంగ్లా క్రికెట్ బోర్డు అధికారులు వెల్లడించారు. బంగ్లాదేశ్ జాతీయ జట్టు తరఫున షబ్బీర్ రెహ్మాన్ 10 టెస్టులు, 46 వన్డేలు, 33 ట్వంటీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. -
‘ప్రపంచ దిగ్గజం ఎంఎస్7’
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ప్రపంచ దిగ్గజ ప్లేయర్ అని బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ సబ్బిర్ రెహ్మన్ అభిప్రాయపడ్డాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఈ యంగ్‌స్టార్ హిట్టింగ్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన ప్రదర్శనతో బంగ్లాదేశ్ భవిష్యత్తు క్రికెట్లో ఈ 25 ఏళ్ల కుర్రాడు తనదైన ముద్రవేయనున్నాడు. ఇటీవల ధోనిని కలిసిన సబ్బిర్ అతనితో దిగిన ఫోటోను ఫేస్ బుక్‌లో షేర్ చేశాడు. ‘ప్రపంచ దిగ్గజం ఎంఎస్7’తో నేను అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ధోని జెర్సీ నెంబర్ 7 అని తెలిసిన విషయమే. మొర్తజా భారత ఆటగాళ్లు మంచి సంబంధాలున్నాయని, ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఓటమి అనంతరం ఇండియన్ ప్లేయర్స్‌తో చాటింగ్ కూడా చేశామని బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా టోర్నీ అనంతరం తెలిపిన విషయం తెలిసిందే. ఆటలో స్లెడ్జింగ్‌కు పాల్పడిన అది మైదానానికే పరిమితమని మొర్తజా అప్పట్లో పేర్కొన్నాడు. -
క్రికెటర్ హోటల్ రూమ్‌కు 'మహిళా అతిథి'!
ఢాకా: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొంటున్న పాకిస్థాన్ క్రికెటర్ ఒకరు తన హోటల్ గదికి మహిళా అతిథిని పిలిపించుకొని దొరికిపోయాడు. దీంతో అతన్ని అధికారులు గట్టిగా మందలించినట్టు స్పోర్ట్స్కీడ వెబ్సైట్ వెల్లడించింది. అయితే ఆల్‌రౌండర్ అయిన సదరు క్రికెటర్ పేరును అధికారులు వెల్లడించలేదు. ఆయన గారు హోటల్ గదికి పిలిపించుకున్న విదేశీ మహిళ అవినీతి నిరోధక శాఖ అధికారుల జాబితాలో ఉందని, దీంతో అతన్ని అధికారులు గట్టిగా మందలించినట్టు సమాచారం. అంతర్జాతీయ ఒప్పందంలో ఉండటం వల్ల ఈ చర్యకుగాను అతనిపై అధికారులు చర్య తీసుకోలేదని, కానీ మహిళా అతిథులను హోటల్ గదులకు పిలించుకోవడం వంటి చర్యలకు పాల్పడవద్దని అధికారులు సూచించినట్టు సమాచారం. అంతేకాకుండా అతనిపై ప్రవర్తనపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో బంగ్లాదేశ్ క్రికెట్ స్టార్లు షబ్బీర్ రహ్మాన్, ఆల్ అమిన్ హుస్సేన్ కూడా ఇలాగే తమ హోటల్ గదులకు అమ్మాయిలను పిలిపించుకొని అడ్డంగా దొరికిపోయారు. దీంతో వారిని తీవ్రంగా మందలించిన అధికారులు భారీగా జరిమానాలు విధించారు. ఐపీఎల్ తరహాలో జరుగుతున్న బీపీఎల్ టీ-20 టోర్నమెంటులో దాదాపు 18మంది పాక్ క్రికెటర్లు పాల్గొంటున్నారు. -
బంగ్లాదేశ్‌కు 33... ఇంగ్లండ్‌కు 2
చిట్టగాంగ్: బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసకందాయంలో పడింది. ఆట చివరిరోజు బంగ్లాదేశ్ విజయానికి 33 పరుగులు అవసరంకాగా... ఇంగ్లండ్ నెగ్గాలంటే 2 వికెట్లు తీయాలి. 286 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు ఆదివారం బరిలోకి దిగిన బంగ్లా ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్సలో 78 ఓవర్లలో 8 వికెట్లకు 253 పరుగులు చేసింది. క్రీజులో సబ్బీర్ రహమాన్ (93 బంతుల్లో 59 బ్యాటింగ్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తైజుల్ ఇస్లాం (23 బంతుల్లో 11 బ్యాటింగ్; 1 ఫోర్) ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ ఓవర్ నైట్స్కోరుకు మరో 12 పరుగులు జోడించి 240 పరుగులకు ఆలౌటైంది. షకీబ్‌కు ఐదు వికెట్లు దక్కాయి. -
అంపైర్‌తో అనుచిత ప్రవర్తన: క్రికెటర్‌కు జరిమానా
ఢాకా:అఫ్ఘానిస్తాన్‌తో మ్యాచ్ సందర్బంగా ఫీల్డ్ అంపైర్‌తో అనుచితంగా ప్రవర్తించిన బంగ్లాదేశ్ క్రికెటర్ షబ్బీర్ రెహ్మాన్‌కు భారీ జరిమానా పడింది. లెగ్ బి ఫోర్ నిర్ణయంలో భాగంగా అంపైర్ షర్ఫుద్దుల్లాతో షబ్బీర్ తో వాగ్వాదానికి దిగాడు. దాంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మీడియాకు వెల్లడించిన ప్రకటనలో పేర్కొంది. తొలి వన్డేలో అఫ్ఘానిస్తాన్ ఛేజింగ్ కు దిగినప్పుడు ఒక ఎల్బీ విషయంలో డ్రింక్స్ విరామ సమయంలో బంగ్లా ఆటగాడు షబ్బీర్-అంపైర్ షర్ఫుద్దుల్లా మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన షబ్బీర్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టడమే కాకుండా, అనుచితంగా ప్రవర్తించాడు. ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం కనుక షబ్బీర్‌కు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధిస్తూ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లను విధించారు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కోడ్ ఆఫ్ కండక్ట్, అంపైర్ నిర్ణయ పునః సమీక్ష పద్దతి (డీఆర్ఎస్)లో పలు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా పదేపదే నిబంధనలను అతిక్రమించే ఆటగాళ్ల కోసం డీమెరిట్ పాయింట్లను పరిగణలోకి తీసుకుంటారు. వీటిని రెండేళ్ల పాటు లెక్కేస్తారు. ప్రతీ ఆటగాడి ఖాతా కూడా సున్నా పాయింట్లతో ఆరంభం కానుంది. నిర్ణీత సమయానికి ఎక్కువ పాయింట్లు సాధించిన ఆటగాడు సస్పెండ్ అవకాశాలుంటాయి.