అంపైర్తో అనుచిత ప్రవర్తన: క్రికెటర్కు జరిమానా
ఢాకా:అఫ్ఘానిస్తాన్తో మ్యాచ్ సందర్బంగా ఫీల్డ్ అంపైర్తో అనుచితంగా ప్రవర్తించిన బంగ్లాదేశ్ క్రికెటర్ షబ్బీర్ రెహ్మాన్కు భారీ జరిమానా పడింది. లెగ్ బి ఫోర్ నిర్ణయంలో భాగంగా అంపైర్ షర్ఫుద్దుల్లాతో షబ్బీర్ తో వాగ్వాదానికి దిగాడు. దాంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మీడియాకు వెల్లడించిన ప్రకటనలో పేర్కొంది.
తొలి వన్డేలో అఫ్ఘానిస్తాన్ ఛేజింగ్ కు దిగినప్పుడు ఒక ఎల్బీ విషయంలో డ్రింక్స్ విరామ సమయంలో బంగ్లా ఆటగాడు షబ్బీర్-అంపైర్ షర్ఫుద్దుల్లా మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన షబ్బీర్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టడమే కాకుండా, అనుచితంగా ప్రవర్తించాడు. ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం కనుక షబ్బీర్కు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధిస్తూ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లను విధించారు.
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కోడ్ ఆఫ్ కండక్ట్, అంపైర్ నిర్ణయ పునః సమీక్ష పద్దతి (డీఆర్‌ఎస్)లో పలు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా పదేపదే నిబంధనలను అతిక్రమించే ఆటగాళ్ల కోసం డీమెరిట్ పాయింట్లను పరిగణలోకి తీసుకుంటారు. వీటిని రెండేళ్ల పాటు లెక్కేస్తారు. ప్రతీ ఆటగాడి ఖాతా కూడా సున్నా పాయింట్లతో ఆరంభం కానుంది. నిర్ణీత సమయానికి ఎక్కువ పాయింట్లు సాధించిన ఆటగాడు సస్పెండ్ అవకాశాలుంటాయి.