ప్రాక్టీస్‌లో భారత ‘ఎ’ ఆటగాళ్లు రిషభ్ పంత్, మిలింద్ తదితరులు
నేటి నుంచి బంగ్లాదేశ్, భారత్ ‘ఎ’ వార్మప్ మ్యాచ్
సాక్షి, హైదరాబాద్: ఏకైక టెస్టు కోసం భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ తమ సన్నాహాలను ప్రారంభించింది. నేటి (ఆదివారం) నుంచి జరిగే రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌లో అభినవ్ ముకుంద్ నేతృత్వంలోని భారత్ ‘ఎ’ జట్టుతో బంగ్లాదేశ్ తలపడనుంది. స్థానిక జింఖానా మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌కు అధికారిక ఫస్ట్ క్లాస్ హోదా లేదు. భారత యువ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో రాణించి సెలక్టర్ల దృష్టిని ఆకట్టుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా గాయం నుంచి కోలుకున్న ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ తిరిగి తన ఫామ్ చాటుకునేందుకు ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నాడు.
తొడ కండరాల గాయంతో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టుకు దూరమైన జయంత్ ఇటీవలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హరియాణా తరఫున బరిలోకి దిగాడు. అలాగే ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలు, టి20ల్లో విశేషంగా రాణించిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఈ ఫార్మాట్‌లో తన మార్కును చాటుకునేందుకు ఎదురుచూస్తున్నాడు. వీరిద్దరితో పాటు ఐదేళ్ల అనంతరం టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఓపెనర్ అభినవ్ ముకుంద్ ప్రదర్శన కూడా ఆసక్తికరం. అయితే రిజర్వ్ ఓపెనర్‌గా జట్టులోకి వచ్చినా రెగ్యులర్ ఓపెనర్లు రాహుల్, విజయ్‌లలో ఎవరో ఒకరు గాయపడితే తప్ప ముకుంద్‌కు అవకాశం దక్కదు. వీరే కాకుండా రంజీ ట్రోఫీలో విశేషంగా రాణించిన ప్రియాంక్ పంచల్, అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ షాబాజ్ నదీమ్‌లకు కూడా ఈ మ్యాచ్ కీలకమే.
రంజీల్లో టాప్ స్కోరర్‌గా నిలిచి అద్భుత ఫామ్‌లో ఉన్న ప్రియాంక్‌కు అంతర్జాతీయ స్థాయి బౌలర్లు టస్కిన్, షకీబ్‌ల బౌలింగ్‌ను ఎదుర్కొనే అవకాశం చిక్కనుంది. అలాగే లెఫ్టార్మ్ స్పిన్నర్ నదీమ్ తన బౌలింగ్ నైపుణ్యంతో కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్, తమీమ్ ఇక్బాల్‌లాంటి ఆటగాళ్లను ఇబ్బంది పెట్టేందుకు ఎదురుచూస్తున్నాడు. యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, రిషభ్ పంత్ కూడా గమనించదగ్గ ఆటగాళ్లు. బౌలింగ్‌లో లెఫ్టార్మ్ సీమర్లు అనికేత్ చౌదరి, హైదరాబాదీ సీవీ మిలింద్ ఏమేరకు రాణిస్తారనేది వేచి చూడాలి. జహీర్ ఖాన్ రిటైర్మెంట్ అనంతరం టెస్టుల్లో ఎడమచేతి పేసర్ల లోటు అలాగే ఉండిపోయింది. వీరిలో ఎవరు రాణించినా భవిష్యత్‌లో జట్టులో చోటు దక్కించుకోవచ్చు.
ఇక న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పరాజయం పాలైన బంగ్లాదేశ్ భారత గడ్డపై సత్తా నిరూపించుకోవాలనే కసితో ఉంది. అలవాటైన ఉపఖండ పరిస్థితుల్లో అన్ని విభాగాల్లో చెలరేగి తామేంటో చూపాలనుకుంటోంది. దీనికి ఈ రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌ను చక్కగా వినియోగించుకోనుంది. కీలక బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్, షకీబ్, తమీమ్ ఫామ్‌లో ఉండడం వారికి కలిసొచ్చే విషయం.
జట్ల వివరాలు
భారత్ ‘ఎ’: అభినవ్ ముకుంద్ (కెప్టెన్), ప్రియాంక్, శ్రేయస్ అయ్యర్, ఇషాంక్ జగ్గీ, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, షాబాజ్ నదీమ్, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అనికేత్ చౌదరి, సీవీ మిలింద్, నితిన్ సైని.
బంగ్లాదేశ్: ముష్ఫికర్ రహీమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఇమ్రుల్ కైస్, తమీమ్ ఇక్బాల్, మోమినుల్ హక్, మహ్ముదుల్లా, షబ్బీర్ రహమాన్, షకీబ్, లిటన్ దాస్, టస్కీన్ అహ్మద్, శుభాషిస్ రాయ్, కమ్రుల్ ఇస్లామ్, సౌమ్య సర్కార్, తైజుల్ ఇస్లామ్, షఫీయుల్ ఇస్లామ్, మెహదీ హసన్ మిరాజ్.
బంగ్లా క్రికెటర్లు టస్కీన్, మోమినుల్, మహ్ముదుల్లా