IND Vs PAK: కోహ్లి సరికొత్త చరిత్ర.. భారత్‌ తరఫున తొలి ఆటగాడిగా అరుదైన ఫీట్‌ | CT 2025 Ind Vs Pak: Virat Kohli Creates History Becomes India Leading, Read Full Story For More Information | Sakshi
Sakshi News home page

CT 2025 IND Vs PAK: కోహ్లి సరికొత్త చరిత్ర.. భారత్‌ తరఫున తొలి ఆటగాడిగా అరుదైన ఫీట్‌

Published Sun, Feb 23 2025 7:18 PM | Last Updated on Mon, Feb 24 2025 1:46 PM

CT 2025 Ind vs Pak: Virat Kohli Creates History Becomes India Leading

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి(Virat Kohli) సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు(Most Catches) పట్టిన ఫీల్డర్‌గా అరుదైన ఘనత సాధించాడు. దాయాది పాకిస్తాన్‌(India vs Pakistan)తో మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి ఈ ఫీట్‌ నమోదు చేశాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును ఈ మాజీ సారథి బద్దలు కొట్టాడు.

241 పరుగులకు పాక్‌ ఆలౌట్‌
చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భాగంగా గ్రూప్‌-‘ఎ’లో ఉన్న భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడింది. దుబాయ్‌లో గురువారం నాటి మ్యాచ్‌లో బంగ్లాను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తాజాగా అదే వేదికపై చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టిన భారత్‌ 241 పరుగులకు దాయాదిని ఆలౌట్‌ చేసింది.

బాబర్‌ ఆజం(23), సౌద్‌ షకీల్‌(62) రూపంలో రెండు కీలక వికెట్లను హార్దిక్‌ పాండ్యా దక్కించుకోగా.. కుల్దీప్‌ యాదవ్‌ సల్మాన్‌ ఆఘా(19), షాహిన్‌ ఆఫ్రిది(0), నసీం షా(14)లను అవుట్‌ చేశాడు. ఇక అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా, హర్షిత్‌ రాణా ఒక్కో వికెట్‌ తీయగా.. అక్షర్‌ పటేల్‌ ఇమామ్‌-ఉల్‌-హక్‌(10), హ్యారిస్‌ రవూఫ్‌(8) రనౌట్లలో భాగమయ్యాడు.

 

 

కోహ్లి సరికొత్త చరిత్ర
అయితే, ఈ మ్యాచ్‌లో కోహ్లి రెండు సూపర్‌ క్యాచ్‌లు అందుకుని తన పేరును చరిత్రలో పదిలం చేసుకున్నాడు. తొలుత కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో నసీం షా ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్న కోహ్లి.. అనంతరం హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో ఖుష్దిల్‌ షా(38) ఇచ్చిన క్యాచ్‌ను అద్భుత రీతిలో అందుకున్నాడు. 

ఈ క్రమంలో టీమిండియా తరఫున వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా కోహ్లి నిలిచాడు. అంతకు ముందు మహ్మద్‌ అజారుద్దీన్‌ పేరిట ఈ రికార్డు ఉండేది. ఇప్పుడు కోహ్లి దానిని బద్దలు కొట్టాడు. ఇక జాబితాలో ఓవరాల్‌గా శ్రీలంక స్టార్‌ మహేళ జయవర్దనే(218), ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్‌(160) ఈ జాబితాలో టాప్‌-2లో కొనసాగుతున్నారు.

వన్డేల్లో టీమిండియా తరఫున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్లు
1. విరాట్‌ కోహ్లి- 158
2. మహ్మద్‌ అజారుద్దీన్‌- 156
3. సచిన్‌ టెండుల్కర్‌- 140
4. రాహుల్‌ ద్రవిడ్‌- 124
5. సురేశ్‌ రైనా- 102.

చాంపియన్స్‌ ట్రోఫీ-2025: టీమిండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ తుదిజట్లు
టీమిండియా
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్‌ రాణా, మహ్మద్‌ షమీ, కుల్దీప్‌ యాదవ్‌.

పాకిస్తాన్‌
సౌద్‌ షకీల్‌, బాబర్‌ ఆజం, ఇమామ్‌-ఉల్‌ -హక్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ (కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), సల్మాన్‌ ఆఘా, తయ్యబ్‌ తాహిర్‌, ఖుష్దిల్‌ షా, షాహిన్‌ అఫ్రిది, నసీం షా, హ్యారిస్‌ రవూఫ్‌, అబ్రార్‌ అహ్మద్‌.

చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్‌ చర్యకు హర్షిత్‌ రాణా రియాక్షన్‌ వైరల్‌.. గంభీర్‌ కూడా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement