క్రికెట్ బంతి అతను చెప్పినట్లు మలుపులు తిరిగింది. స్పిన్ ఆనవాలు కూడా కనిపించే అవకాశం లేని పిచ్‌లపైనా బంతి గిర్రున బొంగరంలా మారిపోయింది. చక్కటి నియంత్రణ, కచ్చితత్వం అతని బౌలింగ్‌ను మరింత పదునుగా మార్చాయి. జట్టు ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా ఆ మాయాజాలం ముందు తలొంచినవారే... దశాబ్దంన్నర కాలంపాటు ఆస్ట్రేలియా క్రికెట్ ఆ మణికట్టును నమ్ముకొని ప్రపంచాన్ని ఏలింది. అతని మాయాజాలం కారణంగానే పుష్కర కాలం చిరకాల ప్రత్యర్థికి ‘బూడిద’ కూడా దక్కలేదు. అతని వల్లే ప్రపంచకప్ కంగారూల చెంత చేరింది. ఒకటా రెండా... లెక్క లేనన్ని అసాధారణ ఘనతలు ఖాతాలోకి అలవోకగా వచ్చి చేరాయి. ఆ బౌలింగ్ లయను చూస్తే అంకెలు మాత్రమే ఆ గొప్పతనాన్ని కీర్తించలేవని అర్థమవుతుంది. అంతకు మించిన ఆకర్షణ అందులో ఉంది. క్రికెట్‌పై ఎప్పటికీ చెరిగిపోలేని ఆ ముద్ర ఉంది. హీరోగా, విలన్‌గా తనకు నచ్చినట్లుగా జీవించిన స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్‌కు చివరి గుడ్‌బై! –సాక్షి క్రీడా విభాగం
అతను వేసిన బంతి పిచ్‌పై పడిన తర్వాత ఇరవై నాలుగు అంగుళాలు లోపలికి దూసుకొచ్చి స్టంప్స్‌ను ఎగరగొట్టేసింది. మణికట్టు స్పిన్ అంతర్ధానం అయిపోయిందనుకున్న రోజుల్లో అతని బంతి ఆటకు కొత్త జీవం పోసింది. లెగ్‌బ్రేక్, ఫ్లిప్పర్, జూటర్, స్లయిడర్, టాపీ, బ్యాక్ స్పిన్నర్... మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, అతని నుంచి దూసుకొచ్చిన బంతి బ్యాటర్‌ను క్రీజ్‌లో విగ్రహంలా మార్చేసింది. అతని బంతి ఎంతగా స్పిన్ అయిందో చూడాలంటే మైదానంలో కోణమానినితో కొలవాల్సిందే... సూదిమొనల ‘స్పైక్స్’ జుట్టు, రిస్ట్ బ్యాండ్, అరుదైన నీలి, ఆకుపచ్చ కళ్లతో హాలీవుడ్ నటుల లుక్‌ను తలపిస్తూ క్రికెట్‌లో అడుగుపెట్టిన 23 ఏళ్ల కుర్రాడు తర్వాతి రోజుల్లో ప్రపంచ క్రికెట్‌ను శాసించాడు. అతని ‘తిప్పుడు’ బారిన పడకపోతే చాలు అంటూ అన్ని జట్ల ఆటగాళ్లు అనుకునేలా చేశాడు. నెమ్మదిగా నాలుగు అడుగులు, చక్కటి యాక్షన్‌తో లెగ్‌స్పిన్‌ను కూడా ఒక అందమైన కళగా చూపించడం అతనికే చెల్లింది.
మెల్‌బోర్న్: ప్రపంచ క్రికెట్ అభిమానులను విషాదంలో ముంచిన అనూహ్య వార్త. స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియా స్టార్ షేన్ వార్న్ శుక్రవారం హఠాన్మరణం చెందాడు. థాయ్‌లాండ్‌లోని కోహ్ సమూయ్‌లో ఉన్న తన విల్లాలో తీవ్ర గుండెపోటుకు గురైన 52 ఏళ్ల వార్న్ మృతి చెందినట్లు అతని మేనేజర్ మైకేల్ కోహెన్ వెల్లడించాడు. ‘తన విల్లాలో వార్న్ అచేతన స్థితిలో పడి ఉన్నాడు. వైద్య బృందం తీవ్రంగా ప్రయత్నించినా అతని ప్రాణాలకు కాపాడలేకపోయింది’ అని అతను వెల్లడించాడు. భార్య సిమోన్‌తో చాలా కాలం క్రితమే విడాకులు తీసుకున్న వార్న్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. శుక్రవారం ఉదయమే మరో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రాడ్ మార్‡్ష మృతికి సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేసిన వార్న్... కొన్ని గంటల్లోనే దురదృష్టవశాత్తూ తానూ మరణించడం విషాదం. క్రికెట్ కామెంటేటర్‌గా చురుగ్గా బాధ్యత లు నిర్వహిస్తూ వచ్చిన వార్న్ ఆకస్మిక మరణం క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఆస్ట్రేలియా తరఫున 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వనే ్డల్లో 293 వికెట్లు తీసి వార్న్ ‘ఆల్‌టైమ్ గ్రేట్’ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు.
