'టీమిండియాతో పరాజయాన్ని మరచిపోలేను'
టి-20 ప్రపంచ కప్లో టీమిండియా చేతిలో ఎదురైన ఓటమి బంగ్లాదేశ్ క్రికెటర్లను ఇప్పటికీ వెంటాడుతోంది. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ను ఓడించే అద్భుతమైన అవకాశాలను చేజార్చుకున్నందుకు బంగ్లా క్రికెటర్లు కుమిలిపోతున్నారు. ఈ పరాజయాన్ని మరచిపోవడం చాలా కష్టమని బంగ్లా బ్యాట్స్మన్ మహ్మదుల్లా మరోసారి ఆవేదన చెందాడు.
ఈ మ్యాచ్లో ధోనీసేన చిరస్మరణీయ విజయం సాధించి నాకౌట్ అవకాశాలను కాపాడుకున్న సంగతి తెలిసిందే. చివరి మూడు బంతుల్లో బంగ్లా విజయానికి కేవలం రెండు పరుగులు కావాల్సి ఉండగా, వరసగా మూడు వికెట్లు కోల్పోయి ఊహించని రీతిలో పరాజయం మూటగట్టుకుంది. ఆ సమయంలో ముష్ఫికర్ రహీం, మహ్మదుల్లా క్రీజులో ఉన్నారు. హార్దిక్ పాండ్యా ఓవర్లో భారీ షాట్లకు ప్రయత్నించి వీరిద్దరూ క్యాచవుటయ్యారు. చివరి బంతికి ధోనీ.. ముస్తాఫిజుర్ రహ్మాన్ను అద్భుతమైన రనౌట్ చేయడంతో బంగ్లా కల చెదిరిపోయింది.
ఈ ఓటమి గురించి మహ్మదుల్లా మాట్లాడుతూ.. 'ఈ ఓటమిని ఎలా మరచిపోగలం? ముష్ఫికర్, నేను క్రీజులో ఉన్నాం. ఓడిపోతామని మేం ఊహించలేదు. నాలుగో బంతికి ముష్ఫికర్ అవుటయ్యాక భారీ షాట్కు ప్రయత్నించి తప్పు చేశా. సిక్స్ కొట్టడానికి షాట్ ఆడగా, బంతి గాల్లోకి లేచి ఫీల్డర్ చేతిలో పడింది. దీన్ని నమ్మలేకపోతున్నా. కనీసం సింగిల్ చేసినా గెలిచే అవకాశం ఉండేది. ఇది నా తప్పే. ఓటమికి నాదే బాధ్యత. భవిష్యత్లో ఇలాంటి తప్పులు చేయను. ఇలాంటి పరిస్థితుల్లో సురక్షితమైన అవకాశాన్ని ఎంచుకుంటా' అని మహ్మదుల్లా చెప్పాడు.