ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ కీలకమైన భారత పర్యటనకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగ్లా బోర్డుతో ఇటీవల చెలరేగిన వివాదాల కారణంగా షకీబ్ భారత్ వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ముందుగా కాంట్రాక్ట్ విషయంలో సహచరులతో కలిసి సమ్మెకు నాయకత్వం వహించిన షకీబ్... ఆ తర్వాత తన వ్యక్తిగత స్పాన్సర్ ఒప్పందం విషయంలో కూడా బోర్డుతో తలపడాల్సి వచ్చింది. టెలికామ్ సంస్థ ‘రోబీ’ బంగ్లా జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా ఉండగా... దానికి ప్రత్యర్థి అయిన ‘గ్రామీన్‌ఫోన్’కు షకీబ్ ప్రచారకర్తగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యాడు. దీనిపై బోర్డు షోకాజ్ నోటీసు జారీ చేయగా, షకీబ్ ఇప్పటి వరకు స్పందించలేదు. భారత్‌తో సిరీస్‌కు సన్నాహాల్లో భాగంగా గత మూడు రోజుల్లో బంగ్లాదేశ్ మొత్తం జట్టు రెండు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొనగా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా షకీబ్ గైర్హాజరయ్యాడు. టీమ్ బుధవారం భారత్‌కు బయల్దేరాల్సి ఉంది. షకీబ్‌తో పాటు మరికొందరు క్రికెటర్లు కావాలనే ఇదంతా చేస్తూ జట్టును దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారని బంగ్లా బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. సిరీస్‌లో ఆడేందుకు సిద్ధమైన ఆటగాళ్లు కూడా చివరి నిమిషంలో తప్పుకునే ప్రమాదం ఉన్నట్లు తనకు అనిపిస్తోందన్న హసన్... షకీబ్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment