క్రికెటర్ హోటల్ రూమ్‌కు 'మహిళా అతిథి'!
ఢాకా: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొంటున్న పాకిస్థాన్ క్రికెటర్ ఒకరు తన హోటల్ గదికి మహిళా అతిథిని పిలిపించుకొని దొరికిపోయాడు. దీంతో అతన్ని అధికారులు గట్టిగా మందలించినట్టు స్పోర్ట్స్‌కీడ వెబ్‌సైట్ వెల్లడించింది.
అయితే ఆల్‌రౌండర్ అయిన సదరు క్రికెటర్ పేరును అధికారులు వెల్లడించలేదు. ఆయన గారు హోటల్ గదికి పిలిపించుకున్న విదేశీ మహిళ అవినీతి నిరోధక శాఖ అధికారుల జాబితాలో ఉందని, దీంతో అతన్ని అధికారులు గట్టిగా మందలించినట్టు సమాచారం. అంతర్జాతీయ ఒప్పందంలో ఉండటం వల్ల ఈ చర్యకుగాను అతనిపై అధికారులు చర్య తీసుకోలేదని, కానీ మహిళా అతిథులను హోటల్ గదులకు పిలించుకోవడం వంటి చర్యలకు పాల్పడవద్దని అధికారులు సూచించినట్టు సమాచారం. అంతేకాకుండా అతనిపై ప్రవర్తనపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గతంలో బంగ్లాదేశ్ క్రికెట్ స్టార్లు షబ్బీర్ రహ్మాన్, ఆల్ అమిన్ హుస్సేన్ కూడా ఇలాగే తమ హోటల్ గదులకు అమ్మాయిలను పిలిపించుకొని అడ్డంగా దొరికిపోయారు. దీంతో వారిని తీవ్రంగా మందలించిన అధికారులు భారీగా జరిమానాలు విధించారు. ఐపీఎల్ తరహాలో జరుగుతున్న బీపీఎల్ టీ-20 టోర్నమెంటులో దాదాపు 18మంది పాక్ క్రికెటర్లు పాల్గొంటున్నారు.