సమం చేస్తారా.. సమర్పిస్తారా..?
చెన్నై: టీమిండియాకు మరో సవాల్ ఎదురవుతోంది. దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్లో భాగంగా గురువారమిక్కడ జరిగే నాలుగో మ్యాచ్లో బరిలో దిగుతోంది. వన్డే సిరీస్ విజయావకాశాలను కాపాడుకోవాలంటే ధోనీసేన ఈ మ్యాచ్లో గెలిచితీరాలి. లేకుంటే మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను సఫారీలకు సమర్పించుకోక తప్పదు. ఈ సిరీస్లో సఫారీలు 2-1తో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే.
చెన్నై వన్డేలో గెలిచి సిరీస్ను 2-2తో సమం చేసి, తద్వారా సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని ధోనీసేన ఆరాటపడుతోంది. ఈ మ్యాచ్ టీమిండియాతో పాటు కెప్టెన్గా ధోనీకి ఎంతో కీలకం. భారత్కు బ్యాటింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. నిలకడలేమి వల్ల గెలవాల్సిన మ్యాచ్ల్లో చేజేతులా ఓడిపోతున్నారు. తొలి, మూడో వన్డేల్లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే భారత్ ఓటమి చవిచూసింది. మిడిలార్డర్ బ్యాట్స్మన్ రైనా మూడు వన్డేల్లో కలిపి మూడే పరుగులు చేశాడు. బ్యాటింగ్ సమస్యలకు తోడు టీమిండియాకు కొత్త సమస్య వచ్చిపడింది. స్పిన్నర్ అమిత్ మిశ్రాపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఓ మహిళ ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు మిశ్రాపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై బీసీసీఐ విచారణకు ఆదేశించింది. ఇక ధోనీ కెప్టెన్సీపై కత్తివేలాడుతోంది. ఈ సిరీస్ ఓడిపోతే ధోనీపై ఒత్తిడి పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో చెన్నై వన్డే గెలవాలంటే ధోనీసేన సమష్టిగా ఆడాల్సిన అవసరముంది. మరోవైపు సఫారీలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమరోత్సాహంతో ఉన్నారు. మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.