బాస్ ఎవరు? | BCCI annoyed after MS Dhoni says ‘boss’ Duncan Fletcher will lead India till World Cup | Sakshi
Sakshi News home page

బాస్ ఎవరు?

Published Tue, Aug 26 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM

బాస్ ఎవరు?

బాస్ ఎవరు?

నేనే బాస్. ఫ్లెచర్ నాకు రిపోర్ట్ చేస్తాడు: రవిశాస్త్రి
ఫ్లెచరే బాస్. ప్రపంచకప్ వరకు ఆయనే ఉంటాడు: ధోని
ఈ రెండు కామెంట్స్‌లో ఉన్న వైరుధ్యం ఇప్పుడు భారత క్రికెట్‌లో పెద్ద చర్చకు తావిచ్చింది. తొలి వన్డేకు ముందు ధోని చేసిన వ్యాఖ్యలు బీసీసీఐ పెద్దల్ని కాస్త ఇబ్బందిపెట్టాయి. ‘2015 ప్రపంచకప్ వరకు ఫ్లెచరే కోచ్‌గా ఉంటారు. ఆయనే టీమ్ బాస్’ అన్న ధోని... పనిలో పనిగా సహాయక సిబ్బందినీ వెనకేసుకొచ్చాడు. ‘మేం ఫీల్డింగ్ సరిగా చేయకపోతే, క్యాచ్‌లు వదిలేస్తే ఫీల్డింగ్ కోచ్ ఏం చేస్తాడు’ అని ధోని అనడం బీసీసీఐ పెద్దలకు నచ్చలేదు. ధోని వ్యాఖ్యలు పూర్తిగా అతడి వ్యక్తిగతమని, ఇంగ్లండ్ నుంచి జట్టు వచ్చాక మేనేజర్ల నివేదికలను పరిశీలించి బోర్డు ఏం చేయాలో నిర్ణయిస్తుందని కార్యదర్శి సంజయ్ పటేల్ చెప్పారు.
 
టెస్టుల్లో ధోని సేన ఘోర పరాజయం తర్వాత బీసీసీఐ దిద్దుబాటు చర్యల్లో భాగంగా రవిశాస్త్రిని టీమ్ డెరైక్టర్‌గా నియమించింది. బోర్డు ఆదేశాల ప్రకారం కోచ్, కెప్టెన్ సహా అందరూ శాస్త్రి చెప్పిన మాట వినాల్సిందే. ఈ మాజీ కెప్టెన్ కూడా పలు సందర్భాల్లో ఇదే చెప్పారు. ‘ఫ్లెచర్ కోచ్ పాత్ర పోషిస్తారు. కానీ అంతిమంగా ఏ విషయంలో అయినా నాదే తుది నిర్ణయం’ అని రవిశాస్త్రి స్పష్టంగా చెప్పారు. అయితే ఈ మార్పుల తర్వాత ధోని తొలిసారి మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు... బోర్డు నిర్ణయాలు జట్టుకు రుచించలేదనే విషయాన్ని స్పష్టం చేశాయి. ‘కోచ్ ఎవరనేది నిర్ణయించాల్సింది బీసీసీఐ. ఈ విషయంలో ధోని కల్పించుకోవడం అనవసరం. ఈ విషయంపై బోర్డు వర్కింగ్ కమిటీలో చర్చిస్తాం’ అని బోర్డు అధికారి ఒకరు ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఎందుకు బయటపడ్డాడు?
ఈ సిరీస్ తర్వాత ఫ్లెచర్ భవిష్యత్ గురించి బోర్డు చర్చించబోతుందన్న విషయం ధోనికి తెలుసు. అయితే అసలు ఫ్లెచర్‌ను సపోర్ట్ చేస్తూ మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందనేదే ప్రశ్న. ఒకవేళ ఫ్లెచర్ కోచ్‌గా కొనసాగితేనే బాగుంటుందని ధోని భావిస్తే ఇదే విషయాన్ని బీసీసీఐకి చెప్తే సరిపోతుంది. కానీ ఇప్పటివరకూ బోర్డు పెద్దలతో భారత కెప్టెన్ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. నేరుగా మీడియా ద్వారా ఫ్లెచర్‌కు తన మద్దతు ఉందని చెప్పాడు. అయితే రవిశాస్త్రి ప్రపంచకప్ వరకూ భారత జట్టుతోనే కొనసాగుతాడనే వార్త ధోనికి నచ్చలేదని సమాచారం.

