
ఢాకా: భారత్‌లో బంగ్లా పర్యటనకు ఇంకా రోజుల వ్యవధే ఉంది కానీ... ఆటగాళ్ల అనూహ్య నిర్ణయం ఈ సిరీస్‌ను సందిగ్ధంలో పడేసింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఉన్నపళంగా సమ్మెబాట పట్టారు. కాంట్రాక్టు మొత్తాల పెంపుతో పాటు తమ డిమాండ్లు తీర్చకపోతే ఏ స్థాయి క్రికెటైనా ఆడబోమని మీడియా సమావేశంలో తెగేసి చెప్పారు. సమ్మె బావుట ఎగరేసిన వారిలో మేటి క్రికెటర్లు కెపె్టన్ షకీబుల్ హసన్, మహ్ముదుల్లా, ముషి్ఫకర్ రహీమ్ సహా మొత్తం 50 మంది ఆటగాళ్లున్నారు. దీంతో జాతీయ క్రికెట్ లీగ్‌తో పాటు భారత పర్యటనకు ఆటగాళ్ల సమ్మె దెబ్బ తగలనుంది. వచ్చే నెల 3 నుంచి భారత్‌లో బంగ్లా పర్యటన మొదలవుతుంది. ఇందులో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగమైన 2 టెస్టుల సిరీస్, మూడు టి20లు ఆడనుంది. అంతకంటే ముందే బంగ్లాలో శిక్షణ శిబిరం మొదలు కావాల్సి ఉంది. ఈ పరిణామాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కాబోయే అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. ‘ఇది పూర్తిగా బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) అంతర్గత వ్యవహారం. బీసీసీఐ పరిధిలో లేని అంశం. ఏదేమైనా సిరీస్ జరగాలనే ఆశిస్తున్నా’ అని అన్నాడు. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య కోల్‌కతాలో ఓ టెస్టు జరగనుంది. ఒకవేళ సిరీస్ జరగకపోతే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పూర్తి పాయింట్ల (120)ను భారత్‌కే కేటాయిస్తుంది.