కూల్చలేకపోయారు
• భారత బౌలర్ల తడబాటు
• పోరాడుతున్న బంగ్లాదేశ్
• తొలి ఇన్నింగ్స్‌లో 322/6 l∙షకీబ్, ముష్ఫికర్, మెహదీ అర్ధ సెంచరీలు
ముందు రోజే ఒక వికెట్ పడిపోయింది. ఆట మొదలు కాగానే మరో కీలక వికెట్. తర్వాతి ఇద్దరు కూడా నిలబడలేకపోయారు. ఇక బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టదని అనిపించింది. ఫాలోఆన్‌లో కూడా గుప్పెడు వికెట్లు తీసేసి మ్యాచ్‌ను ముగించేందుకు సన్నద్ధమైపోవచ్చని కూడా భారత్ భావించి ఉంటుంది. కానీ మూడో రోజు ఆటలో సీన్ రివర్స్ అయ్యింది.
రోజంతా శ్రమిస్తే దక్కింది ఐదు వికెట్లు. అందులో రెండు ప్రత్యర్థి పొరపాట్ల వల్లే వచ్చాయి. మన బౌలర్లేమీ విఫలం కాలేదు కానీ బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ పట్టుదల ముందు ఆ ప్రదర్శన సాధారణంగా కనిపించింది. ఇద్దరు సీనియర్ బ్యాట్స్‌మెన్‌తో పాటు మరో కుర్రాడి పోరాటం ఆ జట్టు ఆలౌట్ కాకుండా కాపాడగలిగింది. అయితే ఇప్పటికీ 365 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్ చేతుల్లోనే మ్యాచ్ ఉంది. బంగ్లాదేశ్ ఎంత వరకు నిలబడగలదన్నదే నాలుగో రోజు ఆసక్తికరం.
సాక్షి, హైదరాబాద్: బ్యాట్స్‌మెన్ స్ఫూర్తిదాయక ప్రదర్శన కారణంగా భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ పోరాడుతోంది. పదునైన పేస్, స్పిన్‌ను లొంగకుండా గట్టి పట్టుదలతో ఆడుతూ కుప్పకూలిపోకుండా నిలబడింది. ఓవరాల్‌గా భారత్‌తో ఆడుతున్న 9వ టెస్టులో ఆ జట్టు రెండోసారి మాత్రమే 100కు పైగా ఓవర్లను ఆడగలగడం విశేషం. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ (103 బంతుల్లో 82; 14 ఫోర్లు), కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (206 బంతుల్లో 81 బ్యాటింగ్; 12 ఫోర్లు), స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ (103 బంతుల్లో 51 బ్యాటింగ్; 10 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. ముష్ఫికర్, మెహదీ ఏడో వికెట్‌కు అభేద్యంగా 87 పరుగులు జత చేశారు. భారత బౌలర్లలో ఉమేశ్‌కు 2 వికెట్లు దక్కాయి.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 687/6 డిక్లేర్డ్; బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: తమీమ్ (రనౌట్) 24; సర్కార్ (సి) సాహా (బి) ఉమేశ్ 15; మోమినుల్ (ఎల్బీ) (బి) ఉమేశ్ 12; మహ్ముదుల్లా (ఎల్బీ) (బి) ఇషాంత్ 28; షకీబ్ (సి) ఉమేశ్ (బి) అశ్విన్ 82; ముష్ఫికర్ (బ్యాటింగ్) 81; షబ్బీర్ (ఎల్బీ) (బి) జడేజా 16; మెహదీ హసన్ (బ్యాటింగ్) 51; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (104 ఓవర్లలో 6 వికెట్లకు) 322.
వికెట్ల పతనం: 1–38; 2–44; 3–64; 4–109; 5–216; 6–235.
బౌలింగ్: భువనేశ్వర్ 17–6–46–0; ఇషాంత్ 16–5–54–1; అశ్విన్ 24–6–77–1; ఉమేశ్ 18–3–72–2; జడేజా 29–8–60–1.
ఉమేశ్ సూపర్...