‘తనను ప్రశ్నించే వాళ్లను ధోని ఎప్పుడూ ఇష్టపడడు. ప్రస్తుతం బోర్డు ఇచ్చిన అధికారాల వల్ల రవిశాస్త్రి కచ్చితంగా ప్రతి విషయాన్నీ ప్రశ్నిస్తారు. ఇది ధోనికి నచ్చదు. ఫ్లెచర్ ఎప్పుడూ ధోనిని ఏ విషయంలోనూ ప్రశ్నించరు. కాబట్టి ఫ్లెచర్ లాంటి వ్యక్తి చేతిలోనే జట్టు ఉంటే తనకు మేలని ధోని భావించి ఉంటాడు’ అని బోర్డులోని కీలక వ్యక్తి ఒకరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ధోని ప్రకటన బోర్డు పెద్దలని ఆశ్చర్యపరచడంతో పాటు కాస్త అయోమయాన్ని కూడా సృష్టించింది.
 
ఇది రెండోసారి
ఇంగ్లండ్ పర్యటన మొదలయ్యాక బీసీసీఐ ఇష్టానికి వ్యతిరేకంగా ధోని ప్రవర్తించడం ఇది రెండోసారి. నాటింగ్ హామ్ టెస్టులో రవీంద్ర జడేజా, అండర్సన్‌ల మధ్య గొడవ విషయంలో ధోని పట్టుబట్టి బోర్డుతో ఫిర్యాదు చేయించాడు. నిజానికి ఈ విషయాన్ని సాగదీయకుండా వదిలేయాలని, ఇంగ్లండ్ బోర్డుతో మనకు సత్సంబంధాలు ఉన్నాయని బీసీసీఐ చెప్పినా ధోని వినలేదు. కచ్చితంగా కేసు వేయాలనే పట్టుబట్టాడు. కానీ ఈ విషయంలో చివరకు ఇంగ్లండ్ ఆటగాడికి క్లీన్ చీట్ రావడం బీసీసీఐని ఇబ్బంది పెట్టింది. ఇక ఇప్పుడు కోచ్ విషయం మాట్లాడటాన్ని కూడా బోర్డు పెద్దలు సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది.

భారత క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే... బోర్డును ధిక్కరించిన ఆటగాళ్లెవరూ ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. నిజానికి ధోనికి బోర్డు పెద్దలందరితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీనివాసన్, ధోని సన్నిహితులు. ఈ ఒక్క కారణంతోనే ఈసారి కూడా ధోని బతికిపోవచ్చు. ఇదే వ్యాఖ్య మరే క్రికెటర్ చేసినా కచ్చితంగా ఏడాదిలోపే ఆటలో కనపడకుండా పోయేవాడు. అయితే ధోనితో కచ్చితంగా బోర్డు అధికారుల్లో ఎవరో ఒకరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఫలితాలు సరిగా రాని సమయంలోనూ బోర్డు తీసుకున్న చర్యలను కెప్టెన్ వ్యతిరేకించడం భారత క్రికెట్‌కు మంచిది కాదు.
 
గంగూలీ వల్లే కాలేదు
కోచ్ విషయంలో ధోని చేసిన వ్యాఖ్యలు గంగూలీని గుర్తు తెచ్చాయి. గతంలో చాపెల్ కోచ్‌గా వ్యవహరించిన సమయంలో కెప్టెన్ గంగూలీకి, కోచ్‌కు ఏ మాత్రం పడలేదు. ఇద్దరూ నేరుగానే గొడవలు పెట్టుకున్నారు. చాపెల్ అధికారాన్ని, పెత్తనాన్ని గంగూలీ ఒప్పుకోలేదు. దీంతో బోర్డు ఏకంగా గంగూలీని తప్పించి ద్రవిడ్‌ను కెప్టెన్‌ను చేసింది. అప్పటికే భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన గంగూలీ... బోర్డు నిర్ణయాన్ని (చాపెల్‌ను కోచ్‌గా కొనసాగించడం) ఒప్పుకోకపోవడాన్నే అప్పటి బోర్డు పెద్దలు భరించలేదు. ఇప్పుడు బోర్డు ఫ్లెచర్‌ను తప్పించాలనుకుంటుంటే, ధోని మాత్రం ఆయనే కోచ్‌గా కావాలని అంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement