గంగూలీకి కెప్టెన్సీ, సచిన్‌కు ఫోర్త్ ప్లేస్..!
మెల్‌బోర్న్: సౌరవ్ గంగూలీకి కెప్టెన్సీ, సచిన్ టెండూల్కర్‌కు నాలుగో చోటు.. ఇది ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ప్రకటించిన అత్యుత్తమ భారత టెస్టు జట్టు. తను ఆడిన అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన వివిధ దేశాల్లో సర్వోత్తమ జట్లను షేన్‌వార్న్ ఇటీవల తన ఫేస్‌బుక్ పేజీలో ప్రకటిస్తూ వస్తున్నాడు. తాజా ఆయన దృష్టి భారత్ మీద పడింది. అందుకే తాను ఎదుర్కొన్న భారత దిగ్గజాలతో కూడిన అత్యుత్తమ జట్టును ప్రకటించాడు.
తన కెప్టెన్సీతో భారత జట్టుకు దేశవిదేశాల్లో ఎన్నో విజయాలు అందించిన గంగూలీని ఈ జట్టుకు నాయకుడిగా ప్రకటించాడు. అదేవిధంగా ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూలను ఎంపిక చేశాడు. ఎలాంటి ఆశ్చర్యానికి తావులేకుండా టెస్టుల్లో తన సుస్థిర స్థానమైన నాలుగో స్థానాన్నే సచిన్‌కు కట్టబెట్టాడు. వన్‌డౌన్‌లో పెట్టని గోడ రాహుల్ ద్రావిడ్‌ను ఎంచుకున్నాడు. ఇక ఆరోస్థానం విషయంలో మాత్రం వార్న్ డైలమాలో పడ్డాడట. ఈ స్థానానికి వీవీఎస్ లక్ష్మణ్‌ను ఎంచుకోవాలో? లేక అజారుద్దీన్‌ను ఎంచుకోవాలో తెలికయ తికమక పడ్డానని ఆయన వివరించాడు. వాళ్లిద్దరిలో ఎవరినీ పక్కనబెట్టలేక మొత్తానికి 12 మందితో కూడిన జట్టును ప్రకటించాడు. ఆడేరోజు వస్తే ఎవరినో ఒకరిని ఎంచుకోవచ్చన్న ధీమాతో..
'ఈ జట్టును ఎంపిక చేయడం చాలా కష్టంతో కూడిన పని. ఎందుకంటే వెంగసర్కార్, సంజయ్ మంజ్రేకర్, రవిశాస్త్రి, మనోజ్ ప్రభాకర్ వంటి దిగ్గజాలు రిటైరయ్యే సమయంలో వారిని కూడా నేను ఎదుర్కొన్నా. అదేవిధంగా ప్రస్తుత ప్రముఖ ఆటగాళ్లైనా జహీర్‌ఖాన్ వంటివాళ్లతోనూ ఆడాను' అని షేర్‌వార్న్ వివరించాడు. అంతేకాకుండా లెజండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్, ప్రస్తుత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీలకు కూడా తన కలల భారత జట్టులో స్థానం కల్పించాడు. వాస్తవానికి ధోనీ షేన్ వార్న్ బౌలింగ్‌ను ఎదుర్కొనలేదు. కానీ వీరిద్దరు ఐపీఎల్ తలపడ్డారు. ఆ లెక్కప్రకారం ధోనీకి చాన్స్ ఇచ్చినట్టు వార్న్ తెలిపాడు. ఈ జట్టు బౌలింగ్ లైనప్ కూడా అనిల్‌కుంబ్లే, హర్భజన్ సింగ్, జవగళ్ శ్రీనాథ్ తదితరులతో పటిష్టంగా ఎంచుకున్నాడు.
వార్న్ గ్రేటెస్ట్ ఇండియన్ టెస్ట్ టీం ఇలా ఉంటుంది.
వీరేంద్ర సెహ్వాగ్ , నవజ్యోతి సింగ్ సిద్ధూ , రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ , సౌరవ్ గంగూలీ, మహ్మద్ అజారుద్దీన్ , కపిల్ దేవ్ , ధోనీ, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జవగళ్ శ్రీనాథ్ ( వివిఎస్ లక్ష్మణ్ 12 వ)