న్యూఢిల్లీ: ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ)లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న విభేదాలు రచ్చకెక్కాయి. ఆదివారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) సందర్భంగా సభ్యులు ఒకరిపై మరొకరు నేరుగా చేయి చేసుకున్నారు. అధికార వర్గానికి చెందిన సంయుక్త కార్యదర్శి రంజన్ మన్‌చందాను ప్రత్యర్థి వర్గం ప్రతినిధి మఖ్సూద్ ఆలమ్ చెంపదెబ్బ కొట్టగా... స్థానిక ఎమ్మెల్యే కూడా అయిన ఓం ప్రకాశ్ శర్మపై కూడా వినోద్ తిహారాకు చెందిన వ్యక్తులు దాడికి దిగారు. ఇంత గొడవ మధ్యలో కూడా అన్ని తీర్మానాలకు ఆమోదం లభించినట్లు ఢిల్లీ క్రికెట్ సంఘం అధికారికంగా ప్రకటించింది. జస్టిస్ బదర్ అహ్మద్ స్థానంలో కొత్తగా జస్టిస్ దీపక్ వర్మను కొత్త అంబుడ్స్‌మన్‌గా నియమించారు. ‘ఢిల్లీ క్రికెట్ సంఘం అతి ఘోరంగా సున్నాకే ఆలౌటైంది. కొందరు సంఘం పరువు తీస్తున్నారు. ఈ సంఘాన్ని వెంటనే రద్దు చేయాలని బీసీసీఐ, గంగూలీకి విజ్ఞప్తి చేస్తున్నా. అవసరమైతే తప్పు చేసినవారిపై జీవితకాల నిషేధం కూడా విధించండి’ అని భారత మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ తాజా ఘటనపై వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment