న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌లో గత వారమే క్రికెట్ మొదలైంది. ఇక భారత్‌లో ఆటల గంట మోగాల్సివుంది. అందరి కళ్లు ఐపీఎల్ మీదే ఉన్నాయి. కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడిన ఈ ఈవెంట్‌పైనే గత కొన్నాళ్లుగా తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఆసీస్‌లో టి20 ప్రపంచకప్‌కు అవకాశం లేకపోవడంతో ప్రధానంగా ఐపీఎలే అందరి నోటా నానుతోంది. ఇక ఈ నాన్చుడు ధోరణికి ఫుల్‌స్టాప్ పెట్టాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా నిర్ణయించుకున్నట్లుంది. అందుకే శుక్రవారం జరిగే బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో ఐపీఎల్ అజెండాగా మారింది. ఎక్కడివారక్కడినుంచే పాల్గొనే ఈ ‘వర్చువల్ మీటింగ్’లో మొత్తం 11 అంశాలపై బోర్డు చర్చించనుంది. లీగ్‌తో వేలకోట్ల ఆర్థికాంశాలు ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రధానంగా ఐపీఎల్‌పైనే చర్చిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
అలాగే మహమ్మారి బారిన పడి మూలన పడిపోయిన దేశవాళీ క్రికెట్, భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్‌టీపీ) తదితర అంశాలపై కూడా చర్చిస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. భారత్ ఆతిథ్యమిచ్చే టి20 ప్రపంచకప్ (2021)కు పన్ను మినహాయింపు, బెంగళూరులోని ఎన్‌సీఏలో సౌకర్యాల పెంపు, డిజిటల్ కాంట్రాక్టుల పొడిగింపు, బీహార్ సంఘం వ్యవహారం, బీసీసీఐలో సిబ్బంది నియామకం, కొత్త సీఈఓ నియామకం, ఈశాన్య క్రికెట్ సంఘాలకు చెల్లింపులు, భారత జట్ల దుస్తుల టెండర్లపై ఈ ఉన్నత స్థాయి సమావేశంలో చర్చిస్తారు. ఇటీవల బోర్డు అధ్యక్షుడు గంగూలీ మాట్లాడుతూ ఐపీఎల్‌ను భారత్‌లోనే నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని, విధిలేని పరిస్థితుల్లోనే శ్రీలంక, యూఏఈ వేదికల్ని పరిశీలిస్తామన్నారు.
అయితే బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మీటింగ్‌లో ఏకంగా వేదికనే ఖరారు చేస్తామని భావించడం లేదు. అందుబాటులో ఉన్న అవకాశాలు, నిర్వహణకు సానుకూలతల్ని బేరీజు వేస్తామనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఐసీసీ... టి20 ప్రపంచకప్‌పై తుది నిర్ణయం ప్రకటించలేదు. ఇలాంటి స్థితిలో ఏకంగా షెడ్యూలునే ఆశించడం ఆత్యాశే అవుతుంది’ అని అన్నారు. వచ్చే సోమవారం జరిగే ఐసీసీ బోర్డు మీటింగ్‌లో మెగా ఈవెంట్‌పై నిర్ణయం వెలువడే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment