న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేపై మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు. తనకు కుంబ్లే ఎంతో ఇష్టమన్న గంభీర్.. అతని కోసం జీవితాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధమేనన్నాడు. గతంలో కుంబ్లే కెప్టెన్సీలో ఆడిన విషయాన్ని ఈ సందర్భంగా గంభీర్ గుర్తు చేసుకున్నాడు. భారత క్రికెట్‌కు దొరికిన అరుదైన ఆటగాడు కుంబ్లే అని చెప్పుకొచ్చాడు. కుంబ్లే ఆడే సమయంలో అంపైర్ల నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్‌ఎస్) ఉండి ఉంటే తన టెస్టు కెరీర్‌లో 900 వికెట్ల మైలురాయిని సునాయాసంగా చేరుకునేవాడన్నాడు. తన స్థానంపై భరోసా కల్పించిన సారథి ఎవరైనా ఉన్నారంటే అది అనిల్ భాయ్ అని గంభీర్ తెలిపాడు. భారత టెస్టు ఆల్‌టైమ్ ఎలెవన్ జట్టును ప్రకటించిన గంభీర్.. కెప్టెన్‌గా కుంబ్లేను ఎంచుకున్నాడు. ('రోహిత్ ఎదగడానికి ధోనియే కారణం')
ఇక్కడ సునీల్ గావస్కర్‌కు స్థానం కల్పించిన గంభీర్.. కెప్టెన్‌గా మాత్రం కుంబ్లేను ఎంపిక చేశాడు. 2008లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు కుంబ్లేతో తనకు ఎదురైన అనుభవాలను గంభీర్ నెమరువేసుకున్నాడు. ‘నేను, సెహ్వాగ్ కలిసి భోజనం చేస్తుంటే కుంబ్లే మా దగ్గరికి వచ్చాడు. ఏం జరిగినా ఈ సిరీస్‌లోని మొత్తం నాలుగు టెస్టుల్లో మీరిద్దరే ఓపెనింగ్ చేస్తారు. ఏమైనా సరే. ఒకవేళ మీరు ఎనిమిదిసార్లు డకౌట్ అయినా పర్లేదన్నాడు. నా కెరీర్‌లో ఎవరి నుంచి నేను అలాంటి మాటలు వినలేదు. నేను ఎవరికైనా ప్రాణాన్ని ఇవ్వాల్సి వస్తే.. అనిల్ కుంబ్లేకే ఇస్తా. ఆ రోజు కుంబ్లే అన్న మాటలు ఇప్పటికీ నా మనసులో ఇంకా ఉన్నాయి. అప్పట్లో డీఆర్‌ఎస్ ఉంటే కుంబ్లే 900 టెస్టు వికెట్లను సాధించేవాడు’ అని గంభీర్ తెలిపాడు. ఇక సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి తరహాలో కుంబ్లే ఎక్కువ కాలం టీమిండియా కెప్టెన్‌గా చేసి ఉంటే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకునేవాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ('ఆత్మహత్య చేసుకోవాలని మూడుసార్లు అనుకున్నా')
గంభీర్ ప్రకటించిన టీమిండియా ఆల్‌టైమ్ టెస్టు జట్టు..
అనిల్ కుంబ్లే(కెప్టెన్), సునీల్ గావస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, కపిల్‌దేవ్, ఎంఎస్ ధోని, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, జవగళ్ శ్రీనాథ్
Comments
Please login to add a commentAdd a comment