స్వామికార్యం... స్వకార్యం...
ఏ ముహుర్తాన ఎవరికి వచ్చిన ఆలోచనోగానీ...
సచిన్, షేన్‌వార్న్ కలిసి అమెరికాలో నిర్వహించిన క్రికెట్ ఆల్‌స్టార్స్ సిరీస్ సూపర్ హిట్ అయింది.
అమెరికాలో క్రికెట్‌ను అభివృద్ధి చేయడమనే లక్ష్యంతో దీనిని ప్రారంభించినట్లు చెబుతున్నా...
ఆర్థికంగా కూడా ఈ లీగ్ కాసుల వర్షం కురిపించింది. దీంతో స్వామికార్యం... స్వకార్యం.. రెండూ నెరవేరాయి.
క్రికెట్ ఆల్‌స్టార్స్ సిరీస్ సూపర్ హిట్
సాక్షి క్రీడావిభాగం: ఇంతకాలం క్రికెట్ ప్రధానంగా కామన్వెల్త్ దేశాలలోనే ఆదరణ పొందింది. ప్రపంచంలోని మిగిలిన దేశాలకూ ఈ ఆటను విస్తరించడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అనేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలకూ ఎంతో కొంత ఆటను తీసుకెళ్లగలిగారు.
అయితే ఏ దేశంలోనూ ఈ ఆటకు ప్రాముఖ్యతను పెంచలేకపోయారు. అసోసియేట్, అఫిలియేట్ సభ్యులుగా ఈ దేశాలన్నింటికీ ఐసీసీలో స్థానం కల్పించి, బాగానే నిధులూ ఇస్తున్నారు. అయినా దీనిని మరింత ముందుకు ఎలా తీసుకెళ్లాలో తెలియని పరిస్థితి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్ ఈ మూడు దేశాలూ ప్రస్తుతం క్రికెట్‌కు ప్రధాన ఆధారం.
ఈ జాబితాలో చైనా, అమెరికా చేరితే ఆట మరింత విసృ్తతమవుతుంది. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే ఆలోచనలో ఐసీసీ ఉన్న సమయంలో సచిన్, షేన్‌వార్న్ ఓ కొత్త ప్రతిపాదనతో ఐసీసీ దగ్గరకు వెళ్లారు.
ఇంగ్లండ్‌లో బీజం
గత ఏడాది లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీ, ప్రస్తుత క్రికెటర్లను కలిపి రెండు జట్లుగా తయారు చేసి మ్యాచ్ నిర్వహించారు. అందులో ఆడిన మాజీలు బాగా ఉత్సాహంగా కనిపించారు. దీంతో మాజీలతో లీగ్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచన సచిన్, వార్న్‌లకు వచ్చింది. వెంటనే దీని గురించి ప్రణాళికలు సిద్ధం చేశారు.
ప్రతి దేశంలోనూ ఓ లీగ్ ఉన్నందున... అమెరికాలాంటి ప్రదేశంలో మ్యాచ్‌లు ఆడితే బాగుంటుందని భావించారు. అయితే ఆటకు ఆదరణ లేని చోట ఇంత మంది స్టార్లతో వెళ్లి ఆడటం కూడా అంత సులభం కాదు. అమెరికా క్రికెట్ సంఘం ఇప్పటికే రకరకాల వివాదాల్లో ఉంది. అయినా ఈ దిగ్గజాలు మొండిగా ముందుకెళ్లారు.
ఐసీసీని ఒప్పించడం వీరి తొలి విజయం. మౌలిక సదుపాయాలు లేనందున అక్కడి బేస్‌బాల్ స్టేడియాలలో మ్యాచ్‌లను నిర్వహించాలని భావించారు. మొత్తానికి నవంబరు 7 నుంచి 14 వరకు మూడు టి20 మ్యాచ్‌లు నిర్వహించారు.
పిల్లలకు పాఠాలు
అమెరికాలోని స్థానికులకు ఈ ఆటను ఏ మేరకు పరిచయం చేశారనేది ఇప్పుడే చెప్పలేం. అయితే అక్కడ వివిధ దశలలో క్రికెట్ ఆడుతున్న చిన్నారులకు మాత్రం ఈ సిరీస్ వరంలా మారింది. అమెరికా తరఫున అన్ని దశలలో క్రికెట్ ఆడేవారంతా దిగ్గజాలతో కలిసి గడిపారు. చిన్న పిల్లలకు వార్న్, సచిన్ స్వయంగా ఆటలో మెళకువలు నేర్పించారు.
ఈ సిరీస్ ద్వారా క్రికెట్‌కు సంబంధించి వారం రోజుల పాటు అమెరికాలో జరిగిన హడావుడి ఐసీసీలోనూ సంతోషం పెంచింది. న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజ్‌లో వార్న్, సచిన్ గంట మోగించడం సహా రకరకాల కార్యక్రమాలతో మీడియా దృష్టినీ ఆకర్షించగలిగారు.
భారతీయులే లక్ష్యం
నిజానికి ఈ టోర్నీ విజయవంతం అవుతుందనే నమ్మకం మొదటి నుంచీ ఉండటానికి కారణం అమెరికాలో భారీసంఖ్యలో స్థిరపడిన భారతీయులు. కరీబియన్ దీవుల్లో భారత్ ఏ మ్యాచ్ ఆడినా అమెరికా నుంచి భారీగా అభిమానులు వెళుతుంటారు. అక్కడ ప్రపంచకప్‌లు జరిగితే భారత్ ఆడే మ్యాచ్‌లకు సగం స్టేడియం అమెరికాలో ఉన్న భారతీయులతోనే నిండుతుంది.
సచిన్ ఆడుతున్నాడంటే కచ్చితంగా భారతీయులు క్రికెట్ చూడటానికి వస్తారు. వాస్తవంలోనూ అదే జరిగింది. మ్యాచ్‌లు జరిగింది మూడు నగరాల్లోనే అయినా... పెద్ద దేశం అమెరికాలో ప్రతి మూల నుంచీ క్రికెట్ అభిమానులు మ్యాచ్‌లకు వచ్చారు.
భారీగా ఆదాయం
అమెరికాలో బేస్‌బాల్ చాలా పెద్ద ఆట. ఎక్కడ బేస్‌బాల్ మ్యాచ్ జరిగినా స్టేడియంలో ప్రేక్షకులు నిండిపోతారు. అయితే బేస్‌బాల్ మ్యాచ్‌కు కనిష్టంగా టిక్కెట్ ధర డాడ్జర్ స్టేడియంలో పై స్టాండ్‌లో 9 డాలర్లు (రూ. 593). కింది స్టాండ్‌లో గరిష్ట టిక్కెట్ ధర 50 డాలర్లు (రూ. 3,300). ఈ సిరీస్‌కు అదే స్టేడియంలో పైస్టాండ్‌లో టిక్కెట్‌ను 50 డాలర్లకు అమ్మారు.
కింది స్టాండ్‌లో టిక్కెట్‌ను 175 డాలర్లకు (రూ. 11,600) అమ్మడం విశేషం. అయినా సరే అభిమానులు భారీగా వచ్చారు. మూడు మ్యాచ్‌లకు కలిపి లక్షమంది హాజరయ్యారని వార్న్ చెప్పాడు. ఇందులో కోటా టిక్కెట్లు, ఉచిత పాస్‌లు పోయినా కనీసం 50 వేల టిక్కెట్లు కొన్నారని అనుకున్నా... సగటున ఒక్కో టిక్కెట్ ధర 125 డాలర్లు అనుకుంటే... సుమారుగా 38 కోట్ల రూపాయలు టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయం.
ఇక ఈ సిరీస్ కోసం 9 కంపెనీలు స్పాన్సర్లుగా వ్యవహరించాయి. వీటికి అదనంగా క్రికెటర్లతో కలిసి డిన్నర్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి నగరంలో సుమారు 700 మంది దీనికి హాజరయ్యారు. వీటి ద్వారా సుమారు 25 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక క్రికెట్ ఆడే అన్ని దేశాల్లోనూ ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. వీటికి కూడా ప్రకటనలు బాగానే వచ్చాయి.
టీవీ రైట్స్‌కు ఎంత మొత్తం లభించిందనేది బయటకు తెలియకపోయినా... కనీసం ఓ 20 కోట్ల రూపాయలైనా వస్తుంది. మొత్తం మీద ఆల్‌స్టార్స్ సిరీస్ ద్వారా 100 కోట్ల రూపాయలకు పైనే ఆదాయం వచ్చింది. స్టేడియాలు, టిక్కెట్లు, హోటల్స్, సెక్యూరిటీ ఇలా అనేక రకాల ఖర్చులు ఉంటాయి. అన్ని పోయినా కనీసం 50 కోట్ల రూపాయలైనా దీని ద్వారా లాభం వస్తుందని అంచనా. ఇందులో ఐసీసీకి 20 శాతం వాటా ఇచ్చినా సుమారు 40 కోట్లు ఇద్దరు దిగ్గజాలకు దక్కి ఉండాలి.
క్రికెటర్లకూ లాభమే
ఈ సిరీస్‌లో ఆడినందుకు ఒక్కో క్రికెటర్‌కు 20 లక్షల రూపాయలు చెల్లించారని సమాచారం. మొత్తం 30 మందికి కలిపి సుమారు 6 కోట్ల రూపాయలు ఆటగాళ్లకు దక్కాయి. ఇదే సమయంలో మాజీలందరికీ ఇదో పెద్ద పిక్నిక్‌లా కనిపించింది.
దాదాపు అందరూ కుటుంబ సభ్యులతో కలిసి ట్రిప్‌లా వెళ్లారు. తాము ఆడే రోజుల్లో ఐపీఎల్ లేకపోవడం వల్ల ఈ మాజీలలో మెజారిటీ సభ్యులకు క్రికెట్ ద్వారా వచ్చే డబ్బు రుచి తెలియలేదు. వాళ్లందరికీ ఇప్పుడు డబ్బులు రావడంతో పాటు అమెరికాలో క్రికెట్ ఆడిన కొత్త అనుభవం కూడా లభించింది.