భారత్‌కు నిరాశ కలిగించిన మూడో రోజు ఆటలో చెప్పుకోదగ్గ అంశం ఉమేశ్ యాదవ్ ప్రదర్శన. రెండో రోజు 142 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతితో సౌమ్య సర్కార్‌ను అవుట్ చేసిన అతను, శనివారం కూడా దానిని కొనసాగించాడు. అటు వేగం, ఇటు స్వింగ్ జత కలిపి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఆధిక్యం ప్రదర్శించాడు. ముఖ్యంగా 23 నుంచి 33 వరకు ఆరు ఓవర్ల పాటు సాగిన రెండో స్పెల్‌లో ఉమేశ్ చెలరేగిపోయాడు. ముందుగా మోమినుల్‌ను అవుట్ చేసిన అతను, ఆ తర్వాత వేగవంతమైన ఆఫ్ కట్టర్లతో షకీబ్‌ను బెదరగొట్టాడు. అటు ఫీల్డింగ్‌లో కూడా కొన్నాళ్లుగా మైదానంలో పాదరసంలా కదులుతూ ఫాస్ట్ బౌలర్లకు స్ఫూర్తినిస్తున్న ఉమేశ్, మరోసారి అలాంటి ఆటనే చూపించాడు. అతని అద్భుతమైన త్రో కారణంగానే తమీమ్ రనౌటయ్యాడు. ఉమేశ్ పని అంతటితో పూర్తి కాలేదు. అశ్విన్ బౌలింగ్‌లో మిడాన్‌లో చక్కటి క్యాచ్ కూడా అందుకొని ప్రధాన బ్యాట్స్‌మన్ షకీబ్‌ను పెవిలియన్ పంపాడు. మొత్తంగా మైదానంలో అన్నింటా ఉమేశ్ కనిపించాడు.
సెషన్–1: ఆరంభంలోనే షాక్
ఓవర్‌నైట్ స్కోరు 41/1తో ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్‌కు మూడో ఓవర్లోనే షాక్ తగిలింది. ఉమేశ్ యాదవ్ చక్కటి ఫీల్డింగ్‌కు తమీమ్ (24) రనౌట్‌గా వెనుదిరిగాడు. భువనేశ్వర్ ఓవర్లో మోమినుల్ షాట్ ఆడగా సింగిల్ పూర్తి చేసుకున్న వీరిద్దరు, లేని రెండో పరుగు కోసం ప్రయత్నించి సమన్వయ లోపంతో వికెట్ కోల్పోయారు. తొలి సెషన్‌లో ఎక్కువ భాగం బౌలింగ్ చేసిన పేసర్లు, బంగ్లాను కట్టడి చేశారు. ముఖ్యంగా వరుసగా ఆరు ఓవర్లలో ఉమేశ్ చక్కటి రివర్స్ స్వింగ్‌తో ఆకట్టుకున్నాడు. మరోవైపు భువీ బౌలింగ్‌లో మహ్ముదుల్లా ఎల్బీ కోసం భారత్ రివ్యూ చేసినా సఫలం కాలేకపోయింది.
అయితే తక్కువ వ్యవధిలోనే మోమినుల్ (12), మహ్ముదుల్లా (28) వెనుదిరగడంతో బంగ్లా కష్టాల్లో పడింది. ఇషాంత్ బౌలింగ్‌లో మహ్ముదుల్లాను అంపైర్ అవుట్‌గా ప్రకటించగా, అతను రివ్యూకు వెళ్లాడు. చివరకు భారత్‌కే వికెట్ దక్కింది. మరోవైపు షకీబ్ క్రీజ్‌లోకి వచ్చిన దగ్గరి నుంచి దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. మొదటి సెషన్‌లో భారత టాప్ బౌలర్ అశ్విన్ మూడు ఓవర్లు మాత్రమే వేశాడు. అతని రెండో ఓవర్లో షకీబ్ ఎల్బీ కోసం రివ్యూ కోరిన భారత్, ఫలితం ప్రతికూలంగా రావడంతో ఉన్న రెండు రివ్యూలు కోల్పోయింది.
