'చాన్స్ ఉండాలంటే.. గెలిచి తీరాలి'
చెన్నై: దక్షిణాఫ్రికాతో తొలి మూడు వన్డేల్లో చేసిన ప్రదర్శన కంటే నాలుగో మ్యాచ్లో భారత బౌలర్లు మరింత మెరుగ్గా రాణించాల్సిన అవసరముందని సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. సిరీస్ విజయావకాశాలను కాపాడుకోవాలంటే చెన్నై మ్యాచ్ను టీమిండియా గెలవాల్సి ఉందని హర్బజన్ అన్నాడు. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య గురువారమిక్కడ నాలుగో వన్డే జరగనుంది. మ్యాచ్కు ముందు రోజు బుధవారం భజ్జీ మీడియాతో మాట్లాడాడు.
'సిరీస్ అవకాశాలు ఉండాలంటే చెన్నై మ్యాచ్లో భారత్ గెలవాలి. విజయం సాధించాలంటే జట్టు సమష్టిగా ఆడాల్సిన అవసరముంది.మరింత మెరుగ్గా రాణిస్తామని భావిస్తున్నా. వన్డే సిరీస్లో పుంజుకుంటాం. గత మూడు మ్యాచ్ల్లో కంటే నాలుగో వన్డేలో బౌలర్లు మరింత మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిన అవసరముంది. బ్యాట్స్మెన్ కూడా గాడినపడాలి. ఏ వికెట్పై అయినా పరుగులు చేసే సామర్థ్యం గల బ్యాట్స్మెన్ జట్టులో ఉన్నారు. ఎన్నో మ్యాచ్ల్లో భారత్కు విజయాలు అందించారు. నాలుగో వన్డేతో పాటు సిరీస్ గెలిస్తే గొప్పగా ఉంటుంది' అని హర్భజన్ అన్నాడు.