సాక్షి, న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ-20 ప్రపంచ కప్ వాయిదా పడటంతో ఐపీఎల్ నిర్వహణకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రణాళికలను వేగవంతం చేసింది. భారత్‌లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో మ్యాచ్‌లను యూఈఏలో నిర్వహించాలని ఇదివరకే నిర్ణయించింది. దీంతో విదేశాల్లో లీగ్ నిర్వహణకు అనుమతిని కోరుతూ ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ‘దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందును ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించాం. సెప్టెంబర్- నవంబర్ మధ్యలో లీగ్‌ను నిర్వహించేందుకు షెడ్యూల్‌ను రూపొందించాం. విదేశీ గడ్డపై మ్యాచ్‌ల నిర్వహణకు భారత ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాలని కోరుతున్నాం.’ అని కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో టీ-20 ప్రపంచ కప్‌ను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ సోమవారం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. (ఏడాది పాటు టి20 మెగా ఈవెంట్ వాయిదా)
ప్రపంచ కప్ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్‌ను నిర్వహించాలని తొలి నుంచీ భావిస్తున్న బీసీసీఐ.. దానికి అనుగుణంగానే గత శుక్రవారం నిర్వహించి వర్చవల్ సమావేశంలో లీగ్ నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించింది. ఒక్క ఏడాది ఐపీఎల్ నిర్వహించకపోతే దాదాపు 4వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసిన క్రికెట్ పెద్దలు.. ఎలాగైనా లీగ్ నిర్వహించాలని పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఐసీసీ ప్రకటన అనుకూలంగా రావడంతో మ్యాచ్‌ల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కేంద్ర నుంచి అనుమతి రావడమే తరువాయి షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. కాగా దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా 2014లో తొలిసారి యూఏఈలో ఐపీఎల్-7ను నిర్వహించిన విషయం తెలిసిందే. (యూఏఈనే ప్రత్యామ్నాయం)
Comments
Please login to add a commentAdd a comment