రాజ్యసభలో సచిన్
రాజ్యసభలో సచిన్
Published Tue, Aug 6 2013 1:27 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
న్యూఢిల్లీ:మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సోమవారం రాజ్యసభ సమావేశాలకు హాజరయ్యాడు. నల్ల ప్యాంటు, నీలి రంగు గీతల చొక్కా ధరించిన మాస్టర్ వర్షాకాల సమావేశం తొలి రోజు చర్చలను ఆసక్తిగా ఆలకించాడు. గతేడాది సచిన్ రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రాజీవ్ శుక్లాతో కలిసి సభలోకి అడుగుపెట్టిన సచిన్... ఈ సమావేశాలకు హాజరవడం ఇది రెండోసారి.
గతేడాది వర్షాకాల సమావేశాలకు కూడా ఓసారి హాజరయ్యాడు. సభలోనే ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ దగ్గరకు వెళ్లి సచిన్ కరచాలనం చేశాడు. సినీ రచయిత జావేద్ అక్తర్ పక్కనే కూర్చున్న ఈ దిగ్గజ క్రికెటర్ ఆయనతో సంభాషిస్తూ కనిపించాడు. అలాగే ఇటీవలే ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ, జింబాబ్వే పర్యటనలో సిరీస్ గెలిచిన భారత జట్టును చైర్మన్ హమీద్ అన్సారీ అభినందించగా సచిన్ కూడా తన ముందున్న బల్లపై చరుస్తూ హర్షం వ్యక్తం చేశాడు. మరోవైపు అతిథుల గ్యాలరీలో భార్య అంజలి కూర్చుని సభా కార్యక్రమాలను తిలకించారు.
Advertisement
Advertisement