
ఆ నలుగురికీ కృతజ్ఞతలు
బీసీసీఐ సన్మానం సందర్భంగా
సచిన్, కుంబ్లే, ద్రవిడ్, గంగూలీలను గుర్తు చేసుకున్న సెహ్వాగ్
న్యూఢిల్లీ: కెరీర్‌లో తనకు మార్గదర్శనం చేసిన మాజీ క్రికెటర్లు సచిన్, ద్రవిడ్, గంగూలీ, కుంబ్లేలకు సెహ్వాగ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సెహ్వాగ్‌ను నాలుగో టెస్టు ప్రారంభానికి ముందు బీసీసీఐ సన్మానించింది. ఈ సందర్భంగా వీరూ తన మాజీ సహచరులను గుర్తు చేసుకున్నాడు. ‘నా కెరీర్ మొత్తం ఎంతోమంది ప్రోత్సాహం అందించారు.
నా తండ్రి, కోచ్‌లు సతీష్, రాజు, ఏఎన్‌శర్మ, తొలి కెప్టెన్ జడేజాలతో పాటు ఆ నలుగురు దిగ్గజాలు కూడా మార్గదర్శనం చేశారు. కష్టకాలంలో మద్దతుగా నిలిచిన అభిమానులతో పాటు బీసీసీఐ, డీడీసీఏలకు కృతజ్ఙతలు’ అని సెహ్వాగ్ అన్నాడు. టెస్టుల్లో చేసిన తొలి సెంచరీ ఎప్పటికీ ప్రత్యేకమని, టెస్టుల్లో 400 చేయలేకపోవడం లోటు అని చెప్పాడు. సన్మాన కార్యక్రమంలో సెహ్వాగ్ తల్లి కృష్ణ, భార్య ఆర్తి, కుమారులు ఆర్యవీర్, వేదాంత్ పాల్గొన్నారు. టెస్టుల్లో తాను చేసిన 319 పరుగుల రికార్డును ఏ స్థాయిలోనైనా తన పిల్లలు ఇద్దరిలో ఎవరైనా అధిగమిస్తే ఫెరారీ కారు బహుమతిగా ఇస్తానని వీరూ చెప్పాడు.