జైస్వాల్- గిల్ (PC: BCCI)
టీమిండియా టీ20 కొత్త ఓపెనింగ్ జోడీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ జంటను చూస్తుంటే తనకు సౌరవ్ గంగూలీ- సచిన్ టెండుల్కర్ గుర్తుకువస్తున్నారని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ టైటిల్ విజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ ఐసీసీ టోర్నీల్లో రోహిత్- విరాట్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఫలితంగా.. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ప్రపంచకప్ ప్రధాన జట్టుకు ఎంపికైనా బెంచ్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు.. భవిష్య కెప్టెన్ శుబ్‌మన్ గిల్ రిజర్వ్ ప్లేయర్లలో ఒకడిగా జట్టుతో ప్రయాణించాడు. అయితే, దిగ్గజ బ్యాటర్లు కోహ్లి- రోహిత్ రిటైర్మెంట్ తర్వాత పొట్టి ఫార్మాట్లో యశస్వి- గిల్ జోడీ ఓపెనింగ్‌కు వస్తున్నారు.
వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత భారత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లగా.. శుబ్‌మన్ గిల్ తొలిసారిగా టీమిండియా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో గెలిచాడు. ఈ టూర్‌లో యశస్వి- గిల్ ఎక్కువసార్లు ఓపెనింగ్ చేశారు. తాజాగా శ్రీలంక పర్యటనలోనూ వీరే టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించారు.
టీమిండియా లంకతో టీ20 సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప సోనీ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. యశస్వి- గిల్ జోడీని గంగూలీ- సచిన్‌లతో పోల్చాడు.
వాళ్లు ఆడుతుంటే గంగూలీ- సచిన్ గుర్తుకువస్తారు
‘‘వీళ్లిద్దరిని చూస్తే నాకు సౌరవ్ గంగూలీ- సచిన్ టెండుల్కర్ గుర్తుకువస్తారు. వాళ్లిద్దరు ఎలా పరస్పరం అవగాహనతో ఆడేవారో.. వీరూ అలాగే చేస్తారు. తమవైన వ్యూహాలు అమలు చేస్తూనే.. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పుతారు. వీళ్లిద్దరు కలిసి బ్యాటింగ్ చేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. ఇక జైస్వాల్ గురించి చెప్పాలంటే.. త్వరలోనే అతడు వన్డేల్లో కూడా ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలడు.
టెస్టు, టీ20 క్రికెట్‌లో ఇప్పటికే టీమిండియా తరఫున తానేంటో నిరూపించుకున్నాడు. వన్డేల్లోనూ రాణించగలడు. పరుగులు చేయడమే పరమావధిగా ముందుకు సాగుతున్న అతడికి ఇదేమీ అసాధ్యం కాదు’’ అని రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. కాగా యశస్వి గంగూలీ మాదిరే ఎడమచేతి వాటం బ్యాటర్ కాగా.. గిల్ సచిన్‌లా రైట్‌హ్యాండ్ బ్యాటర్.
Comments
Please login to add a commentAdd a comment