ఓవర్లు: 29, పరుగులు: 84, వికెట్లు: 3
సెషన్–2: కోలుకున్న బంగ్లా
లంచ్ తర్వాత భువీ వేసిన వరుస ఓవర్లలో రెండేసి ఫోర్లు బాది షకీబ్ ధాటిని ప్రదర్శించాడు. ఈ క్రమంలో 69 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ వెంటనే బెనిఫిట్ ఆఫ్ డౌట్ రూపంలో బంగ్లాదేశ్‌కు అదృష్టం కలిసొచ్చింది. అశ్విన్ బౌలింగ్‌లో షకీబ్ బంతిని మిడాఫ్ దిశగా ఆడాడు. సింగిల్ కోసం ప్రయత్నిస్తూ నాన్‌స్ట్రయికర్ ముష్ఫికర్ క్రీజ్‌లో చేరే సమయానికి సాహా బెయిల్స్ పడగొట్టినా రీప్లేలలో స్పష్టత లేకపోవడంతో అంపైర్లు బ్యాట్స్‌మన్‌ను నాటౌట్‌గా ప్రకటించారు. అనంతరం బంగ్లా బ్యాటింగ్ జోరుగా కొనసాగింది. ఒక దశలో పది బంతుల వ్యవధిలో ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ నాలుగు ఫోర్లు బాదారు. అయితే ఎట్టకేలకు అశ్విన్ ఈ జోడీని విడదీశాడు. అతని బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడబోయిన షకీబ్ మిడాన్‌లో సునాయాస క్యాచ్ ఇచ్చాడు. కొద్ది సేపటికే షబ్బీర్ (16) కూడా వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ ముష్ఫికర్ మాత్రం ప్రతీ బంతిని సమర్థంగా ఎదుర్కొంటూ పట్టుదలగా నిలబడ్డాడు.
ఓవర్లు: 31, పరుగులు: 121, వికెట్లు: 2
సెషన్–3: భారత్‌కు నిరాశ
విరామం తర్వాత బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. వీలైనంత తొందరగా ప్రత్యర్థిని ఆలౌట్ చేద్దామని ప్రయత్నించిన టీమిండియా పూర్తిగా విఫలమైంది. నాయకుడిగా బాధ్యతగా ఆడిన ముష్ఫికర్‌కు మెహదీ హసన్ అండగా నిలిచాడు. ఈ క్రమంలో 133 బంతుల్లో ముందుగా ముష్ఫికర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 80 ఓవర్లు పూర్తి కాగానే భారత్ మరో ఆలోచన లేకుండా కొత్త బంతిని తీసేసుకుంది. అయితే ఇది కూడా జట్టుకు కలిసి రాలేదు. ప్రతీ బంతిని జాగ్రత్తగా ఎదుర్కొంటూ వికెట్ మాత్రం కోల్పోరాదన్నట్లుగా ఇద్దరు ఆటగాళ్లు పట్టుదల కనబర్చారు.
ఒక దశలో తాను ఆడిన 63 బంతుల్లో ముష్ఫికర్ 6 పరుగులు మాత్రమే చేశాడు. భువీ ఓవర్లో ముష్ఫికర్ రెండు ఫోర్లు కొట్టగా, ఆ తర్వాత అశ్విన్ బౌలింగ్‌లో మెహదీ రెండు బౌండరీలు బాదాడు. అశ్విన్ బౌలింగ్‌లో చక్కటి ఫోర్‌తో మెహదీ 102 బంతుల్లో కెరీర్‌లో తొలి అర్ధ సెంచరీని అందుకున్నాడు. ఇషాంత్ వేసిన ఆఖరి ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టి బంగ్లా కెప్టెన్ సంతృప్తిగా ఆటను ముగించాడు. ఈ క్రమంలోటెస్టుల్లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో బంగ్లాదేశ్ ఆటగాడిగా నిలిచాడు. ఓవర్లు: 30, పరుగులు: 76, వికెట్లు: 0