బీసీసీఐ అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్!
► కార్యదర్శిగా అజయ్ షిర్కే
► ఏజీఎమ్‌లో ఎన్నుకునే అవకాశం
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా... ప్రస్తుత కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఎన్నికయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈస్ట్‌జోన్‌లోని ఆరు క్రికెట్ సంఘాలు ఆయనకు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాయి. దీంతో ఈనెల 22న జరిగే బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎమ్)లో ఠాకూర్ ఎన్నిక లాంఛనమే కానుంది. శశాంక్ మనోహర్ రాజీనామా తర్వాత అధ్యక్ష పదవి రేసులో ఠాకూర్ మొదట్నించీ ముందు వరుసలో ఉన్నారు.
మరోవైపు బీసీసీఐ కార్యదర్శి పగ్గాలు అజయ్ షిర్కే చేపట్టే అవకాశాలు కనబడుతున్నాయి. శ్రీనివాసన్ హయాంలో కోశాధికారిగా పని చేసిన షిర్కే స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. 22న జరగాల్సిన బీసీసీఐ ఎన్నికలను ఆపాలని బీహార్ క్రికెట్ సంఘం (క్యాబ్) బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది.