జయవర్ధనే డబుల్ సెంచరీ
ఢాకా: మహేళ జయవర్ధనే (272 బంతుల్లో 203 నాటౌట్; 16 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్‌తో... బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక పట్టు బిగించింది. షేరే బంగ్లా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 187.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 730 పరుగుల భారీ స్కోరు చేసి డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 498 పరుగుల ఆధిక్యం లభించింది.
వితనగే (103 నాటౌట్) సెంచరీ చేశాడు. మూడో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆతిథ్య బంగ్లాదేశ్ 463 పరుగులు వెనకబడి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. రెండు రోజుల ఆట మిగిలి ఉంది.
అత్యధిక పరుగుల్లో ఆరో స్థానానికి...
టెస్టుల్లో అత్యధిక పరుగుల జాబితాలో శ్రీలంక స్టార్ క్రికెటర్ జయవర్ధనే (11,236 పరుగులు) ఆరో స్థానానికి చేరాడు. ఈ మ్యాచ్ ద్వారా బోర్డర్ (11,174), చందర్‌పాల్ (11,219)లను అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్, పాంటింగ్, కలిస్, ద్రవిడ్, లారా మాత్రమే జయవర్ధనేకంటే ముందున్నారు.
శ్రీలంక తరఫున అత్యధిక టెస్టు సెంచరీల (33) సంగక్కర రికార్డును జయవర్ధనే సమం చేశాడు.జయవర్ధనేకు కెరీర్‌లో ఇది ఏడో డబుల్ సెంచరీ కావడం విశేషం.