‘బాల్ ఆఫ్ ద సెంచరీ’...
జూన్ 4, 1993... మాంచెస్టర్‌లో తొలి యాషెస్ టెస్టు... ఇంగ్లండ్ ఆటగాడు మైక్ గ్యాటింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. షేన్ వార్న్ వేసిన మొదటి బంతి ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఎక్కడో లెగ్‌స్టంప్ బయట పడిన బంతి ఏకంగా రెండు అడుగులు స్పిన్ అయి ఆఫ్‌స్టంప్ బెయిల్‌ను తాకింది. ఏం జరిగిందో అంపైర్‌కు అర్థం కాలేదు. తానే కాస్త తలవంచి చూస్తుండిపోయాడు. అటు గ్యాటింగ్ అయితే అసలు నమ్మలేకపోయాడు. షాక్‌కు గురై ఆగిపోయిన అతడిని ‘బౌల్డ్’ అంటూ గుర్తు చేసి పెవిలియన్‌కు పంపించాల్సి వచ్చింది. ఈ అద్భుత దృశ్యం వార్న్ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించింది. క్రికెట్ చరిత్రలో ‘బాల్ ఆఫ్ సెంచరీ’గా నిలిచిపోయిన ఈ బంతితో వార్న్ ఘన ప్రస్థానం మొదలైంది.
తొలి టెస్టులో 45 ఓవర్లు వేస్తే దక్కింది ఒక వికెట్! తర్వాతి మ్యాచ్‌లో 23 ఓవర్లలో అదీ లేదు. స్పిన్‌కు అనుకూలించే తర్వాతి టూర్ శ్రీలంకలోనూ దాదాపు అదే పరిస్థితి. విండీస్‌లో మెల్‌బోర్న్‌లో 7 వికెట్లు తీయడం మినహా తొలి 18 టెస్టుల్లో వార్న్ బౌలింగ్‌లో ప్రమాదకర ఛాయలు ఏమీ కనిపించలేదు. కానీ తర్వాతి యాషెస్ సిరీస్ అసలైన వార్న్‌ను ప్రపంచానికి చూపించింది. అద్భుత బంతితో చిరకాల ఖ్యాతిని అందుకున్న అతను ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. ఈ సిరీస్ తర్వాత ఇంగ్లండ్ 12 ఏళ్ల పాటు వార్న్ బంతిని అర్థం చేసుకోలేకపోయిందంటే అతిశయోక్తి కాదు. వార్న్ దెబ్బతో 1993 నుంచి 2005 వరకు ఇంగ్లండ్ ‘యాషెస్’ అందుకోలేకపోయింది. చివరకు 2005లో సాధించినా ఆ సిరీస్‌లోనూ 40 వికెట్లతో వార్న్ పైచేయి ప్రదర్శించడం విశేషం. దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్... ఇలా ప్రతీ జట్టుపై ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ విజయాల్లో అతను కీలకపాత్ర పోషించాడు. భారత్ మినహా (14 టెస్టుల్లో 43 వికెట్లు, 47.18 సగటు) ప్రతీ జట్టుపై ఈ స్టార్ బౌలర్ ఆధిపత్యం కనబర్చాడు. అయితే చివరకు 2004లో ‘ఫైనల్ ఫ్రాంటియర్’ అంటూ భారత్‌లో అడుగు పెట్టిన ఆసీస్... సిరీస్‌ను గెలుచుకోవడంతో వార్న్ సంతృప్తిగా ముగించాడు. టెస్టు క్రికెట్‌లో 700 వికెట్ల మైలురాయిని దాటిన తొలి బౌలర్‌గా నిలిచిన వార్న్... సొంతగడ్డపై యాషెస్‌లో ఇంగ్లండ్‌ను 5–0తో చిత్తు చేసిన అనంతరం 2007 జనవరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు సగర్వంగా వీడ్కోలు పలికాడు.
వన్డేల్లోనూ సూపర్...
వార్న్ ఘనతలను టెస్టు కోణంలోనే ఎక్కువగా చూడటం వల్ల అతని వన్డే ఘనతల ప్రస్తావన తక్కువగా వినిపిస్తుంది. అయితే 12 ఏళ్ల వన్డే కెరీర్‌లో ఎన్నో అసమాన విజయాలు అతను అందించాడు. ముఖ్యంగా 1996 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన సెమీఫైనల్లో అతను పదునైన బౌలింగ్‌తో (4/36) జట్టును గెలిపించి ఫైనల్ చేర్చాడు. అయితే వార్న్ చిరస్మరణీయ ప్రదర్శన 1999 ప్రపంచకప్‌లో వచ్చింది.
