
బీసీసీఐ సరిగా హ్యాండిల్ చేయలేదు!
టీమిండియా కోచ్ గా పని చేసి అవమానకర రీతిలో తన పదవికి గుడ్ బై చెప్పిన అనిల్ కుంబ్లేకు తగినంత గౌరవం ఇచ్చి ఉంటే బాగుండేదని సీనియర్ ఆటగాడు గౌతం గంభీర్ పేర్కొన్నాడు.
న్యూఢిల్లీ: టీమిండియా కోచ్ గా పని చేసి అవమానకర రీతిలో తన పదవికి గుడ్ బై చెప్పిన అనిల్ కుంబ్లేకు తగినంత గౌరవం ఇచ్చి ఉంటే బాగుండేదని సీనియర్ ఆటగాడు గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. అతని వ్యవహారంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మరింత హుందాగా వ్యవహరించి ఉండాల్సిందన్నాడు. భారత క్రికెట్ కు ఎంతో సేవ చేసిన ఒక దిగ్గజ ఆటగాడి వ్యవహారాన్ని బీసీసీఐ సరిగా హ్యాండిల్ చేయలేదనే అభిప్రాయాన్ని గంభీర్ వ్యక్తం చేశాడు. కుంబ్లే కోచ్ పదవి నుంచి వైదొలిగే క్రమంలో అతనికి సముచిత గౌరవం దక్కలేదన్నాడు. బీసీసీఐ నుంచి తగినంత గౌరవం పొందే అర్హత దిగ్గజ ఆటగాడైన కుంబ్లేకు ఉందన్నాడు.
'కోచ్ గా కుంబ్లే వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది అనే దానిపై లోతైన విశ్లేషణ అనవసరం. ముందు అతనికి మరింత ఎక్కువ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత బీసీసీఐది. ఒక క్రికెటర్ గా అతను ఎంతో చేశాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అతని వ్యవహారంలో బీసీసీఐ ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తే బాగుండేది. కుంబ్లేను గౌరవంగా సాగనంపడంలో బీసీసీఐ విఫలమైంది. ఈ తరహా విధానం బీసీసీఐ ప్రతిష్టను దెబ్బతీస్తుంది'అని గంభీర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంచితే, కోచ్ ను ఎంపిక చేసి విషయంలో ఆటగాళ్ల పాత్ర అనవసరమన్నాడు. కోచ్ ఎంపిక అనేది క్రికెటర్ల ఉద్యోగం కాదని పేర్కొన్న గంభీర్.. కేవలం ఆటపై మాత్రమే ఫోకస్ చేస్తే మంచిదన్నాడు.