ఈ టోర్నీ ఫైనల్లో కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ (4/33)గా నిలిచిన వార్న్... అంతకంటే అద్భుత బౌలింగ్‌ను అంతకుముందు సెమీస్‌లో నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ ’ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ వన్డే మ్యాచ్’లో కిర్‌స్టెన్, గిబ్స్, క్రానే, కలిస్ వికెట్లతో వార్న్ పండగ చేసుకున్నాడు. ప్రపంచకప్ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
వివాదాలతో సహవాసం...
షేన్ వార్న్ అద్భుత కెరీర్‌లో మరో పార్శ్వంలో పలు వివాదాలు కనిపిస్తాయి. పిచ్ వివరాలను అందించి బుకీ నుంచి డబ్బులు తీసుకోవడం, రణతుంగపై తీవ్ర వ్యాఖ్యలు చేసి రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్‌కు గురయ్యాడు. అయితే అతని కెరీర్‌లో పెద్ద దెబ్బ 2003 ప్రపంచకప్‌కు ముందు తగిలింది. నిషేధిత ఉత్ప్రేరకం డ్యురెటిక్‌ను తీసుకున్న అతను డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడు. దాంతో ఏడాది పాటు సస్పెండ్‌కు గురై వరల్డ్‌కప్ ఆరంభానికి ముందే తప్పుకోవాల్సి వచ్చింది.
బిగ్‌బాష్ లీగ్‌లో కూడా సామ్యూల్స్‌తో గొడవ పడి మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. అయితే అన్నింటికి మించి అతని వ్యక్తిగత జీవితంలో అమ్మాయిల వ్యవహారాలకు సంబంధించే పలు వివాదాలు ఉన్నాయి. వేర్వేరు మహిళలకు అసభ్యకర మెసేజ్‌లు పంపడం, అసభ్యకర చిత్రాలతో కనిపించడం వంటివి చెడ్డపేరు తేవడంతో పాటు కుటుంబ జీవితాన్ని కూడా నష్టపరిచాయి. పదేళ్ల వివాహం బంధం తర్వాత తన భార్య సిమోన్‌తో 2005లోనే విడిపోయిన వార్న్... బ్రిటిష్ నటి ఎలిజబెత్ హర్లీతో పెళ్లికి ప్రయత్నించినా చివరకు అది సాధ్యం కాలేదు. గొప్ప నాయకత్వ లక్షణాలతో కెప్టెన్సీకి సరిగ్గా సరిపోయే అర్హతలున్నా ఆస్ట్రేలియాకు టెస్టు సారథిగా వ్యవహరించే అవకాశం అతనికి ఈ కారణాల వల్లే ఎప్పటికీ రాలేదు.
ఐపీఎల్ తొలి విజేతగా...
రిటైర్మెంట్ తర్వాత కూడా షేన్ వార్న్ విలువ తగ్గలేదు. అందుకే 2008లో జరిగిన తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్తాన్ రాయల్స్ అతడిని కెప్టెన్‌గా ఎంచుకుంది.
పెద్దగా పేరు లేని కుర్రాళ్లు, అనామక ఆటగాళ్లతో కూడిన ఆ జట్టు తొలి టైటిల్ సాధించిందంటే అది పూర్తిగా వార్న్ చలవే. తన అంతర్జాతీయ అనుభవాన్నంతా రంగరించి అతను యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు. ప్రతీ దశలోనూ వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ విజయం దిశగా నడిపించడం విశేషం.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
షేన్ వార్న్ కెరీర్ గ్రాఫ్
టెస్టులు 145
వికెట్లు 708
ఉత్తమ బౌలింగ్ 8/71
ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు 37 సార్లు
మ్యాచ్‌లో 10 వికెట్లు 10 సార్లు
చేసిన పరుగులు 3,154
అత్యధిక స్కోరు 99
వన్డేలు 194
వికెట్లు 293
ఉత్తమ బౌలింగ్ 5/33
చేసిన పరుగులు 1,018
అత్యధిక స్కోరు 55
- 708 టెస్టుల్లో షేన్‌వార్న్ వికెట్ల సంఖ్య. మురళీధరన్ (800) తర్వాత రెండో స్థానం.
- 96 2005లో వార్న్ తీసిన వికెట్ల సంఖ్య. ఒక ఏడాదిలో ఇదే అత్యధిక వికెట్ల రికార్డు
- 3154 టెస్టుల్లో వార్న్ పరుగులు. కెరీర్‌లో ఒక సెంచరీ కూడా లేకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు
Comments
Please login to add a commentAdd a comment